Resource Persons
-
‘మెప్మా’.. కేసు కదలదేమి చెప్మా!
సాక్షి, హైదరాబాద్: అది కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్.. నలుగురు కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఓ టీఎంసీ, మరికొందరు రిసోర్సు పర్సన్లు... బ్యాంకు అధికారులతో కుమ్మక్కై 64 నకిలీ మహిళా సంఘాలను సృష్టించారు. రూ.కోట్లలో బ్యాంకులకు టోకరా పెట్టారు. దీనిపై మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు విచారణ జరిపి రూ.3.20 కోట్ల రుణ కుంభకోణం జరిగినట్లు నిర్ధారించారు. ఒక టీఎంసీని, సీవోను సస్పెండ్ చేసి, మరో ముగ్గురు సీవోలకు షోకాజ్ నోటీసులిచ్చారు. బ్యాంకుల అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదుచేశారు. ఆ తర్వాత యథావిధిగా స్థానిక కార్పొరేటర్లు, పెద్ద నాయకులు రంగ ప్రవేశం చేయగా... ఓ సీవోను అరెస్టు చేయడం మినహా ఎలాంటి చర్యలు లేవు. ఏడాది దాటినా రికవరీ లేదు. కేసుల దర్యాప్తు కూడా ముందుకు సాగడం లేదు. ఈ బోగస్ రుణాల కుంభకోణం ఒక్క కరీంనగర్ కార్పొరేషన్తోనే ఆగలేదు. వరంగల్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లతోపాటు నల్లగొండ, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్ధిపేట తదితర మునిసిపాలిటీల్లోనూ సాగింది. అన్నిచోట్లా భారీస్థాయిలో రుణ కుంభకోణం సాగినట్లు తెలుస్తోంది. సంఘానికి రూ.7.50 లక్షల వరకు రుణం నకిలీ మహిళా సంఘాల పేరిట దందాలు 2015లో మొదలైనా 2018, 2019లలో అనేక నగరాలు, పట్టణాల్లో ఈ తతంగం సాగింది. కరీంనగర్లో 64 సంఘాల ద్వారా 3.20 కోట్లు రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. దీంతో సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ రాష్ట్రవ్యాప్తంగా రుణాల మంజూరు, రికవరీలపై దృష్టి పెట్టగా.. చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తేలింది. రిసోర్స్ పర్సన్ల ద్వారా ఒక బోగస్ సంఘాన్ని ఏర్పాటు చేయించి, బ్యాంకు అధికారులతో కలిసి మహిళల ఫొటోలు, పేర్లతోపాటు ఆధార్ నుంచి బ్యాంకు అకౌంట్ వరకు నకిలీవి సృష్టించి ఒక్కో సంఘం పేరిట రూ.2 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు రుణాలు పొందినట్లు తేలింది. కరీంనగర్లో మూడు సంఘాల నుంచి మాత్రమే రికవరీ చేశారు. గ్రేటర్ వరంగల్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేయడంతో బోగస్ రుణాల కేసులు దాదాపుగా క్లోజయ్యాయి. ఇక్కడ ఏకంగా సీవోలను సస్పెండ్ చేసి కొత్త వారిని నియమించారు. సస్పెండ్ అయిన వాళ్లు రికవరీ చేసే పనిలో ఉన్నారు. మరో ముగ్గురు ఆర్పీలపై చర్యలకు ఉపక్రమించినప్పటికీ ప్రజాప్రతినిధుల సిఫారసుతో యథావిధిగా కొనసాగుతున్నారు. మంచిర్యాలలో ముగ్గురు సీవోలను జిల్లాలోని వేర్వేరు మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. సిరిసిల్లలో 43 సంఘాల ద్వారా రూ.80 లక్షల రుణాలను తీసుకొని పత్తాలేకుండా పోయారు. సిద్ధిపేటలో రూ.18 లక్షల అక్రమ రుణాలు మంజూరయ్యాయి. ఖమ్మంలో జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న మహిళ ఏకంగా ఏసీబీకే చిక్కారు. ప్రతి ఆర్పీ నుంచి ఆమె నెలకు రూ.1,500 మేర లంచంగా తీసుకుంటారు. రామగుండంలో మెప్మా అధికారిగా ఉన్న మహిళ ఏడెనిమిదేళ్ల క్రితమే సస్పెండ్ అయి ఏడాదిన్నర తరువాత రాజకీయ పరపతితో తిరిగి మంచి పోస్టును దక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరిపైనా చర్యల్లేవ్... రాష్ట్రంలో మెప్మా పరిధిలో 5,765 మహిళా సమాఖ్యలున్నాయి. ఒక్కో సమాఖ్య పరిధిలో 20–30 మహిళా సంఘాలు ఉంటాయి. ప్రతి సమాఖ్యకు ఒక రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) బాధ్యురాలిగా ఉండి ఆయా సంఘాలకు రుణాలు ఇప్పించి, రికవరీ చేయించాలి. ప్రతి సమాఖ్యలోకి కొత్తగా సంఘాలను తీసుకునే అవకాశం ఉండటంతో దాన్ని ఆసరాగా చేసుకొని బోగస్ సంఘాలను సృష్టించి, రుణాలు పొందారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు, టీఎంసీలు, బ్యాంకు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించారు. అయితే విషయం బయటకు పొక్కగానే ఎవరికి వారు నెపాన్ని ఎదుటివారిపై నెట్టేసి తమను తాము రక్షించుకుంటున్నారు. దందాలో భాగస్వాములైన బ్యాంకు అధికారుల గురించి అడిగేవారే లేరు. బోగస్ సంఘాల అంశం వెలుగు చూడటంతో ప్రస్తుతం చాలా బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి కనపరచడం లేదు. -
వీవోఏ, ఆర్పీల గౌరవ వేతనం 10,000
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల కార్యకలాపాల్లో అట్టడుగు స్థాయిలో పనిచేసే గ్రామ సంఘ సహాయకురాలు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లకు ప్రతి నెలా చెల్లించే గౌరవ వేతనాన్ని రూ.10,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 1వ తేదీ నుంచి గౌరవ వేతనాల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. పొదుపు సంఘాల సభ్యుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం లాంటి కీలక పనులను వీవోఏ, ఆర్పీలు నిర్వహిస్తుంటారు. వీవోఏలను గతంలో యానిమేటర్లు, సంఘమిత్రలు అని పిలిచేవారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 27,797 గ్రామ సమాఖ్యలు, పట్టణ ప్రాంతాల్లో 8,034 ఎస్ఎల్ఎఫ్, టీఎల్‌ఎఫ్‌లున్నాయి. గ్రామ సమాఖ్య పరిధిలో ఉండే సంఘాల వ్యవహారాలను 35,831 మంది వీవోఏలు, ఆర్పీలు పర్యవేక్షిస్తున్నారు. నాడు గౌరవ వేతనాన్ని రద్దు చేసిన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెర్ప్‌లో పనిచేసే వీవోఏలకు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.2 వేల చొప్పున చెల్లించే గౌరవ వేతనాన్ని 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేశారు. గౌరవ వేతనం నిలిపివేస్తున్నట్టు వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. 27 వేల మందికిపైగా వీవోఏలు 2015లో ఏకంగా 75 రోజుల పాటు సమ్మె చేసినా కరుణించలేదు. అసలు వీవోఏలు ప్రభుత్వ ఉద్యోగులే కాదని, రూపాయి కూడా గౌరవ వేతనం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే 2019 ఎన్నికలు రావడం, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసాతో అప్రమత్తమైన గత సర్కారు వీవోఏలకు ప్రభుత్వం నుంచి రూ.3 వేలు, గ్రామ సమాఖ్య నుంచి మరో రెండు వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని అధికారం కోల్పోయే సమయంలో గత్యంతరం లేక హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీలకు నామమాత్రంగా గౌరవ వేతనం చెల్లించేందుకు అంగీకరించింది. వారి కష్టాలు స్వయంగా చూసి.. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా 2018 జూలై 15న తూర్పు గోదావరి జిల్లాలో తనను కలిసిన వీవోఏ, ఆర్పీలకు వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రూ.పది వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 27,797 మంది వీవోఏలకు నెలకు రూ.10 వేలు (ప్రభుత్వం నుంచి రూ.8 వేలు + గ్రామ సమాఖ్య నిధుల నుంచి రూ.2 వేలు) చొప్పున చెల్లించేలా గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అదే తరహాలో పట్టణ ప్రాంతాల్లో పనిచేసే 8,034 మంది ఆర్పీలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించేలా పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలరావు వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. మా జీవితాల్లో నిజమైన వెలుగు.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యానిమేటర్లకు నెలకు రూ.10 వేలు చొప్పున వేతనాన్ని పెంచడంతో మా జీవితాల్లో నిజమైన వెలుగు వచ్చింది. 2003 నుంచి పనిచేస్తున్న మాకు గత ప్రభుత్వం ఏ సాయం చేయలేదు. మా కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి మొదటి కేబినెట్లోనే మా గురించి ఆలోచించి హామీని అమలు చేయడం ఆనందంగా ఉంది’ – వసంత, వీఓఏ, పుంగనూరు మండలం, చిత్తూరు జిల్లా గతంలో నష్టపోయాం.. ‘ముఖ్యమంత్రి జగనన్న తీసుకుంటున్న నిర్ణయాలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. టీడీపీ పాలనలో పొదుపు సంఘాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎలాంటి పథకాలు అందక నష్టపోయాం. ఇప్పుడు నవరత్నాల పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళకు లబ్ధి చేకూరుతుంది’ – క్రిష్ణవేణి, శ్రీరామ మహిళా సంఘం అధ్యక్షురాలు, పుట్లూరు గ్రామం, అనంతపురం జిల్లా మాట నిలబెట్టుకోవడం ఎంతో సంతోషం.. ‘వీవోఏలు రాత్రిపగలు కష్టపడినా గత ప్రభుత్వం గుర్తించలేదు. జీతం పెంచాలని ఎన్నోసార్లు అడిగినా పట్టించుకున్నవారే లేరు. ఎంతసేపూ సభలకు జనాన్ని తెమ్మనేవారు. ఎన్నికలకు ముందు పెంచుతున్నట్లు ప్రకటించినా సంఘం లాభాల్లో ఉంటేనే అంటూ మెలిక పెట్టడంతో పెంచిన మొత్తాన్ని మేం తీసుకోలేదు. పాదయాత్రలో జగనన్న నర్సీపట్నం వచ్చినప్పుడు మా కష్టాలు చెప్పుకున్నాం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ – కె.నాగలక్ష్మి, అమ్మపేట గ్రామం, గొలుగొండ మండలం, విశాఖ జిల్లా -
ఊరు రూపు రేఖలు మార్చేందుకు ఐదేళ్ల ప్రణాళిక
-
పల్లెకు ప్రగతి పాఠాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు.. వార్డు మెంబర్లు, ప్రజలను కలుపుకుని సామూహికంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కేసీఆర్ కోరారు. మంచినీరు, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల(శ్మశాన వాటికలు) నిర్మాణంపై గ్రామపంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్స్‌తో కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులను.. ‘మార్పును తీసుకొచ్చే ఏజెంట్లు’గా మార్చే బాధ్యత రిసోర్సు పర్సన్లదేనని స్పష్టం చేశారు. పంచాయతీలకు అధికారాలను బదిలీ చేసే విషయంలో, నిధులు కేటాయించే విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉంటుందన్నారు. కేసీఆర్.. టీచర్ అవతారం! రిసోర్సు పర్సన్లకు శిక్షణ ఇచ్చే సందర్భంగా కేసీఆర్.. టీచర్ అవతారమెత్తారు. ప్రతీ విషయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం నిలబడే మాట్లాడారు. భోజన విరామం తర్వాత 3 నుంచి 5 గంటల వరకు మళ్లీ నిలబడే మాట్లాడారు. గ్రామపంచాయతీ కొత్త చట్టం, పంచాయతీల బాధ్యతలు–విధులు, నిధులు సమకూరే మార్గాలు, ఖర్చు పెట్టే పద్ధతులు, ప్రజా ప్రతినిధులకు నైతిక నియమాలు, రిసోర్స్ పర్సన్ల బాధ్యతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. సీరియస్‌గా చెబుతూనే అప్పుడప్పుడు చలోక్తులు విసిరారు. దీంతో సభలో నవ్వులు విరబూసాయి. కార్యక్రమం చివరలో సాయంత్రం 5–6 మధ్య ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. ఈ సందర్భంగా రిసోర్సు పర్సన్ల సందేహాలను సీఎం కేసీఆర్ ఓపికగా నివృత్తి చేశారు. వారి పశ్నలకు సమాధానాలు చెప్పారు. ఐదేళ్ల ప్రణాళిక ప్రతీ గ్రామ పంచాయతీ తన పరిధిలోని వనరులు, అవసరాలను బేరీజు వేసుకుంటూ ఐదేళ్ల గ్రామ ప్రణాళిక తయారు చేసుకోవాలని, దానికి అనుగుణంగా పనులు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామం ఇప్పుడు ఎక్కడుంది? ఐదేళ్లలో ఎన్ని నిధులు వస్తాయి? వాటితో ఎలాంటి పనులు చేయాలి? అనే విషయాలను నిర్థారించుకుని రంగంలోకి దిగాలన్నారు. ‘చీకట్లో బాణం విసిరినట్లు కాకుండా, లక్ష్యాన్ని గురిచూసి కొట్టాలి. గ్రీన్ విలేజ్–క్లీన్ విలేజ్’నినాదంతో గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పారిశుద్ధ్య పరిరక్షణకు, శ్మశాన వాటికల నిర్మాణానికి, పన్నుల వసూలుకు మొదటి దఫాలో ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళిక తయారు కావాలి. ఈ ప్రణాళిక తయారీలో సర్పంచులు, కార్యదర్శులకు.. రిసోర్సు పర్సన్లు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. ప్రతీ ఆర్నెల్లకోసారి రిసోర్స్ పర్సన్స్‌తో నేను స్వయంగా సమావేశమవుతా’అని సీఎం కేసీఆర్ అన్నారు. సేవకోసమే పదవి! ‘ప్రజాప్రతినిధులు తాము ప్రజా సేవకులమనే విషయాన్ని మరవద్దు. చట్టసభల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే పదాలు పోవాలి. గ్రామాల్లో కూడా అధికారం అనే మాట రావద్దు. ప్రజాప్రతినిధులు తాము ప్రజాసేవకులమే తప్ప అధికారం చలాయించే వాళ్లం కాదనే భావనతో ఉండాలి. ప్రజలను కలుపుకుని రాజకీయాలకతీతంగా పనిచేయాలి’అని సీఎం పిలుపునిచ్చారు. ‘గ్రామంలో పచ్చదనం పెంచడం పంచాయతీల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. మొక్కల పెంపకం కోసం ఉపాధిహామీ నిధులు వాడుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. ‘గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలి. ట్రై సైకిళ్లను, డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలి. ప్రతిఇంట్లో మరుగుదొడ్డి కచ్చితంగా ఉండేలా అవగాహన కల్పించాలి’అని సీఎం కేసీఆర్ వివరించారు. ‘సొంత స్థలం లేని వారు తమ కుటుంబ సభ్యులు చనిపోతే ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియదు. ఆ బాధ వర్ణణాతీతం. కాబట్టి ప్రతీ గ్రామంలో ఖచ్చితంగా వైకుంఠధామం నిర్మించాలి. అన్ని గ్రామాల్లో ఆర్నెల్లలో వైకుంఠధామాల నిర్మాణం జరగాలి’అని సీఎం ఆదేశించారు. భోజన ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం గ్రామ పంచాయతీ విధులు... ‘ఖచ్చితంగా నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి. పన్నులు వసూలు చేయని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటాం. సర్పంచులు గ్రామంలోనే నివాసం ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. గ్రామావసరాలు గుర్తించాలి. పరిష్కరించడానికి చొరవ చూపాలి. పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. వీధి దీపాలు వెలిగేలా, పగలు వాటిని ఆర్పేలా చర్యలు తీసుకోవాలి. వివాహ రిజిస్ట్రేషన్, జనన, మరణ రికార్డుల నిర్వహణ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరగాలి. ప్రతీ గ్రామంలో దోబీఘాట్లు నిర్మించాలి’అని సీఎం కేసీఆర్ వివరించారు. నిధులొచ్చే మార్గాలివీ! ‘తెలంగాణ గ్రామాల్లో 2.2 కోట్ల జనాభా ఉంది. ఆర్థికసంఘం ద్వారా గ్రామాభివద్ధికి మన రాష్ట్రానికి ఏడాదికి రూ.1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. మన రాష్ట్రం దానికి మరో రూ.1,628 కోట్లు జోడిస్తుంది. ప్రతీ ఏటా మొత్తం రూ.3,256 కోట్లు సమకూరుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా ఏటా రూ.8 లక్షలు వస్తాయి. జనాభా ఎక్కువున్న గ్రామాలకు ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. ఇవి కాకుండా ప్రతి ఏటా రూ.3,500కోట్ల ఉపాధి నిధులొస్తాయి. రాష్ట్ర బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తాం. మొత్తంగా ఐదేళ్లలో రూ.40 వేల కోట్లు గ్రామాలకు సమకూరుతాయి. దీంతో గ్రామాభివద్ధిలో అద్భుతాలు చేయవచ్చు’అని సీఎం వివరించారు. ఇకపై వీధిదీపాలు, ఇతరత్రా అవసరాల కోసం వాడే కరెంటుకు బకాయిల చెల్లింపును ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెదిరిపాడు సంఘటనపై ఖండన మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ బాలప్పను నేలపై కూర్చోబెట్టిన సంఘటనను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలా చేయడం దారుణమని అన్నారు. భవిష్యత్తులో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పద్యాలు చదివిన సీఎం ఆయా అంశాలపై అవగాహన కల్పించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో పలుమార్లు సందర్భోచితంగా పద్యాలు చదివి అర్థాలను వివరించారు. ‘అనగననగ రాగ మతిశయిల్లుచునుండు’అనే వేమన పద్యం పాడి గ్రామాల్లో సంస్కరణల అమలు నిరంతర ప్రక్రియగా సాగాలని.. కొంత కాలానికి ప్రజలకు, ప్రతినిధులకు అది అలవాటుగా మారుతుందని వివరించారు. ‘నయమున బ్రాలున్ ద్రావరు..’అనే సుమతి శతక పద్యంతో.. పంచాయతీలు అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠినంగా శిక్షించాలని చెప్పారు. ‘జాతస్యహి ధ్రువో మృత్యుః’అనే భగవద్గీత శ్లోకం చదివి.. పుట్టిన వారు గిట్టక తప్పదు కనుక చనిపోయిన తర్వాత గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశానవాటికలను నిర్మించాల్సిన అవసరాన్ని చెప్పారు. ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై’అనే సుభాషితం చదివి గ్రామాల వికాసానికి మంచి సంకల్పంతో నడుం బిగించాలని ఉద్భోధించారు. సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ నిష్ణాతులతో రిసోర్సు పర్సన్ల బందం స్థానిక సంస్థలను పనిచేసే పరిపాలనా విభాగాలుగా తీర్చిదిద్దడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ప్రతినిధులకు తగిన శిక్షణ ఇచ్చేందుకు నిష్ణాతులైన రిసోర్సు పర్సన్లను ఎంపిక చేసింది. గ్రామవికాస ప్రణాళికలపై అవగాహన కలిగి, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగిన 320 మందితో రాష్ట్ర స్థాయి బందాన్ని తయారు చేసింది. పంచాయతీరాజ్ అధికారులు, అధ్యాపకులు, ఎన్జీవోల ప్రతినిధులు, మాజీ సర్పంచులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ బృందంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈవో పౌసమిబసు, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లాల పంచాయతీ అధికారులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. స్పూర్తిప్రదాతల గురించి రిసోర్సు పర్సన్లకు అవగాహన, స్పూర్తి కలిగించే క్రమంలో సమావేశంలో గ్రామాల అభివద్ధిలో ఎంతో కషి చేసిన వ్యక్తులను, సంస్థలను, గ్రామాలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత తొలి పంచాయతీరాజ్ మంత్రి ఎస్కే డే.. దేశంలో పంచాయతీరాజ్ ఉద్యమానికి పురుడు పోసిన విధానాన్ని ఆయన సలహాలు, సూచనల మేరకే మొదటి ప్రధాని నెహ్రూ నీటిపారుదల నిర్మాణానికి, వ్యవసాయరంగ అభివద్ధికి చర్యలు తీసుకున్న వైనాన్ని వివరించారు. నాడు ఎస్కే డే హైదరాబాద్‌లో నెలకొల్పిన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) గురించి.. ఆయన చొరవతో షాద్‌నగర్, పటాన్చెరువు బ్లాకులు ఏర్పడిన విషయాన్ని వివరించారు. కొంకణ్ ప్రాంతంలో చైతన్యం తీసుకొచ్చి ఎత్తుపల్లాలుండే భూభాగంలో వ్యవసాయం ఎలా చేయాలో చేసి చూపించిన బండార్కర్ గురించి వివరించారు. మహారాష్ట్రలోని వన్రాయ్ సొసైటీ స్వచ్ఛందంగా గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి, చేసిన సేవను వివరించారు. కూసం రాజమౌళి కృషి కారణంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ప్రపంచానికే ఓ ఆదర్శ గ్రామంగా ఎలా తయారైందో వివరించారు. గ్రామస్తులు, మహిళల సాధికారితకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం ఓ ఉదాహరణగా సీఎం చెప్పారు. ఒక్క దోమ కూడా లేకుండా పరిసరాలను ఎలా కాపాడుకోవచ్చో హైదరాబాద్ నగర శివారు ప్రగతి రిసార్ట్స్ చేసి చూపించందని చెప్పారు. ఈ సందర్భంగా గంగదేవిపల్లి సర్పంచ్ కూసం రాజమౌళిని వేదికపైకి పిలిపించి సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేల సరసన కూర్చోబెట్టారు. -
వేసవి శిబిరాలు అస్తవ్యస్తం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల స్థాయిని పెంచేందుకు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రాష్ట్ర అధికారులు వేసవి సెలవుల్లో శిబిరాలు ప్రారంభించారు. లక్ష్యం మంచిదే అయినా జిల్లాలో తరగతులు నామమాత్రంగా సాగుతున్నాయి. ఆచరణలో అమ లు కాకపోవడంతో లక్ష్యం సాధించడం అనుమానంగానే ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు ఈ వేసవిలో తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 275 క్లస్టర్ పాఠశాలల్లో వేసవి శిబిరాలు జరగాలి. సీఆర్పీలు విద్యాబోధన చేయాలి. ప్రస్తుతం జిల్లాలో 252 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. మిగిలిన 23 క్లస్టర్ పాఠశాలల్లో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్‌తో విద్యాబోధన చేయించాలని అధికారులు నిర్ణయించారు. వీరు వారం రోజులు తరగతులు బోధించారు. వీరికి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వే చేయించాలని ఎస్పీడీ నుంచి ఆదేశాలు రావడంతో ఐఈడీ రిసోర్స్ పర్సన్స్ వెళ్లారు. కానీ, వీరు శిబిరాలకు వెళ్లకపోవడంతో తెరుచుకోవడం లేదు. ఆర్వీఎం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా ఆలోచించడం లేదు. నామాత్రంగానే తరగతులు జిల్లాలో వేసవి శిబిరాలకు 11,158 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 1,2 తరగతుల విద్యార్థులు 4,852 మంది, 3,4,5 తరగతుల విద్యార్థులు 6,306 మంది వేసవి శిబిరాలకు హాజరుకావాలి. కానీ, కనీసం సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరుకావడం లేదు. విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంతోపాటు ఆటాపాటాలు నేర్పాలి. వర్క్పుస్తకాల ఆధారంగా వారికి కృత్యాలు నేర్పాలి. ‘సీ’ గ్రేడ్ విద్యార్థులను ‘ బీ’గాని ‘ఏ’ గ్రేడ్ విద్యార్థులుగా తయారు చేయాలి. కానీ, తరగతులు అంతంతా మాత్రంగానే జరగడంతో విద్యార్థులకు ప్రయోజనం శూన్యం. కాగా, శిబిరాలు ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు తరగతులు జరగాలి. సీఆర్పీలు సమయపాలన పాటించకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు తెరుచుకోవడంలేదు. ఈ శిబిరాలకు విద్యార్థులు రాకపోవడంతోనే పాఠశాలలను తెరవడం లేదని కొంత మంది సీఆర్పీలు పేర్కొంటున్నారు. సీఆర్పీలు వచ్చిన చోట విద్యార్థులు రావడం లేదు. విద్యార్థులు వచ్చిన చోట సీఆర్పీలు కానరావడం లేదు. దీంతో పరిస్థితి భిన్నంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు వేసవి శిబిరాలను రాజీవ్ విద్యామిషన్ అధికారులతోపాటు మండల విద్యాధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో తరగతులు సక్రమంగా జరగడం లేదు. కొంత మంది సీఆర్పీలు వేసవి శిబిరాలకు రావడం లేదు. ఈ విషయమై ఆర్వీఎం ఏఎంవో గంగయ్యను అడుగగా.. శిబిరాలు సక్రమంగానే నిర్వహిస్తున్నామని, సీఆర్పీలు లేని చోట విద్యావలంటీర్లను నియమించాలని మండల విద్యాధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు.