
అక్రమాల అడ్డా
- రచ్చకెక్కిన ఇంటి పోరు
- ఆర్‌వీఎం పీవో పద్మావతిపై వేటు
- రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
- జీవో జారీ చేసినవిద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని రాజీవ్ విద్యామిషన్‌లో గతం నుంచీ అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అదనపు తరగతి గదుల భవనాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవటం, కమీషన్ల కోసం బిల్లులు ఆలస్యం చేయటం వంటి ఆరోపణలు గత అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తించేలా చేశాయి.
ఆర్‌వీఎం శాఖ నిర్వహణలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం, బిల్లుల్లో లెక్కాపత్రాలు సరిగ్గా ఉండకపోవటం వంటి ఆరోపణలు గతం నుంచి ఆర్‌వీఎం అధికారులు, సిబ్బందిని వెంటాడుతూనే ఉన్నాయి. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీ), ఎంఐఎస్ కోఆర్డినేటర్ల నియామకాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు గతం నుంచి వినవస్తున్నాయి.
కొత్త పీవోపై విచారణ...
రెవెన్యూ శాఖలో తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించిన పద్మావతి డెప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి రావటంతో విద్యాశాఖకు డెప్యుటేషన్‌పై వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెవెన్యూ విభాగంలో పనిచేసిన ఆమె కృష్ణాజిల్లాలో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కొంతకాలం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కూడా ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఆర్‌వీఎం పీవోగా ఆమె పనితీరుపై పలు ఫిర్యాదులు వెళ్లటంతో గత నెలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ నిర్వహించారు.
రచ్చకెక్కిన ఇంటి పోరు...
రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలో కీలక అధికారులు, సిబ్బంది నడుమ నెలకొన్న అంతర్గత పోరు రచ్చకెక్కటం పీవోను ఈ శాఖ నుంచి సాగనంపేవరకు దారితీసిందని తెలిసింది. పీవోతో పాటు ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వహించే మరో వ్యక్తి నడుమ శాఖాపరమైన కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తటం, వాటికి ఆర్థిక లావాదేవీలు, వివాదాలు తోడుకావటంతో అది కాస్తా చినికి చినికి గాలివానగా ఇంటిపోరు రచ్చకెక్కింది.
ఇక్కడ ప్రాజెక్టు అధికారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆమె చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఇదే శాఖలోని ఓ ఉద్యోగి ఉన్నతాధికారులకు చేరవేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఆయన బంధువు ఉన్నతాధికారి కావటంతో ఆ పరిచయాలను ఉపయోగించుకుని పీవోను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపినట్లు తెలిసింది.
హైదరాబాదుకు పిలిచి.. ఆపై చర్యలు...
రాజీవ్ విద్యామిషన్‌లో ఉద్యోగుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరటంతో గత నెల 30, 31 తేదీల్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలోని ఆర్‌వీఎం ముఖ్య అధికారులను హైదరాబాదుకు పిలిచారు. అదే సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనూ ఆర్‌వీఎం కీలక అధికారుల వాదులాట తప్పలేదు. అదే సమయంలో పీవో చేసిన లోపాలను ఆధారాలతో సహా ఒక ఉద్యోగి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ అక్రమాల్లో విచారణాధికారి సైతం ఇప్పటివరకు నివేదిక సమర్పించకపోవడాన్ని కూడా విద్యాశాఖాధికారులు గుర్తించారు.
దీంతో ప్రాజెక్టు అధికారిణిగా ఉన్న బి.పద్మావతిని రెవెన్యూ శాఖకు అప్పగిస్తూ విద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ నెల ఒకటిన జీవో నంబరు 182 జారీ చేశారు. పీవో పద్మావతిపై అనేక ఆరోపణలు వచ్చాయని, వాటికి సంబంధించిన అంశాలపై విచారణ చేసేందుకు అధికారులను నియమించారని, విచారణాధికారి సైతం ఇంతవరకు నివేదిక సమర్పించలేదని ఆ జీవోలో ఎత్తి చూపారు.
ఈ జీవో తక్షణం అమలులోకి వస్తుందని, పద్మావతి ఆర్‌వీఎం పీవోగా రిలీవై రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రస్తావించటం గమనార్హం. ఆర్‌వీఎంకు పీవోగా ఎవరినైనా నియమిస్తారో లేక మరే అధికారికైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తారో వేచి చూడాల్సి ఉంది.