
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని తల్లి, కుమార్తెను విచక్షణరహితంగా నరికి చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్ ఏఎస్పీ ఎన్‌వీఎస్ మూర్తి తెలిపారు. రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, టౌన్ సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ రఘపతితో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సత్తెనపల్లి టౌన్ నాగార్జుననగర్‌లో ఉంటున్న కోనూరు పద్మావతి, మానప్రగఢ లక్ష్మీప్రత్యూష తల్లీ కుమార్తెలు.
తాత కోనూరు లక్ష్మీనారాయణ ఆస్తిని పంచకుండా తల్లీ కుమార్తె అడ్డుపడుతున్నారని కోనూరు శ్రీనివాసచక్రవర్తి కక్ష పెంచుకున్నాడు. దీనికితోడు బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామంలో, రాజుపాలెం గ్రామంలో సుమారు 6.34 ఎకరాల వ్యవసాయ భూమిని పెద్ద బాబాయి అయిన శివప్రసాదరావు తన కుటుంబ సభ్యులకు రాసుకున్నాడని, తనకు రావాల్సిన వాటా చెల్లించకుండా ఉన్నారని శ్రీనివాసచక్రవర్తి భావించాడు. ఈ ఆస్తి పంపకాల్లో తల్లి, కుమార్తె అడ్డుపడుతున్నారని ఎలాగైనా వారిని హత్య చేయాలనే ఉద్దేశంతో గత నెల 28 రాత్రి సుమారు 7.26 గంటల సమయంలో వారు నివసించే ఇంటికి శ్రీనివాసచక్రవర్తి చేరుకున్నాడు.
ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే కారణంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో తల్లి, కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కొనఊపిరితో ఉన్న తల్లిని ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందింది. సత్తెనపల్లి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ స్కూల్ సమీపాన మంగళవారం సాయంత్రం శ్రీనివాసచక్రవర్తిని అరెస్ట్ చేసి కత్తిని సీజ్ చేసినట్లు ఏఎస్పీ చెప్పారు. నిందితుడి స్వస్థలం బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామమని, ప్రస్తుతం గుంటూరు జిన్నాటవర్ సెంటర్‌లోని ఓ డార్మెంటరీలో ఉంటున్నాడని చెప్పారు. అతను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడని, గుంటూరులోని లాడ్జిలో మడత మంచాలు అద్దెకు తీసుకుని ఉండేవాడని తెలిపారు.