శ్రీకాకుళం టౌన్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన రాజీవ్ విద్యామిషన్‌లో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది. అధికారుల ఆగడాలు శ్రుతి మించడంతో మహిళా ఉద్యోగులు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెట్టారు. తమను లైంగిక వేధింపుల నుంచి విముక్తుల్ని చేయాలంటూ వారు కలెక్టరు లక్ష్మీనృసింహాన్ని వేడుకున్నారు. వివరాలు పరిశీలిస్తే.. రాజీవ్ విద్యామిషన్, ప్రాజెక్టు పరిధిలో చాలాకాలంగా కొందరు ఉద్యోగులు పాతుకుపోయారు. వారు చెప్పిందే వేదమక్కడ. ఆఖరుకు పీవోను సైతం తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తురన్నారనే ఆరోణలున్నాయి. ఈ శాఖలో అవుట్‌సోర్సింగ్ విభాగంలో మహిళలు ఎక్కువ. వీరిని ఇక్కడి అధికారులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.
పెదవి విప్పితే ఏం జరుగుతుందోనని వీరంతా తమ ఆవేదనను భరిస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు ఉన్నతస్ధాయిలో ఫిర్యాదులు చేసినా తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందని మళ్లీ వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల పీవో బాధ్యతలు స్వీకరించిన త్రినాథరావు దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆయన భరోసా ఇవ్వడంతో కొంతమంది మహిళా ఉద్యోగులు ధైర్యం చేశారు. వేధింపుల పర్వం చిట్టాను విప్పారు. అకాడమిక్ మోనటరింగ్ ఆఫీసర్ జగదీష్‌బాబుపై వీరంతా బుధవారం కలెక్టరును కలిసి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది కస్తూరిబా విద్యాలయాల ప్రత్యేకాధికారులు జిల్లా కలెక్టర్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ రంగరాజుతో పాటు జాయింట్ కలెక్టర్-2 రజనీకాంతరావులు వీరిని విచారించారు.
ఎఎంఓ జగదీష్‌బాబుపై లైంగిక వేదింపు ఆరోపణలు:
జగదీష్‌బాబు బొంతలకోడూరు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఆర్వీయం ఏఎంవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఐసీపీఎస్‌లో కూడా ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసులో సీడబ్ల్యుసీ కోర్టుకు కూడా హాజరుకాలేదు. తాజాగా జగదీష్‌బాబు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భామిని, రణస్థలం, ఎచ్చెర్ల, సింగుపురం, పలాసలకు చెందిన ఎనిమిది కేజీబీవీ సంస్థల ప్రత్యేకాధికారులు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ తీవ్రంగా స్పందించి క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఓ మహిళ నుంచి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ జగదీష్‌బాబు రూ.లక్ష వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టరు స్పష్టం చేశారు.
రా...రా...రాజీవ్ విద్యామిషన్
Published Wed, Mar 16 2016 11:12 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement