సాక్షి, సిటీబ్యూరో: వేసవి అంటేనే వినోదం. విహారం. స్కూళ్లు, కాలేజీలు ముగిసి వేసవి సెలవులొచ్చాయంటే చాలు పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఆట, పాటలతో సరదాగా గడిపేస్తారు. ఇంటిల్లిపాది కలిసి టూర్లకు వెళ్తారు. మరోవైపు చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అనేక సాంస్కతిక సంస్థలు కార్యక్రమాలను రూపొందిస్తాయి. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి అన్ని రకాల ఆట,పాటలను, ఆనందోత్సాహలను ఇంటికే పరిమితం చేసింది. క్రీడా ప్రాంగణాల్లో, సాంస్కృతిక కేంద్రాల్లో గడపాల్సిన పిల్లలు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పలు సంస్థలు, వ్యక్తులు ఆన్‌లైన్ వేసవి శిబిరాలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు వివిధ వయసులకు చెందిన పిల్లల అభిరుచికి అనుగుణమైన కార్యక్రమాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి. మరికొన్ని సంస్థలు ఆ దిశగా కార్యాచరణ చేపట్టాయి. ఇంటికే పరిమితమైన పిల్లలకు కనీసం ఆన్‌లైన్ శిక్షణనిప్పించడం ద్వారా రొటీన్‌కు భిన్నమైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుందని తల్లిదండ్రులు సైతం ఆన్‌లైన్ సమ్మర్ క్యాంపుల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
స్టోరీ ఆర్ట్స్ ఇండియా ‘మిన్మిని’...
ప్రముఖ ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్, స్టోరీ ఆర్ట్స్ ఇండియా వ్యవస్థాపకులు దీపాకిరణ్ ‘మిన్మిని’ పేరుతో ఆన్‌లైన్ తరగతులను అందుబాటులోకి తెచ్చారు. 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ శిక్షణ లభిస్తుంది. ప్రతి గ్రూపులో 12 మందిని ఎంపిక చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. కథారచన, కథలు చెప్పడం, కవిత్వం రాయడం, చిత్రలేఖనం, క్రాఫ్ట్సŠ, యోగా, సంగీతం, భావవ్యక్తీకరణ, వంటి అంశాల్లో ఆమె స్వయంగా శిక్షణనిస్తారు. గంటకు పైగా నిర్వహించే ఒక్కో క్లాసులో పిల్లలు తమ సజనాత్మకతకు పదును పెట్టుకునే అవకాశం లభిస్తుంది.‘ప్రతి గ్రూపులో వివిధ అంశాలపైన చర్చలు ఉంటాయని, తద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకొనేందుకు అవకాశం లభిస్తుందని’ దీపాకిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ శిక్షణ కోసం ఆసక్తి ఉన్నవారు వాట్సప్ నెంబర్ ః 9052910239 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
అవర్ సేక్రెడ్ స్పేస్...
కళల లోగిలి అవర్ సేక్రెడ్ స్పేస్. ఏడాది పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, శిక్షణలతో పాటు సహజమైన, పర్యావరణహితమైన జీవనశైలికి అనుగుణమైన కార్యక్రమాల ద్వారా పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటున్న సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ సంస్థ ఈసారి లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్‌లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తోంది. జూమ్ యాప్ ద్వారా ఈ శిక్షణను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యోగా, హస్తకళలు, ఆర్ట్, కొత్తస్నేహితుల పరిచయం, సరికొత్త సృజనాత్మక కళల ఆవిష్కరణలతో పాటు, జర్మనీ, ఉర్దూలలో శిక్షణనివ్వనున్నారు. యోగాలో హఠ యోగా, పవర్ యోగా, విన్యాసయోగా తదితర కార్యమ్రాలను పిల్లలకు నేర్పిస్తారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఈ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు
ఫోన్ : 9030613344 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
లెర్న్ ఏ ఫారిన్ ల్యాంగ్వేజ్...
గోథె జింత్రోమ్ సంస్థ ఈ వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా లాక్‌డౌన్ దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ ‘ లెర్న్ ఏ ఫారిన్ లాంగ్వేజ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జర్మనీ భాష పైన 11 వారాల పాటు ప్రాథమిక అవగాహన కల్పించే శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దీనిని నిర్వహిస్తారు. పిల్లలే కాదు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు జర్మనీ నేర్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం, పేర్ల నమోదుకు ‘ఇన్ఫో (ఎట్ ది రేట్ ఆఫ్) గోథె–హైదరాబాద్ డాట్ ఓఆర్జీ’ కి మెయిల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment