టీఎస్‌ఈసెట్‌కు 26,970 దరఖాస్తులు
ఈ నెల 12న 54 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ఈసెట్)-2016కు మొత్తం 26,970 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని టీఎస్‌ఈసెట్ కన్వీనర్ యాదయ్య సోమవారం తెలిపారు. గతేడాది కన్నా ఈ సారి 6 వేల మంది అభ్యర్థులు పెరిగినట్లు చెప్పారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష నిర్వహణ నిమిత్తం రాష్ట్రంలోని 7 ప్రధాన నగరాల్లో మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు యాదయ్య పేర్కొన్నారు.
విద్యార్థులను నిర్దేశిత సమయం కన్నా గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతి, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ పత్రం, బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులను వెంట తెచ్చుకోవాలన్నారు. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించబోమన్నారు. ఇన్విజిలేటర్ ఇచ్చిన ఓఎంఆర్ ఆన్సర్‌షీట్‌లో ముద్రితమైన కోడ్‌ను, బుక్‌లెట్ కోడ్‌ను అభ్యర్థులు తప్పనిసరిగా సరిచూసుకోవాలని యాదయ్య సూచించారు.