అవి‘నీటి’పరుల గుండెల్లో రైళ్లు | TDP Corruption In Vansadhara Package | Sakshi
Sakshi News home page

అవి‘నీటి’పరుల గుండెల్లో రైళ్లు

Published Mon, Aug 19 2019 8:13 AM | Last Updated on Mon, Aug 19 2019 8:17 AM

TDP Corruption In Vansadhara Package - Sakshi

ఎల్‌.ఎన్‌.పేట: సముద్రంలో కలసిపోతున్న వంశధార జలాలను ఒడిసి పట్టి రెండు పంటలకు పుష్కలంగా సాగునీరందించే బృహత్తర ప్రాజెక్టు అక్రమార్కుల పాలైంది. అడుగడుగునా పేరుకుపోయిన అవినీతి నిగ్గు తేల్చి చర్యలు తీసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉపక్రమించడంతో దోపిడీదార్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అడ్డగోలుగా నిధులను దోచుకున్నారు. వంశధార రిజర్వాయర్‌ నిర్మాణం కోసం పంట భూములు, నివాస గృహాలు, గ్రామాలను కోల్పోయి నిరాశ్రయులైన త్యాగమూర్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను తప్పుడు ధ్రువపత్రాలతో స్వాహా చేశారని, నిర్వాసితుల పేరిట కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు రూ.కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రస్తావించినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందిస్తూ.. అవకతవకలపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీని వేయనున్నట్టు చెప్పారు. కమిటీకి సమర్పించేందుకు అవసరమైన పత్రాలను జిల్లా, మండల స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో అవినీతిని ప్రోత్సహించిన అధికారులు ఎలా తప్పించుకోవాలిరా ‘బాబూ’ అంటూ దారులు వెతుకుతున్నారు.

ప్యాకేజీల్లో.. పనుల్లో...
వంశధార రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా నిర్వాసితులకు రకరకాల ప్యాకేజీలు చెల్లించా రు. ఇళ్ల నిర్మాణ స్ట్రక్చర్‌ కొలతల్లో తేడాలు నమోదు చేసినట్లు అప్పట్లోనే ఫిర్యాదులు వెళ్లాయి. వీటిని పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పునరావాస కాలనీల్లో ఇంటి నిర్మాణ స్థలం కేటాయింపులో, పీడీఎఫ్‌ ప్యాకేజీల చెల్లింపులో.. ఇలా అనేక సందర్భాల్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుంది. యూత్‌ ప్యాకేజీ కోసం రూ.421 కోట్లు కేటాయించారు. వయసు తక్కువగా ఉన్నవారి కోసం తప్పుడు పత్రాలు సృష్టించి.. మీకు సగం, మాకు సగం వంతున రూ.కోట్లు స్వాహా చేసినట్టు ఫిర్యాదులున్నాయి. ఇక ప్రాజెక్టు నిర్మాణంలోను, పునరావాస కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించే విషయంలోను మరింత అవినీతి చోటు చేసుకుంది. గతంలో వచ్చినా పట్టించుకోని ఫిర్యాదులపై అధికారులు విచారణకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

నిధుల వంశ‘ధార’..
జలయజ్ఞంలో భాగంగా హిరమండలం వద్ద 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వంశధార రిజర్వాయర్‌ నిర్మాణానికి 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పచ్చజెండా ఊపారు. 2006–07లో 11,687 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరానికి రూ.1.33 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. 7,104 కుటుంబాల వారు నిర్వాసితులుగా మారిపోతున్నట్లు గుర్తించి వీరికి పునరావాసం కల్పించేందుకు అంచెలంచెలుగా 2017 వరకు 4,785 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి 2016లో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో ఒక కుటుంబానికి ఇంటి నివాస స్థలం కొనుగోలు చేసుకునేందుకు రూ.5 లక్షల చొప్పున చెల్లించారు. యూత్‌ ప్యాకేజీ, వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్, పీడీఎఫ్‌ ప్యాకేజీ, అదనపు కట్టడాల పేరుతో జరిగిన చెల్లింపుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అవినీతి జరిగిందని ప్రచారం జరుగుతోంది. విచారణ జరిపిస్తామని పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినప్పటి నుంచే అవినీతిపరులైన టీడీపీ నాయకుల్లో, అవినీతిని ప్రోత్సహించిన అప్పటి అధికారుల్లో భయం పట్టుకుంది. 

నిధుల దుర్వినియోగం..
వంశధార రిజర్వాయర్‌ నిర్మాణ పనుల్లో, నిర్వాసితులకు చెల్లించే ప్యాకేజీల్లో అనేక రకాలుగా అవినీతి చోటు చేసుకుంది. అవినీతిని వెలికితీయాలని, దోషులకు శిక్షించి నిధులు రికవరీ చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరాను. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించాను. 2016లో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ ఫిరాయించిన తరువాత అన్ని ప్యాకేజీల్లోనూ అవినీతి జరిగింది. ఆయన అండతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతికి పాల్ప డ్డారు. ఎప్పటికప్పుడు అంచనాలు పెంచిన ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరించింది. అధిక శాతం నిధులు దుర్వినియోగమయ్యాయి. 
–రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం  

అవినీతికి పాల్పడ్డారు..
తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వాసితులకు ఇచ్చే రకరకాల ప్యాకేజీల్లోను, పునరావాస కాలనీల్లో చేపట్టే పలు అభివృద్ధి పనుల్లోను అక్రమాలు చేశారు. యూత్‌ ప్యాకేజీల్లో అనేకమంది అనర్హుల పేర్లు చోటు చేసుకున్నాయి. ఇంటికి నష్టపరిహారం చెల్లింపు గందరగోళంగా జరిగింది. గత పాలకులు వారి అనుచరుల మేలుకే ప్రాధాన్యం ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలు గాలికి వదిలేశారు. 
–ఇప్పిలి చిన్నంనాయుడు, నిర్వాసితుడు, చిన్నకొల్లివలస ఆర్‌ఆర్‌ కాలనీ, ఎల్‌.ఎన్‌.పేట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement