సాక్షి, నల్లగొండ: రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అనర్హత కారణంగా ఇటీవల తొలగింపునకు గురైన మహిళా అకౌం టెంట్లను ఆర్వీఎం అధికారులు అనధికారికంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీరితోనే ప్రతినెలా అకౌంట్లు చేయిస్తున్నారని తెలిసింది. అంతేగాక కార్యాల యానికి సంబంధించిన ఫోన్‌నంబర్లు కూడా వినియోగిస్తున్నారని వినికిడి. వీరికి ఇతర రాష్ట్రాల వర్సిటీ డిగ్రీ పట్టాలిచ్చి అధికారికంగా విధుల్లోకి తీసుకునే యత్నాలు సాగుతున్నట్లు తెలిసింది.
కథాకమామిషు..
జిల్లా ఆర్వీఎం పరిధిలో 19 కేజీబీవీలు న్నాయి. ఇందులో అకౌంటెంట్‌గా పనిచేయాలంటే అభ్యర్థికి కచ్చితంగా బీకాం డిగ్రీ ఉండాలి. ఈ అర్హత లేకపోవడంతో 9మంది మహిళా అకౌంటెంట్లను ఈ ఏడాది జూన్‌లో తొలగించారు. వారు హైకోర్టును ఆశ్రయించి కొంతకాలానికి పట్టాలు సాధిస్తామని, అప్పటివరకు కొనసాగించాలని వాదనలు వినిపించారు. అయితే, హైకోర్టు వీరి వాదనను తోసిపుచ్చింది. సంబంధిత సబ్జెక్టులో పట్టాలేకుండా అకౌంట్లు ఎలా చూస్తారని, ఇది సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతేగాక విధుల నుంచి తొలగించాలని ఆగస్టు 20న ఆదేశించింది. స్పందించిన జిల్లా ఆర్వీఎం అధికారి వారిని పక్కనబెట్టినట్టు చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 28న 14 బి సర్క్యులర్‌ను అకౌంటెంట్లు తొలగింపునకు గురైన అన్ని కేజీబీవీలకు పంపారు.
అనధికారికంగా కొనసాగింపు..
తొలగింపునకు గురైనవారు ఎట్టిపరిస్థితుల్లోనూ విధులకు హాజరు కాకూడదు. అయితే కొంతమంది అక్టోబర్, నవంబర్ నెలలో కూడా విధులకు హాజరయ్యారు. కొందరు ఈ నెల నుంచి అడపా దడపా కేజీబీవీలకు వెళ్తుండగా, ఇంకొందరు ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. అంతేగాక ఆర్వీఎంకు సంబంధించిన మొబైల్ నంబర్లనే వినియోగిస్తున్నారు. కేజీబీవీలకు సంబంధించిన బిల్లుల కోసం జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీటన్నింటి దృష్ట్యా... విధుల నుంచి తొలగించారా? లేక కొనసాగుతున్నారా? అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ తతంగం అంతా ఆర్వీఎంలోని కొందరు దర్శకత్వంలోనే సాగుతోందని తెలుస్తోంది.
పట్టా అందించి..ఆ తర్వాత విధుల్లోకి?
విధుల నుంచి తొలగించినా అక్టోబర్, నవంబర్ మాసాల్లో కొంతమంది అకౌం టెంట్లు విధుల్లో కొనసాగారు. అయితే వీరి వేతనాలు చెల్లింపుల విషయంలో ఆర్వీఎం పెద్దలు చాకచక్యంగా వ్యవహరించారు. వేతనాలు చెల్లిస్తే సదరు అభ్యర్థులు అధికారికంగా విధుల్లో ఉన్నట్లే. దీంతో ఎక్కడ దొరికిపోతామోనని ముందస్తు వ్యూహంలో భాగంగా ఆ రెండు నెలలకు సంబంధించిన వేతనాలు నిలిపివేశారు. వీరికి బీకాం పట్టా అందజేసి, ఆ తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న యోచ నలో ఉన్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోని (గుర్తింపులేని) యూనివర్సిటీల నుంచి తెప్పించి బీకాం పట్టా అప్పజెప్పేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. తద్వారా ఈ పట్టాలు చూపెట్టి తొలగింపునకు గురైన అభ్యర్థులను విధుల్లోకి తీసుకునేలా ముందే ఒప్పందానికి వచ్చినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం అభ్యర్థుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారని సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే వేతనాలు నిలిపివేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది. అంతేగాక ఈ తతంగ సూత్రధారి, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మా దృష్టికి రాలేదు... : బాబూ భూక్యా, ఆర్వీఎం పీఓ
తొలగింపునకు గురైన అకౌంటెంట్లు అనధికారికంగా విధుల్లో కొనసాగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. అటువంటి అవకాశమే ఉండదు. దీనిపై పూర్తిగా మీరు ఎగ్జామిన్ చేయండి. వచ్చిన ఆరోపణలు నిజం కావాలని లేదుగా? ఎస్పీడీ నుంచి వచ్చిన డెరైక్షన్లనే మేం ఫాలో అవుతాం.
పట్టాలెక్కించే యత్నం?
Published Fri, Dec 13 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement