పస్తులే నేస్తాలు! | Financial problems on Rajiv Vidya Mission works | Sakshi
Sakshi News home page

పస్తులే నేస్తాలు!

Published Fri, Jan 9 2015 2:32 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

పస్తులే నేస్తాలు! - Sakshi

పస్తులే నేస్తాలు!

 శ్రీకాకుళం : జిల్లాలో విద్యా వలంటీర్లు పండుగ వేళ కూడా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి నియామకం జరిగి నాలుగు నెలలు కావస్తున్నా ఒక్కనెల జీతాన్ని కూడా అందుకోలేదు. ఫలితంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సంక్రాంతి నాటికైనా తమకు జీతాలు అందుతాయని ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ వారి కోరిక నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వస్తున్నార. ఏటా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు రాజీవ్ విద్యామిషన్, తొమ్మిది, 10 తరగతులకు విద్యాశాఖ వలంటీర్లను నియమించేది. ఈ బాధ్యతలను ఈసారి అన్ని తరగతులకు విద్యాశాఖకే అప్పగించారు. జిల్లా విద్యాశాఖాధికారులు నియామకపు బాధ్యతలను మండల విద్యాశాఖాధికారుల చేతిలో పెట్టారు.
 
 ఈ నియామకపు ప్రక్రియను కూడా తీవ్ర జాప్యం చేసిన మండల విద్యాశాఖాధికారులు ఆ విషయాన్ని ఁసాక్షి*లో కథనంగా ప్రచురితం అయితేగానీ పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. జిల్లాకు 900 మంది వలంటీర్లను నియమించాలని సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా గ్రామాల్లోని పాఠశాలలకు వలంటీర్లను కూడా నియమించలేదు. మిగిలిన చోట నియామకపు ప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా ఎవరెవరిని ఏఏ పాఠశాలకు కేటారుుంచారన్న వివరాలను మండల విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ కార్యాలయానికి ఇప్పటికీ అందజేయలేదు. ఎంఈవోలు సరైన సమయంలో వివరాలు నివేదించి ఉంటే రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిధులు మంజూరై వలంటీర్లకు జీతాలు ఇచ్చేందుకు వీలు కలిగేది. మండల విద్యాశాఖాధికారులు ఇంతటి నిర్లక్ష్యంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అరకొర జీతాలతో విద్యా వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు.
 
 వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు అవ్వలేదంటే సమంజసంగా ఉండేది. నిధులుండీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీతాలకు నోచుకోలేదని తెలుసుకొని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా తక్షణం స్పందించి సంక్రాంతి పండుగలోగా జీతాలు అందేలా చూడాలని విద్యా వలంటీర్లు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అరుణకుమారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మండల విద్యాశాఖాధికారుల నుంచి వివరాలు రాకపోవడం నిజమేనని అంగీకరించారు. ఇప్పటికే రెండు దఫాలు ఎంఈవో నుంచి వివరాలు అడిగామని, వారి నుంచి అందక పోవడంతో నివేదించలేక పోయినట్టు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో వివరాలను తెప్పించుకుని జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement