Yadayya
-
ఉరేసుకుని రైతు ఆత్మహత్య
దుబ్బాక(సిద్ధిపేట జిల్లా): దుబ్బాక మండలం హబ్షిపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొక్కుడుగుళ్ల యాదయ్య(40) అనే దళిత రైతు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీఎస్ఈసెట్కు 26,970 దరఖాస్తులు
ఈ నెల 12న 54 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)-2016కు మొత్తం 26,970 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని టీఎస్ఈసెట్ కన్వీనర్ యాదయ్య సోమవారం తెలిపారు. గతేడాది కన్నా ఈ సారి 6 వేల మంది అభ్యర్థులు పెరిగినట్లు చెప్పారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష నిర్వహణ నిమిత్తం రాష్ట్రంలోని 7 ప్రధాన నగరాల్లో మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు యాదయ్య పేర్కొన్నారు. విద్యార్థులను నిర్దేశిత సమయం కన్నా గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఆన్లైన్ దరఖాస్తు ప్రతి, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ పత్రం, బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులను వెంట తెచ్చుకోవాలన్నారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించబోమన్నారు. ఇన్విజిలేటర్ ఇచ్చిన ఓఎంఆర్ ఆన్సర్‌షీట్‌లో ముద్రితమైన కోడ్‌ను, బుక్లెట్ కోడ్‌ను అభ్యర్థులు తప్పనిసరిగా సరిచూసుకోవాలని యాదయ్య సూచించారు. -
పెద్దమనిషిని చంపేశాడు
మునుగోడు మండల చొల్లేడులో వ్యక్తి దారుణ హత్య గొడ్డలితో నరికి చంపిన నిందితుడు మంచి చెప్పినందుకే ఘాతుకం చొల్లేడు(మునుగోడు): అతనో పెద్ద మనిషి. గ్రామంలో ఎవరైనా తప్పుచేస్తే మందలించేవాడు. కానీ అదే అతని పాలిట శాపంగా మారింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించగా అతను ఆయనపై కక్ష పెంచుకున్నాడు. గొడ్డలితో దారుణంగా నరికిచంపేశాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మండల పరిధిలోని చొల్లేడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కనకాల యాదయ్య(42) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే విధంగా సీపీఐలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. గ్రామంలో చిన్న,చిన్న తగాదాలను పరిష్కరిస్తూ పెద్దమనిషిగా చెలామని అవుతున్నాడు. మంచి చెప్పినందుకే... ఇటీవల గ్రామానికి చెందిన వ్యక్తి కుమారై వివాహం స్థానికంగా జరిగింది. ఆ వివాహానికి అదే గ్రామానికి చెందిన జనిగల హనుమంతు హాజరై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అతని బంధువు పెంబళ్ల నర్సింహతో అకారణంగా తగువుపడ్డాడు. కాగా నర్సింహ ఊరి పెద్దయిన యాదయ్యను వెంట తీసుకొని శనివారం హనుమంతు ఇంటికి వెళ్లి అడిగించాడు. ఈ సమయంలో యాదయ్య హనుమంతును మందలించాడు. ఆయనకుతోడు హనుమంతు భార్య కూడా మందలించింది. కాగా హనుమంతు తన ముగ్గురు సొదరులతో కూడా చీటికిమాటికి తగువు పడుతుండేవాడు. ఈ విషయం తెలిసిన యాదయ్య వీరికి మద్దతుగా నిలిచాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యాదయ్యపై హనుమంతు కక్షకట్టాడు. విషయం తెలిసిన భార్య నిందితుడిని తిట్టడంతో ‘అతనికి ఎందుకు మద్దతు పలుకుతున్నావు. నీకు ఆయనకి వివాహేతర సంబంధం ఉంది’ అంటూ భార్యతో గొడవకుదిగి తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె చీకటిమామిడి గ్రామంలో ఉన్న తన అక్క వద్దకు వెళ్లింది. ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు వచ్చి హనుమంతును మందలించారు. ఆరుబయట నిద్రిస్తుండగా.. వారు వెళ్లగానే అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఫుల్‌గా మద్యం సేవించాడు. 12 గంటల సమయంలో యాదయ్య తన ఇంటి ఎదుట ఆరుబయట నిద్రిస్తుండటం గమనించాడు. అదే అదునుగా భావించి గొడ్డలితో మెడపై బలంగా నరికాడు. దీంతో బాధితుడు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఇంటి యజమాని బోడ్డు సత్తయ్య, అతని తల్లి, భార్య నిద్ర లేచారు. కానీ వారు భయపడి పారిపోయారు. దాంతో దాదాపు 7 సార్లకు పైగా గొడ్డలితో యాదయ్యను కసితీరా నరికి మృతి చెందినట్లు నిర్ధారించుకొని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ బి.డానియల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు చండూరు సీఐ సుబ్బిరాంరెడ్డి, నల్లగొండ క్లూస్ టీం సభ్యులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి పెద్ద కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎంత పని జేస్తివే యాదన్నా..!
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటీవలే ఆ పార్టీ నుంచి అధికారపక్షంలోకి మారిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. పార్టీ ఫిరాయింపులపై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానం విషయంలో సోమవారం ఉదయమే సభ రెండుసార్లు వాయిదా పడింది. రెండోసారి వాయిదా తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి సీఎల్పీ నేత జానారెడ్డి చాంబర్ నుంచి సభలోకి వెళుతుండగా, సరిగ్గా అదే సమయానికి కాలె యాదయ్య ఎదురయ్యారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా.. ‘అన్నా.. యాదన్నా ఎంతపని జేస్తివే..’ అని వ్యాఖ్యానించారు. డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తదితరులు యాదయ్యతో మాట్లాడుతూ కనిపించారు. ‘శనివారం కూడా చెప్పా కదన్నా..’ అని భ ట్టి అన్నారు. అయితే, అందరు మాట్లాడినా కూడా ఎమ్మెల్యే యాదయ్య మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారే తప్ప.. నోరు తెరిచి ఒక్కమాటా మాట్లాడలేదు. -
మళ్లీ ఆర్వీఎం పీవో మార్పు
ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) పీవో యాదయ్య యథావిధిగా తన కార్యాలయంలో పని చేసుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ నారాయణ ఆర్వీఎం కార్యాలయానికి వచ్చి పీవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ బాబు ఆదేశించారని యాదయ్యతో చెప్పారు. దీంతో యాదయ్య షాక్‌కు గురయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి సిబ్బంది ఏమితోచని స్థితిలో పడ్డారు. శాఖను గాడిలో పెట్టలేకపోవడం, అక్రమ ఆరోపణలే కారణమని కొంతమంది సిబ్బంది పేర్కొనడం గమనార్హం. కాగా గడిచిన 15 నెలల్లో ఎనిమిది మంది పీవోలు మారారు. రెగ్యులర్ పీవోగా పనిచేసిన విశ్వనాథ్‌రావు బదిలీ అయిన తర్వాత పీవోలుగా పరిశ్రమల శాఖ మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈవోగా పనిచేసిన వెంకటయ్య, ఆర్డీవో రవినాయక్‌లు ఇన్చార్జి పీవోలుగా పనిచేశారు. ఆ తర్వాత మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, సీపీవో షేక్ మీరాలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు తిరస్కరించడంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెర్క యాదయ్యను అప్పటి కలెక్టర్ అశోక్ నియమించారు. అవినీతి, అక్రమాలే కారణమా? ఆర్వీఎంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సివిల్ వర్క్, వివిధ పథకాల్లో కొంత మంది ఉద్యోగులు, ఉన్నతస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా వాటిని దుర్వినియోగం జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా గత డిసెంబర్లో ఓ అధికారితోపాటు ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులపై కలెక్టర్ అహ్మద్‌బాబు కొరడా ఝళిపించిన విషయం విధితమే. తాజాగా శుక్రవారం విధులు నిర్వర్తిస్తున్న పీవో యాదయ్యను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రెగ్యులర్ పీవో లేకపోవడంతో ఆర్వీఎం పాలన గాడి తప్పిందనే అపవాదు ఉంది. పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు శాఖ వ్యవహారాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ అక్రమాలకు తావిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. రెగ్యులర్ పీవోను నియమిస్తే బాగుంటుందని ఉద్యోగులే పేర్కొంటున్నారు. అక్రమాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తా.. - నారాయణ, ఆర్వీఎం అదనపు పీవో రాజీవ్ విద్యామిషన్‌లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తాను. పర్సంటేజీలకు అవకాశం లేదు. సివిల్ వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ప్రాథమిక విద్యను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తా. విలీన విద్య, సమీకృత విద్యను పటిష్ట పరుస్తా. అనుకున్న లక్ష్యాలను నెరవేర్చేందుకు పాటుపడతాను.