సాక్షి, సిటీబ్యూరో: ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీహెచ్‌ఎంసీ సమ్మర్ క్యాంప్‌లు ఈ నెల 6 నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే ఈసారి వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడా పరికరాలుకరువయ్యాయి. ప్రారంభానికి ఇంకా రెండు రోజులే ఉండగా... ఇప్పటికీ టెండర్ల ప్రక్రియనే పూర్తి కాలేదు. శుక్రవారమే టెండర్లు ఆహ్వానించగా, ఈ నెల 17 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. టెండర్లలో అర్హత పొందిన సరఫరాదారులతో అగ్రిమెంట్ పూర్తయి, వారుక్రీడా సామగ్రిని సరఫరాచేసేందుకు దాదాపు రెండు వారాల సమయం పడుతుంది. అంటే శిక్షణ శిబిరాలు ముగిశాకక్రీడా పరికరాలు శిబిరాలకు చేరే
అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోజీహెచ్‌ఎంసీ వద్దప్రస్తుతమున్న క్రీడా పరికరాలనే అందరికీ సర్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి శిక్షణ శిబిరాలకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అధికారుల అంచనా వేస్తుండగా... అరకొర సామగ్రితోనే శిబిరాలు ముగించాల్సిన దుస్థితి నెలకొంది. ఈసారి మొత్తం 730 కేంద్రాల్లో 45 క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. వాస్తవానికి ఇందుకు అవసరమైన క్రీడా పరికరాలు, సామగ్రి ముందే సమకూర్చుకోవాల్సి ఉంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పటిలాగే శిబిరాల ప్రారంభానికి ముందే క్రీడా పరికరాలు సమకూర్చుకునేందుకు సిద్ధమయ్యామని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్లు ఆహ్వానించేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరామని... ఆలస్యంగా అనుమతి ఇవ్వడంతో టెండర్లలో జాప్యం జరిగిందని స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణాచారి తెలిపారు. సాధారణంగా ప్రతిఏటా జూన్ 1న శిక్షణ శిబిరాలు ముగుస్తాయని, ఈసారి క్రీడా పరికరాలు రావడం ఆలస్యం కానుండడంతో శిబిరాలను మరో 15 రోజుల వరకు పొడిగిస్తామని చెప్పారు.
పెరుగుతున్న డిమాండ్...
జీహెచ్‌ఎంసీ ప్రతిఏటా నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన క్రీడాకారులు విద్యార్థులకు శిక్షణనిస్తారు. ఈ శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో ఓనమాలు దిద్దుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారెందరో ఉన్నారు. క్రికెటర్ అజారుద్దీన్ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ వరకు ఎందరో జీహెచ్‌ఎంసీ క్రీడా మైదానాల్లో శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సమ్మర్ క్యాంప్‌లకు ఏటికేడు డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థులు, యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో తొలుత కేవలం 6 క్రీడాంశాలు, 10 మైదానాల్లో 15 మంది కోచ్‌లతో తొలి వేసవి శిబిరం ప్రారంభమైంది. అప్పుడు 1,400 మంది బాలురు, 200 మంది బాలికలు శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈసారి దాదాపు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉండగా... 826 మంది జాతీయ, అంతర్జాతీయ, సీనియర్ కోచ్‌లతో శిక్షణనివ్వనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 521 క్రీడా మైదానాలు, 7 స్విమ్మింగ్‌పూల్స్, 17 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 11 రోలర్ స్కేటింగ్ రింగ్‌లు, 5 టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. వేసవి శిక్షణ శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులను ఎంపిక చేసి, వారిని ప్రత్యేక టీమ్‌గా ఏర్పాటు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు కూడా పంపిస్తారు.
శిక్షణ క్రీడాంశాలివీ...
సాహస క్రీడలు, అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బేస్ బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జుడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కిక్ బాక్సింగ్, మల్కంబ, నెట్‌బాల్, రోలర్ స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, సెపక్ తక్ర, సాఫ్ట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, త్వైక్వాండో, టెన్నీకాయిట్, టగ్ ఆఫ్ వార్, త్రోబాల్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఇండియా, వెస్లింగ్ రోమన్, వుషు, యోగా, క్రాఫ్ బాల్, పవర్ లిఫ్టింగ్, బీచ్ వాలీబాల్, స్కై మార్షల్ ఆర్ట్స్.
Comments
Please login to add a commentAdd a comment