
మూతదిశగా 46 పాఠశాలలు!
- జిల్లాలో 3957 ప్రాథమిక పాఠశాలలు
- 46 పాఠశాలల్లో 10 మందిలోపే విద్యార్థులు
- వీటి మనుగడ అనుమానమే
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాపక్షోత్సవాలు, స్పెషల్ డ్రైవ్‌లంటూ హడావుడి చేస్తుంటారు రాజీవ్ విద్యామిషన్ అధికారులు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. మొత్తం 46 ప్రాథమిక పాఠశాలలు మూతదిశగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 3,957 ప్రాథమిక పాఠశాలలు ఉన్నా యి. వీటిలోని 4 6పాఠశాలల్లో 10 మం దిలోపు విద్యార్థులున్నారు. ఇటీవల నిర్వహించిన యూడైస్ సర్వేలో ఈ విషయం తేలింది. గత విద్యాసంవత్సరం ప్రారంభంలో జిల్లాలో సుమారు 320 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. వీరిని సమీపంలోని పాఠశాలలకు పంపి 320 పాఠశాలలను మూసేశారు.
ఏ మండలంలో ఎన్ని?
మొత్తం 31 మండలాల్లోని 46 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులున్నట్లు సర్వే ద్వారా తేలింది. బి.కొత్తకోటలో- 1, బంగారుపాళంలో-1, చంద్రగిరిలో- 1, చిన్నగొట్టిగల్లులో-1, చిత్తూరులో- 3, గంగాధరనెల్లూరులో-3, గుడిపాల లో-1, గుడుపల్లెలో-1, గుర్రంకొండలో -1, ఐరాలలో-2, కేవీపల్లెలో-1, కలికిరిలో-2, కార్వేటినగరంలో-1, మదనపల్లెలో-1, పలమనేరులో-1, పాలసముద్రంలో-1, పీలేరులో-1, పులిచెర్లలో- 2, పూతలపట్టులో-2, రామకుప్పంలో -2, రొంపిచెర్లలో-2, శాంతిపురంలో- 1, సదుంలో-1, సోమలలో-2, శ్రీకాళహస్తిలో-1, తంబళ్లపల్లెలో-2, తవణంపల్లెలో-2, వి.కోటలో-1, వాయల్పాడులో-2, విజయపురంలో-1, ఎర్రావారి పాళెంలో-3 పాఠశాలలున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయుల్లో శ్రద్ధ లేని కారణంగానే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.