ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల స్థాయిని పెంచేందుకు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రాష్ట్ర అధికారులు వేసవి సెలవుల్లో శిబిరాలు ప్రారంభించారు. లక్ష్యం మంచిదే అయినా జిల్లాలో తరగతులు నామమాత్రంగా సాగుతున్నాయి. ఆచరణలో అమ లు కాకపోవడంతో లక్ష్యం సాధించడం అనుమానంగానే ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు ఈ వేసవిలో తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 275 క్లస్టర్ పాఠశాలల్లో వేసవి శిబిరాలు జరగాలి.
సీఆర్పీలు విద్యాబోధన చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 252 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. మిగిలిన 23 క్లస్టర్ పాఠశాలల్లో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్‌తో విద్యాబోధన చేయించాలని అధికారులు నిర్ణయించారు. వీరు వారం రోజులు తరగతులు బోధించారు. వీరికి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వే చేయించాలని ఎస్పీడీ నుంచి ఆదేశాలు రావడంతో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్ వెళ్లారు. కానీ, వీరు శిబిరాలకు వెళ్లకపోవడంతో తెరుచుకోవడం లేదు. ఆర్వీఎం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా ఆలోచించడం లేదు.
నామాత్రంగానే తరగతులు
జిల్లాలో వేసవి శిబిరాలకు 11,158 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 1,2 తరగతుల విద్యార్థులు 4,852 మంది, 3,4,5 తరగతుల విద్యార్థులు 6,306 మంది వేసవి శిబిరాలకు హాజరుకావాలి. కానీ, కనీసం సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరుకావడం లేదు. విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంతోపాటు ఆటాపాటాలు నేర్పాలి. వర్క్‌పుస్తకాల ఆధారంగా వారికి కృత్యాలు నేర్పాలి. ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను ‘ బీ’గాని ‘ఏ’ గ్రేడ్ విద్యార్థులుగా తయారు చేయాలి.
కానీ, తరగతులు అంతంతా మాత్రంగానే జరగడంతో విద్యార్థులకు ప్రయోజనం శూన్యం. కాగా, శిబిరాలు ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు తరగతులు జరగాలి. సీఆర్పీలు సమయపాలన పాటించకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు తెరుచుకోవడంలేదు. ఈ శిబిరాలకు విద్యార్థులు రాకపోవడంతోనే పాఠశాలలను తెరవడం లేదని కొంత మంది సీఆర్పీలు పేర్కొంటున్నారు. సీఆర్పీలు వచ్చిన చోట విద్యార్థులు రావడం లేదు. విద్యార్థులు వచ్చిన చోట సీఆర్పీలు కానరావడం లేదు. దీంతో పరిస్థితి భిన్నంగా మారింది.
అధికారుల పర్యవేక్షణ కరువు
వేసవి శిబిరాలను రాజీవ్ విద్యామిషన్ అధికారులతోపాటు మండల విద్యాధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో తరగతులు సక్రమంగా జరగడం లేదు. కొంత మంది సీఆర్పీలు వేసవి శిబిరాలకు రావడం లేదు. ఈ విషయమై ఆర్వీఎం ఏఎంవో గంగయ్యను అడుగగా.. శిబిరాలు సక్రమంగానే నిర్వహిస్తున్నామని, సీఆర్పీలు లేని చోట విద్యావలంటీర్లను నియమించాలని మండల విద్యాధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు.
వేసవి శిబిరాలు అస్తవ్యస్తం
Published Sat, May 31 2014 12:34 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement