ఈత.. జాగ్రత్త సుమా | Summer Season Swimming Cautions | Sakshi
Sakshi News home page

ఈత.. జాగ్రత్త సుమా

Published Thu, Mar 28 2019 1:44 PM | Last Updated on Thu, Mar 28 2019 1:44 PM

Summer Season Swimming Cautions  - Sakshi

దేవపూర్‌ క్వారీలో గతేడాది ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థులు (ఫైల్‌)

సాక్షి,తలమడుగు(బోథ్‌): వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఒంటి పూట బడులు సైతం ప్రారంభమయ్యాయి. వేడిమి నుంచి ఉపశమనం కోసం పిల్లలు ఈత కొట్టేందుకు మొగ్గుచూపుతుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా వేసవిలో ఈత కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నాయి. 

ప్రాణం తీసే సరదా.. 
సెలవు రోజులతో పాటు మధ్యాహ్న సమయంలో పిల్లలు సమీపంలోని వ్యవసాయ బావులు, చెరువులు, కాలువల్లో సరదాగా ఈతకు వెళుతుంటా రు. నీళ్లను చూడగానే ఉత్సాహంతో అందులోకి దిగుతుంటారు. తీరా దిగాక లోతు ఎక్కువగా ఉండి ఊపిరాడక మృతి చెందుతున్నారు. గతేడాది తలమడుగు మండలం దేవపూర్‌లో ముగ్గురు వి ద్యార్థులు సమీపంలోని క్వారీలో ఈత కోసం వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   

నీటిలో మునుగుతున్నప్పుడు.. 

  •  ఈత తెలిసిన వ్యక్తి మాత్రమే నీట మునిగిన వ్యక్తిని రక్షించి బయటకు తీసుకురావాలి. 
  •  ఈత రానివారు బయటకి తెచ్చే ప్రయత్నం చేయవద్దు. ఇద్దరి ప్రాణాలకు ముప్పే. 
  •  నీట మునుగుతున్న వ్యక్తికి తాను రక్షిస్తానని చెబుతూ, దగ్గరికి వచ్చినపుడు తనను మాత్రం పట్టుకోవద్దని చెప్పాలి. లేదంటే రక్షించబోయిన వ్యక్తి ప్రమాదంలో చిక్కుకుంటాడు. 
  •  నీటి మునుగుతున్న వ్యక్తి వద్దకు వెనక నుంచి వెళ్లాలి. 
  •  బాధితుడు సహకరించకపోతే అతడి వెంట్రుకలు పట్టుకొని ఒడ్డుకు చేర్చాలి. 
  •  నీటిలో మునుగుతున్న వ్యక్తి ఒడ్డుకు దగ్గరలో ఉంటే టవల్, చీర, ప్యాంట్‌ వంటివి అందించి పైకి లాగాలి.  

నీట మునిగితే చేయాల్సిన  ప్రథమ చికిత్స 

  •  నీట మునిగిన వ్యక్తి నీటిని మిండం వలన శ్వాస తీసుకోలేడు. కొన్ని సార్లు బురద శ్వాసావయవాలకు అడ్డుపడవచ్చు. 
  •  అలాంటప్పుడు ఆ వ్యక్తి నోరును బలవంతంగా తెరిచి వేలితో నోటిలో చేరిన మట్టిని తీసివేయాలి. 
  •  అనంతరం బాధితుడిని బోర్లా పడుకోబెట్టి తలను ఒక వైపు తిప్పి ఉంచి వీపు బాగాన్ని చేతులతో నొక్కి నీటిని బయటకు పంపాలి. 
  •  ఇలా తనంతట తాను శ్వాస తీసుకునేంత వరకు నిమిషానికి 16 నుంచి 18 సార్లు నొక్కాలి. 
  •  తడిసిన బట్టలు మార్చి స్పృహలోకి రాగానే కాఫీ, టీ వంటి వేడి పదార్థాలు ఇవ్వాలి. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.  

నిపుణుల సూచనలు, జాగ్రత్తలు.

  • పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు(ఈత వచ్చిన వారు) వెంట ఉండాలి. కోచ్‌ల సమక్షంలోనే నేర్చుకోవడం శ్రేయస్కరం. లేదంటే ఈతలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి పర్యవేక్షణలో గాలి నింపిన ట్యూబ్‌ సాయంతో నేర్చుకోవచ్చు. 
  • తోటి పిల్లలు తుంటరి చేష్టలతో ఈతరాని వారిని బావులు, చెరువులు, కాలువల్లోని నీళ్లలోకి తోస్తుంటారు. అలాగే ఒడ్డు, అడుగుబాగం పాకురు (పాచి) పట్టి ఉండటం వల్ల ప్రమాదవశాత్తు జారే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు పిల్లలను ఇలాంటి చోటుకు ఒంటరిగా పంపకపోవడం మంచిది.  
  • ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో  హెచ్చరిక బోర్డులతో పాటు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement