రాత్రి మాయమై తెల్లవారేసరికి శవమై..! | 16 Year Old Girl Molested And Murder In Palasa | Sakshi
Sakshi News home page

రాత్రి మాయమై తెల్లవారేసరికి శవమై..!

Published Mon, Jan 27 2020 7:48 AM | Last Updated on Mon, Jan 27 2020 10:03 AM

16 Year Old Girl Molested And Murder In Palasa - Sakshi

రైలు పట్టాలపై బాలిక మృతదేహం

రాత్రికి రాత్రే బాలిక మాయమైంది.. తెల్లారేక రైలు పట్టాలపై శవమై కనిపించింది.. కూలీనాలి చేసుకొని బతుకుతున్నా పిల్లలకు పెద్ద చదువులు చెప్పించాలని తాపత్రయపడిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది.. ఆ చీకటి వేళ అసలేం జరిగిందన్న విషయం అంతుచిక్కకుండా ఉంది.. మృతురాలి శరీరంపై గాయాలను బట్టి, అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ బాలికకు చివరిగా వచ్చిన సంక్షిప్త సందేశాన్ని బట్టి సహ విద్యార్థే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. మరికొందరి పాత్ర కూడా ఉండే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంలో ఈ దుర్ఘటన జరిగింది.  

సాక్షి, వజ్రపుకొత్తూరు/ కాశీబుగ్గ: అమ్మా, నాన్నా, తమ్ముడు.. వారి చెంతనే ఉంది. వారితో రాత్రి వరకు కబుర్లాడి నిద్రపోయింది. శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి పక్కనున్న బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాత్రి వేళే చుట్టుపక్కల వెతికారు. తెల్లవారేసరికి మున్సిపాలిటీ పరిధిలో పెట్టిభద్ర వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి లబోదిబోమన్నారు.

కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు ఈశ్వరరావు, పార్వతి దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె (16), పదో తరగతి చదువుతున్న కుమారుడితో కలిసి ధర్మవరంలో నివసిస్తున్నారు. వీరి కుమార్తె శనివారం రాత్రి మాయమై తెల్లవారేసరికి శవమై కనిపించింది. మృతురాలి తలపై, కాళ్లు చేతులపై గాయాలున్నాయి. సమీపంలోని తుప్పల్లో చేతి గాజుముక్కలు, చెప్పులు లభ్యమయ్యాయి.
 
సంఘటన స్థలం వద్ద గుమిగూడిన పరిసర ప్రాంతాల ప్రజలు

సహ విద్యార్థి హస్తం? 
బాలిక ఫోన్‌ పరిశీలించగా శనివారం రాత్రి మణికంఠ అనే యువకుడి నుంచి ‘హాయ్‌.. బాగున్నావా.. గుడ్‌ నైట్‌’ అని మెసేజి వచ్చినట్టు తెలిసింది. అతనే కారణమై ఉంటాడని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మణికంఠ మృతురాలు కాశీబుగ్గలో చదువుతున్న కాలేజీలోనే సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. తల వెనుకభాగం, కాళ్లు, చేతులు రక్తసిక్తంగా ఉన్నాయి.

రైలు పట్టాల పక్కన చెప్పులు, సమీపంలోని తుప్పల వద్ద పెనుగులాడిన ఛాయలు, ముక్కలైన చేతిగాజులు కనిపించాయి. ఈ ఆధారాలతో అత్యాచారం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. శవపంచనామా చేసి పోలీసులు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం, హత్య అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 363, 376, 302, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పలాస రైల్వేస్టేషన్‌ జిఆర్‌పి ఎస్‌ఐ కె రవికుమార్‌ తెలిపారు. కేసు విచారణ అధికారిగా జిఆర్‌పి సీఐ బాలసూర్యారావు బాధ్యతలు తీసుకున్నారు.


పలాస ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే అప్పలరాజు

అనుమానాస్పద మృతి కాదు.. హత్యే 
తమ కుమార్తెది అనుమానస్పద మృతి కాదని.. హత్యేనని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అభం హుభం తెలియని తమ కుమార్తెను హత్య చేసి చంపారని, ఈ సంఘటనకు కారణమైన దోషులను పట్టుకొని శిక్షించాలన్నారు. వారి రోదనలతో సంఘటన ప్రాంతం మార్మోగింది. గ్రామమంతా కన్నీరు పెట్టింది. దోషులను పట్టుకొని వెంటనే శిక్షించాలని మృతురాలి మేనత్త ఇరోతు సుందరమ్మ కోరారు. బాలికను అత్యాచారం చేసి హత్య చేసారని, ఆడపిల్లకు సమాజంలో భద్రత కరువైందని, దోషులకు శిక్షలు పడాలన్నారు. 

తక్షణ సాయం యాభై వేలు  
పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి వద్ద ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులకు తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిపి కుటుంబాన్ని ఆదుకోవాలని వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటువంటి పనులకు ఒడిగట్టిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారంతా కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement