రోదిస్తున్న మృతుని భార్య, అత్త ఇతర కుటుంబ సభ్యులు
నవ మాసాలు మోసింది.. చిన్నప్పుడే తండ్రి ప్రేమను కోల్పోయిన తనయుడికి అన్నీతానై అల్లారు ముద్దుగా పెంచింది. విద్యాబుద్ధులు చెప్పించింది. ఓ ఇంటివాడిని కూడా చేసి అమ్మ బాధ్యతను తీర్చుకుంది. అయితే కుటుంబంలో తలెత్తిన కలహాలతో ఆ మాతమూర్తి కర్కశంగా మారింది. గోరు ముద్దలు తినిపించిన చేతులతోనే కొడుకు ప్రాణం తీసింది. ఇనుపరాడ్డుతో తలపై బలంగా మోది చంపేసింది. విగతజీవిగా మారిన కుమారుడిని చూసి మనస్తాపంతో తల్లడిల్లింది. పురుగుమందును తాగి ఆత్మహత్యాయతాన్నికి పాల్పడింది. ఈ విషాద సంఘటన వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు పంచాయతీ చిన్న బత్సలవానిపేట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బత్సల లోకనాథం(29) హత్యకు గురవ్వగా.. అతని తల్లి కుమారి మత్యువుతో ఆస్పత్రిలో పోరాటం చేస్తోంది.
వజ్రపుకొత్తూరు: అమలపాడు పంచాయతీ చిన్న బత్సలవానిపేట గ్రామానికి చెందిన బత్సల లోకనాథం (29) తల్లి కుమారి చేతిలో దారుణ హత్యకు గురికావడం ఈ ప్రాంతంలో సంచలనమైంది. లోకనాథానికి మందస మండలం బేతాళపురం గ్రామానికి చెందిన లోలాక్షితో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాలకు లోకనాథం భార్యతో కలిసి వెళ్లేవాడు. ఇతనికి తల్లి కుమారితోపాటు అన్నయ్య బి. శ్రీనివాసరావు, తమ్ముడు భానుచందర్ ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం విదేశాల్లో వలస కూలీలుగా పని చేస్తున్నారు. పెద్ద అన్నయ్య శ్రీనివాసరావు గ్రామంలోని వేరేగా నివాసం ఉంటున్నారు.
ఇల్లు నిర్మాణంతో ప్రారంభమైన గొడవలు
ఇటీవల వీరి కుటుంబం కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారు. దీంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. జనవరి నెలలో లోకనాథం భార్య లోలాక్షిపై అతని తల్లి కుమారి, పెద్ద, చిన్న కుమాలు కలిసి దాడి చేయడంతోపాటు.. బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీంతో లోలాక్షి భర్త లోకనాథాన్ని వదిలి బేతాళపురంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వీరి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. లోకనాథాన్ని కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురిచేసేవారు.
వయసులో నీకంటే భార్య పెద్దదని, మరి తీసుకురావద్దని, వేరే పెళ్లి చేస్తామంటూ వేధించేవారు. దీంతో లోకనాథం మనస్తాపానికి గురయ్యాడు. సమస్యను గ్రామ పెద్దలు, పంచాయతీ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి తన భార్యను తన వద్దకు వచ్చేలా చూడాలని కోరాడు. అయినా ప్రయత్నం ఫలించలేదు. తన భార్యను తీసుకురావాలంటూ నిత్యం తల్లి కుమారితో గొడవ పడేవాడు. మానసిక పరిస్థితి సక్రమంగా లేదనే భావంతో సోమవారం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులను సంప్రదించారు. మంచి భోజనం చేయాలని, మందులను వాడాలని వైద్యులు సూచించడంతో ఇంటికి వచ్చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారు జామున తల్లి కుమారి, కొడుకు లోకనాథం మధ్య ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి తోటలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన కుమారి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డును తీసుకొని వచ్చి లోకనాథం తలపై గట్టిగా కొట్టడంతో పడిపోయినట్టు పోలీసులు తెలిపారు. కొడుకు పరిస్థితి చూసిన తల్లి కూడా చచ్చిపోవాలని భావించి జీడితోటకు వె?సేందుకు ఇంట్లో ఉంచిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కొద్దిసేపటి తరువాత అటుగా వెళ్లిన పెద్ద కోడలు మోహిని విగతజీవులుగా పడి ఉన్న అత్త, మరిదిని చూసి ఆందోళన చెందింది. విషయాన్ని ఇరుగుపొరుగువారికి చెప్పడంతో వారంతా వచ్చి వెంటనే పూండిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లోకనాథం చనిపోయినట్టు పరీక్షించిన వైద్యులు ప్రకటించారు. కుమారిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆమె ప్రస్తుతం అత్యవసర చికిత్స పొందుతోంది. మృతుని భార్య లోలాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్సై కె.వి.సురేష్ గ్రామానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. శవ పంచనామా నిర్వహించారు. లోకనాథం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పథకం ప్రకారమే హత్య చేశారు: అత్తింటివారు
లోకనాథాన్ని వారి కుటుంబ సభ్యులు ప్రథకం ప్రకారమే హత్య చేశారని అత్త బత్తిని కూర్మమ్మ, బావమరిది ఈశ్వరరావు ఆరోపించారు. పథకం ప్రకారమే చంపేశారనివజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్రిజ్, అదనపు కట్నం తీసుకురావాలంటూ తమ కుమార్తె లోలాక్షిని లోకనాథం తల్లి కుమారి, అన్నయ్య శ్రీనివాసరావు, ఆయన భార్య మోహిని వేధించేవారని వాపోయారు. వీరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment