బడుగుజీవుల కడుపుకొట్టి... | TDP leader Student Uniform Contract Sewing | Sakshi
Sakshi News home page

బడుగుజీవుల కడుపుకొట్టి...

Published Tue, Feb 10 2015 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

బడుగుజీవుల కడుపుకొట్టి...

బడుగుజీవుల కడుపుకొట్టి...

 టీడీపీ నేతకు విద్యార్థుల యూనిఫాం కుట్టు కాంట్రాక్ట్
  రాజీవ్ విద్యా మిషన్ ఎస్‌పీడీ లేఖతో చర్యలు చేపట్టిన అధికారులు
  స్థానిక టైలర్లను కాదని ఆ నేతకే ఇవ్వాలంటూ పరోక్ష ఆదేశం
  అదే పనిలో కిందిస్థాయి వర్గాలు..ఉపాధి కోల్పోతున్న జిల్లాలోని టైలర్లు

 
 రడీమేడ్ దుస్తులరంగప్రవేశంతో పనిలేక  అల్లాడుతున్న టైలర్లకు స్కూల్ యూనిఫాంలు ఓ వరంగా మారాయి. జిల్లాలో నాలుగు లక్షల జతలు కుట్టేందుకు అవకాశం ఉండడంతో చాలా మంది టైలర్లకు నాలుగు నెలలపాటు పని లభిస్తోంది. అయితే ఇప్పుడు వారి ఉపాధిని ఓ పచ్చనేత తన్నుకుపోతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతకు దుస్తులు కుట్టే పని అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. కొన్ని మండలాల కాంట్రాక్ట్‌ను  ఇప్పటికే ఆయనకు అప్పగించినట్టు తెలిసింది.
 
 బడుగుజీవుల కడుపుకొట్టి...
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :   ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకిచ్చే యూనిఫాంల్ని కుట్టే బాధ్యతను జిల్లాలోని టైలర్లకు కాకుండా గుంపగుత్తగా చిత్తూరు జిల్లాలోని  తన సొంత నియోజకవర్గానికి చెందిన నరేంద్ర చౌదరి అనే టీడీపీ నేతకు  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టబెడుతున్నారు. ఈమేరకు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికారులు సైతం తూ.చా తప్పకుండా ఎంఈఓలను ఆదేశించారు. ఇంకేముంది   సదరు నేతకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు చర్యలు చకచకా సాగిపోతున్నాయి.      ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రెండేసి జతలు యూనిఫాంలు కుట్టించి ఇస్తుంది.
 
  ముందుగా యూనిఫామ్ వస్త్రాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ)లకు  పంపించాలి. అలా వచ్చిన వస్త్రాన్ని స్థానికంగా ఉన్న టైలర్ల ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయాలి. ఒక్కొక్క జతకు  రాజీవ్ విద్యా మిషన్ ద్వారా రూ.40 చొప్పున టైలర్లకు  చెల్లిస్తారు.   ఈ విధంగా చేయడం వల్ల టైలర్లకు, వారి వద్ద పనిచేసే వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. కానీ ఈసారి విద్యార్థుల యూనిఫాంలపై చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆర్‌సీ పురం మండలం ఎస్‌ఆర్ కమ్మపల్లికి చెందిన నరేంద్ర చౌదరి కన్ను పడింది. ఆయన సీఎం  చంద్రబాబు నాయుడిని కలియడంతో లైన్‌క్లియర్  అయింది.  ముందుగా ఆ నేత రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్‌కి రిక్విజేషన్ పెట్టుకోగా, ఆ మేరకు   జిల్లాలకు ఉత్తర్వులొచ్చాయి.
 
  నరేంద్రచౌదరి రిక్వెస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సదరు లేఖలో పేర్కొన్నారు. దీంతో రాజీవ్ విద్యా మిషన్ అధికారులు కలెక్టర్‌కు ఫైలు పెట్టారు. ఆ ఫైలుపై కలెక్టర్ కూడా నరేంద్ర చౌదరి రిక్వెస్ట్‌ను పరిశీలించాలని నోట్ రాశారు. దీంతో ఇటీవల ఎంఈఓలతో జరిగిన సమావేశంలో  రాజీవ్ విద్యా మిషన్ పీఓ...విషయం  చెప్పడమే కాకుండా కుట్టు కాంట్రాక్ట్‌ను అప్పగించాలని పరోక్షంగా సూచించారు. దీంతో ఎంఈఓలు ఇరకాటంలో పడ్డారు, స్థానిక టైలర్లకు కాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన వారికిస్తే ఎలా అని, స్థానికులేమైపోవాలని, వారికేం సమాధానం చెప్పాలని, కుట్టడంలో తేడా వస్తే ఎవరు బాధ్యులని ఆంతర్మథనంలో పడ్డారు.  అయినప్పటికీ అధికారులు చెప్పినట్టు వినక తప్పదని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అదే తరహాలో ఆదేశాలిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచే సూచన ప్రాయ డెరైక్షన్ రావడంతో ఏ స్థాయిలోనూ అధికారులు అడ్డు చెప్పడం లేదు. దీంతో చిత్తూరు టీడీపీ నేత నరేంద్ర చౌదరికి యూనిఫాంలు కుట్టే కాంట్రాక్ట్‌ను అప్పగించే పనిలో సంబంధిత వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కొన్ని మండలాల యూనిఫాంల కాంట్రాక్ట్‌ను ఇచ్చేసినట్టు తెలిసింది. మరికొన్ని ఒకటి రెండు రోజుల్లో అప్పగించనున్నాయి.  మొత్తానికి ఉన్నత స్థాయి ఆదేశాలు కావడంతో స్థానిక టైలర్ల కడుపు కొడుతున్నారు.
 
 జిల్లాలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండేసి జతలు చొప్పున నాలుగు లక్షల జతల  యూనిఫాంలు కుట్టించి అందజేయాలి. ఇవన్నీ స్థానిక టైలర్లకు ఇచ్చినట్టయితే వారికి నాలుగైదు నెలల పాటు  జీవనోపాధి లభిస్తుంది. యూనిఫాంల కుట్టే సీజనొచ్చినప్పుడు సంబంధిత కుటుంబాలన్నీ  టైలరింగ్ పనిలో నిమిగ్నమవుతాయి. ఇప్పుడేకంగా బల్క్‌లో టీడీపీ నేతకు అప్పగించడంతో వీరంతా ఉపాధిని కోల్పోయే పరిస్థితి నెలకోనుంది. స్థానికంగా వదిలేసి ఎక్కడో ఉన్న నేతకు ఇవ్వడమేంటని సంబంధిత వర్గాలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ అడుగుతున్న నేతకు ఈ విషయంలో  ఏమాత్రం అనుభవం లేదని, అలాంటి వ్యక్తికి ఎలా అప్పగిస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.    దీనిపై సోమవారం జరిగిన గ్రీవెన్‌సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  ఇదే విషయమై రాజీవ్ విద్యా మిషన్ పీఓ నాగమణిని ’సాక్షి’ వివరణ కోరగా ఎస్‌పీడీ నుంచి రిక్విజేషన్ వచ్చిందని, దాన్ని కలెక్టర్‌కు పంపించామని, ఆయన కూడా పరిశీలించమని సూచించారని, ఆ మేరకు ఎంఈఓలకు మౌఖికంగా చెప్పానని తెలిపారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను అడిగి తీసుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన వారికి చెప్పడం జరిగిందన్నారు.  ఇందులో తన ప్రమేయమేది లేదన్నారు. తనకొచ్చిన ఎస్‌పీడీ లేఖ ప్రకారమే నడుచుకున్నానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement