మునుగోడు మండల చొల్లేడులో వ్యక్తి దారుణ హత్య
గొడ్డలితో నరికి చంపిన నిందితుడు
మంచి చెప్పినందుకే ఘాతుకం
చొల్లేడు(మునుగోడు): అతనో పెద్ద మనిషి. గ్రామంలో ఎవరైనా తప్పుచేస్తే మందలించేవాడు. కానీ అదే అతని పాలిట శాపంగా మారింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించగా అతను ఆయనపై కక్ష పెంచుకున్నాడు. గొడ్డలితో దారుణంగా నరికిచంపేశాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మండల పరిధిలోని చొల్లేడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కనకాల యాదయ్య(42) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే విధంగా సీపీఐలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. గ్రామంలో చిన్న,చిన్న తగాదాలను పరిష్కరిస్తూ పెద్దమనిషిగా చెలామని అవుతున్నాడు.
మంచి చెప్పినందుకే...
ఇటీవల గ్రామానికి చెందిన వ్యక్తి కుమారై వివాహం స్థానికంగా జరిగింది. ఆ వివాహానికి అదే గ్రామానికి చెందిన జనిగల హనుమంతు హాజరై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అతని బంధువు పెంబళ్ల నర్సింహతో అకారణంగా తగువుపడ్డాడు. కాగా నర్సింహ ఊరి పెద్దయిన యాదయ్యను వెంట తీసుకొని శనివారం హనుమంతు ఇంటికి వెళ్లి అడిగించాడు. ఈ సమయంలో యాదయ్య హనుమంతును మందలించాడు. ఆయనకుతోడు హనుమంతు భార్య కూడా మందలించింది. కాగా హనుమంతు తన ముగ్గురు సొదరులతో కూడా చీటికిమాటికి తగువు పడుతుండేవాడు.
ఈ విషయం తెలిసిన యాదయ్య వీరికి మద్దతుగా నిలిచాడు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యాదయ్యపై హనుమంతు కక్షకట్టాడు. విషయం తెలిసిన భార్య నిందితుడిని తిట్టడంతో ‘అతనికి ఎందుకు మద్దతు పలుకుతున్నావు. నీకు ఆయనకి వివాహేతర సంబంధం ఉంది’ అంటూ భార్యతో గొడవకుదిగి తీవ్రంగా కొట్టాడు. దాంతో ఆమె చీకటిమామిడి గ్రామంలో ఉన్న తన అక్క వద్దకు వెళ్లింది. ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు వచ్చి హనుమంతును మందలించారు.
ఆరుబయట నిద్రిస్తుండగా..
వారు వెళ్లగానే అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఫుల్‌గా మద్యం సేవించాడు. 12 గంటల సమయంలో యాదయ్య తన ఇంటి ఎదుట ఆరుబయట నిద్రిస్తుండటం గమనించాడు. అదే అదునుగా భావించి గొడ్డలితో మెడపై బలంగా నరికాడు. దీంతో బాధితుడు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఇంటి యజమాని బోడ్డు సత్తయ్య, అతని తల్లి, భార్య నిద్ర లేచారు. కానీ వారు భయపడి పారిపోయారు. దాంతో దాదాపు 7 సార్లకు పైగా గొడ్డలితో యాదయ్యను కసితీరా నరికి మృతి చెందినట్లు నిర్ధారించుకొని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.
ఈ విషయం తెలిసిన ఎస్‌ఐ బి.డానియల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు చండూరు సీఐ సుబ్బిరాంరెడ్డి, నల్లగొండ క్లూస్ టీం సభ్యులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి పెద్ద కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పెద్దమనిషిని చంపేశాడు
Published Mon, May 11 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement