ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) పీవో యాదయ్య యథావిధిగా తన కార్యాలయంలో పని చేసుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ నారాయణ ఆర్వీఎం కార్యాలయానికి వచ్చి పీవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ బాబు ఆదేశించారని యాదయ్యతో చెప్పారు. దీంతో యాదయ్య షాక్‌కు గురయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి సిబ్బంది ఏమితోచని స్థితిలో పడ్డారు. శాఖను గాడిలో పెట్టలేకపోవడం, అక్రమ ఆరోపణలే కారణమని కొంతమంది సిబ్బంది పేర్కొనడం గమనార్హం. కాగా గడిచిన 15 నెలల్లో ఎనిమిది మంది పీవోలు మారారు. రెగ్యులర్ పీవోగా పనిచేసిన విశ్వనాథ్‌రావు బదిలీ అయిన తర్వాత పీవోలుగా పరిశ్రమల శాఖ మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈవోగా పనిచేసిన వెంకటయ్య, ఆర్డీవో రవినాయక్‌లు ఇన్‌చార్జి పీవోలుగా పనిచేశారు. ఆ తర్వాత మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, సీపీవో షేక్ మీరాలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు తిరస్కరించడంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెర్క యాదయ్యను అప్పటి కలెక్టర్ అశోక్ నియమించారు.
అవినీతి, అక్రమాలే కారణమా?
ఆర్వీఎంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సివిల్ వర్క్, వివిధ పథకాల్లో కొంత మంది ఉద్యోగులు, ఉన్నతస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా వాటిని దుర్వినియోగం జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా గత డిసెంబర్‌లో ఓ అధికారితోపాటు ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులపై కలెక్టర్ అహ్మద్‌బాబు కొరడా ఝళిపించిన విషయం విధితమే. తాజాగా శుక్రవారం విధులు నిర్వర్తిస్తున్న పీవో యాదయ్యను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రెగ్యులర్ పీవో లేకపోవడంతో ఆర్వీఎం పాలన గాడి తప్పిందనే అపవాదు ఉంది. పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు శాఖ వ్యవహారాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ అక్రమాలకు తావిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. రెగ్యులర్ పీవోను నియమిస్తే బాగుంటుందని ఉద్యోగులే పేర్కొంటున్నారు.
అక్రమాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తా..
- నారాయణ, ఆర్వీఎం అదనపు పీవో
రాజీవ్ విద్యామిషన్‌లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తాను. పర్సంటేజీలకు అవకాశం లేదు. సివిల్ వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ప్రాథమిక విద్యను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తా. విలీన విద్య, సమీకృత విద్యను పటిష్ట పరుస్తా. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చేందుకు పాటుపడతాను.
మళ్లీ ఆర్వీఎం పీవో మార్పు
Published Sat, Jan 4 2014 2:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement