ఎమ్మెల్యే కోటా కట్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆర్థిక సంక్షోభం పేరుతో ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు నిలిపివేస్తోంది. చివరికి ఎమ్మెల్యే కోటా నిధులనూ కట్ చేసేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో స్థానికంగా అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. నియోజకవర్గాల్లో స్థానిక అవసరాలను బట్టి చిన్న చిన్న పనులు చేయించేందుకు వీలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.కోటి చొప్పున గత కొన్నేళ్లుగా మంజూరు చేస్తోంది. ఈ నిధులు స్థానికాభివృద్ధికి కొంతవరకు దోహదపడుతున్నాయి. అయితే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదు. రానున్న రోజుల్లోనైనా విడుదల చేస్తారన్న స్పష్టమైన హామీ లేకపోవడంతో ఆ మేరకు అభివృద్ధి పనులు నిలిచిపోయినట్లే.
రాష్ట్ర విభజన అనంతరం మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు ఎదుర్కొంటోందని చెబుతున్న ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా నిధులు విడుదల చేయడంలేదు. ఎమ్మెల్యే కోటా నిధులకూ అదే గతి పట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నిధుల్లో దాదాపు సగం విడుదలయ్యాయి. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క పైసా అయినా విడుదల కాలేదు. ఫలితంగా ఈ నిధులతో పనులు ప్రతిపాదించేందుకు కూడా వీలు పడటం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఎమ్మెల్యే కోటాకు మంగళం పాడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు శాసనమండలి సభ్యులు ఉన్నారు.
వీరికి ఒక్కొక్కరికి ఏడాదికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు రూ.13 కోట్లు అందాల్సి ఉంది. ఆ మేరకు అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. ఈ నిధులతో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల పరిధిలో అవసరమైన చోట రోడ్లు, కాలువలు, భవన నిర్మాణాలు, విద్యుత్ సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయిస్తారు. కాగా ఈ నిధుల్లో రూ.50 లక్షలు పూర్తిగా సంబంధిత ప్రజాప్రతినిధి విచక్షణతో కేటాయించే అవకాశం ఉండగా, మిగిలిన రూ.50 లక్షలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సూచన మేరకు అభివృద్ధి పనులకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ పేరిట ఈ నిధులను నిలిపివేసింది. ప్రచారానికి, ఇతర ఆర్భాటాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం స్థానిక అభివృద్ధికి దోహదపడే ఎమ్మెల్యే కోటా నిధులను నిలిపివేయడంపై పలువురు ప్రజాప్రతినిధులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.