ప్రపంచానికి పెద్దన్న: నువ్వా... నేనా..? | US Presidential Election Result 2020 Suspension Of Clear Majority | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి పెద్దన్న: నువ్వా... నేనా..?

Published Thu, Nov 5 2020 3:20 AM | Last Updated on Thu, Nov 5 2020 12:13 PM

US Presidential Election Result 2020 Suspension Of Clear Majority - Sakshi


 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. వైట్‌హౌజ్‌ లక్ష్యంగా సాగుతున్న రేసులో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య విజయం దోబూచులాడుతోంది. ఫలితాల సరళి క్షణక్షణం మారుతూ, అభ్యర్థులు, అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తోంది. పోలింగ్‌ బూత్‌ల్లో మంగళవారం నమోదైన ఓట్ల లెక్కింపు పూర్తయినా.. ఫలితాలను ప్రకటించే అవకాశం కనపించడం లేదు. ఈ సారి పెద్ద సంఖ్యలో నమోదైన ‘మెయిల్‌ ఇన్‌(పోస్టల్‌)’ బ్యాలెట్లను లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాల్లో మరింత సమయం పట్టనుండటమే అందుకు కారణం. కౌంటింగ్‌ కొనసాగుతుండగానే, కీలక రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడకముందే, విజయం సాధించేశానని ట్రంప్‌ ప్రకటించారు.

మరోవైపు, కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, కౌంటింగ్‌ను నిలిపేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. జో బైడెన్‌ కూడా విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లలో విజేత 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.  బుధవారం రాత్రి(భారత కాలమానం) వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. 237 ఎలక్టోరల్‌ ఓట్లతో బైడెన్‌ ముందంజలో ఉండగా.. 213 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి ట్రంప్‌ బైడెన్‌కు దగ్గరగా నిలిచారు. అయితే, ఈ ఫలితాలను పలు మీడియా సంస్థలు పలు విధాలుగా వెల్లడిస్తున్నాయి. ట్రంప్‌నకు ఇష్టమైన మీడియా సంస్థ ‘ఫాక్స్‌ న్యూస్‌’ కూడా ట్రంప్‌ ఇప్పటివరకు 213 సీట్లే గెలుచుకున్నారని, బైడెన్‌ 238 స్థానాల్లో విజయం సాధించారని ప్రకటించింది. మొత్తం నమోదైన ఓట్లలో బైడెన్‌ 50% ఓట్లను బైడెన్, 48.4% ఓట్లను ట్రంప్‌ సాధించారని పేర్కొంది. బైడెన్‌ 224 ఎలక్టోరల్‌ ఓట్లు, ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ తెలిపింది. బైడెన్‌ 220 ఓట్లను, ట్రంప్‌ 213 ఓట్లను సాధించారని ‘సీఎన్‌ఎన్‌’ వెల్లడించింది.   

ప్రస్తుతం, మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలు విజేతను నిర్ధారించే పరిస్థితి నెలకొంది. వీటిలో మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. మరోవైపు, పెన్సిల్వేనియాలో దాదాపు 14 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. మిషిగన్‌లోని ప్రధాన పట్టణాల కౌంటింగ్‌ కూడా ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో చివరకు మొగ్గు బైడెన్‌ వైపే ఉండొచ్చని డెమొక్రట్లు ఆశిస్తున్నారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి.

ఈ ఫలితాల ప్రక్రియతో అమెరికా ప్రజలను మోసం చేస్తున్నారని ట్రంప్‌ మండిపడ్డారు. తానే విజయం సాధించానని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఎన్నికల ఫలితాల్లో మోసానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన చూపలేదు. ట్రంప్‌ వ్యాఖ్యలను బైడెన్‌ ప్రచార బృందం గట్టిగా తిప్పికొట్టింది. అవి అహంకారపూరిత, తప్పుడు వ్యాఖ్యలని విమర్శించింది. అమెరికన్‌ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను తొలగించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ట్రంప్‌ సుప్రీంకోర్టుకు వెళితే.. వారి ఆరోపణలను ఎదుర్కొనేందుకు తమ లీగల్‌ టీమ్స్‌ కూడా సిద్ధంగానే ఉన్నాయని బైడెన్‌ ప్రచార మేనేజర్‌ జెన్‌ఓ మాలీ డిలాన్‌ పేర్కొన్నారు. కౌంటింగ్‌ను నిలిపేయాలని కోరే హక్కు ఏ నేతకు ఉండదని, కౌంటింగ్‌ను నిలిపేయాలని కోరుతూ ట్రంప్‌ కోర్టుకు వెళ్తామనడం ఎన్నికల ప్రక్రియను హైజాక్‌ చేసే నిర్లక్ష్యపూరిత ప్రయత్నమని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది. మరోవైపు, డెలావర్‌లో మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్‌ ప్రసంగిస్తూ.. విజయం తమదేనని, ఫలితాలను ప్రకటించేవరకు ఓపికగా ఉండాలని వారిని కోరారు.  

అమెరికా మీడియా ఏం చెబుతోందంటే..!
అమెరికాలో ప్రధాన మీడియా ఎన్నికల ఫలితాలు తేలడానికి మరి కొద్ది రోజులు పడుతుందని అంచనా వేస్తోంది. ‘‘అమెరికా ఎన్నికల్లో అనిశ్చితి నెలకొంది. రాజకీయంగా ప్రజలు రెండుగా విడిపోయారు. వారి మనసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి’’ అని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ‘‘అమెరికా ఎన్నికల చరిత్రలో ఇంత గందరగోళం, అనిశ్చితి ఎప్పుడూ చూడలేదు. బుధవారం ఉదయం లేస్తూనే అందరికీ ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కనిపించింది. కీలక రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యాలే నమోదు కావడంతో తుది ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది’’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో వెల్లడించింది. అమెరికా ప్రజలు ఒక అనిశ్చితితో నిద్రలేచారు, అదెప్పటికి వీడుతుందో చెప్పలేకుండా ఉన్నామని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక వ్యాఖ్యానించింది. బైడెన్‌ ఆచితూచి వ్యవహరిస్తూ సహనం పాటించాలని తన సహచరులకు పిలుపునిచ్చారని ఆ పత్రిక పేర్కొంది. అయితే డెమొక్రాట్లు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఊహించలేని పరాజయాలు మూట కట్టుకున్నారని వాషింగ్టన్‌ పోస్టు వెల్లడించింది.  

‘కీ’లకం, ఫలితం తేలని రాష్ట్రాలు 6
ఈ రాష్ట్రాలే అమెరికాకాబోయే అధ్యక్షుడిని నిర్ణయించనున్నాయి.

పెన్సిల్వేనియా 20 ఎలక్టోరల్‌ ఓట్లు
ట్రంప్‌ దాదాపు 8.1% ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్‌ కంటే 4.61 లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఇక్కడ 80% ఓట్ల లెక్కింపే పూర్తయింది. ఇంకా లెక్కించాల్సినవి 10 లక్షలదాకా మెయిల్‌ ఇన్‌ ఓట్లున్నాయి. డెమొక్రాట్‌ మద్దతుదారులు ఎక్కువగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. 4.61 లక్షల మెజారిటీని అధిగమించి బైడెన్‌ ముందుకు దూసుకెళ్లడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అయితే విస్కాన్సిన్, మిషిగాన్‌లలో మెయిల్‌ ఇన్‌ ఓట్లలో 70–75% బైడెన్‌కే పడ్డాయి. పెన్సిల్వేనియాలోనూ అదే ఒరవడి కొనసాగితే... బైడెన్‌కు ఇక్కడ విజయావకాశాలు ఉంటాయి. డెమొక్రాట్లు ఇదే ఆశాభావంతో ఉన్నారు. ఇక్కడ 6వ తేదీకి ఓట్ల లెక్కింపు పూర్తికావొచ్చని అధికారులు చెబుతున్నారు.  

అరిజోనా  11
బైడెన్‌ 51శాతంతో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌కు 47.6% ఓట్లు వచ్చాయి. 86% కౌంటింగ్‌ పూర్తయింది. మరికోపా కౌంటీ ఓట్ల లెక్కింపు ఇంకా జర గాల్సి ఉంది. ఈ కౌంటీలోనే ఫినిక్స్‌ నగరం ఉంది. ఈ సిటీలో సర్వేల్లో బైడెన్‌కు ఆరుపాయింట్ల అధిక్యం కనపడింది కాబట్టి అరిజోనాలో ఆయన ఆధిక్యం నిలుస్తుందని అంచనా. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి కౌంటింగ్‌ పూర్తికానుంది.  

జార్జియా  16
93% ఓట్ల కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి ట్రంప్‌ 50.3 శాతం, బైడెన్‌ 48.5 శాతం ఓట్లు సాధించారు. డెకాబ్‌ కౌంటీ, అట్లాంటా నగర శివార్లలోని కౌంటీల్లో అధికభాగం ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో బైడెన్‌కు మొగ్గు కనపడింది. అర్ధరాత్రి దాటాక ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.

మిషిగాన్‌  16
94% ఓట్ల లెక్కింపు పూర్తయిన మిషిగాన్‌లో హోరాహోరీ కొనసాగుతోంది. బైడెన్‌ 0.9% స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటిదాకా బైడెన్‌ 49.6%, ట్రంప్‌ 48.7% ఓట్లు సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటగా భావించే వేన్‌ కౌంటీ (ఇందులోనే డెట్రాయిట్‌ నగరం ఉంది)లో ఇంకా 25% ఓట్లను లెక్కించాలి. అందుకే మిషిగాన్‌ తమదేననే ఆశాభావంతో డెమొక్రాట్లు ఉన్నారు.  

నెవెడా  6
86% కౌంటింగ్‌ పూర్తికాగా.. బైడెన్‌ 0.6%తో ఆధిక్యంలో ఉన్నారు. లెక్కించిన ఓట్లలో బైడెన్‌ 49.3%, ట్రంప్‌ 48.7% సాధించారు. ఇంకా లెక్కించాల్సిన వాటిలో... ఎన్నికల తేదీన, తర్వాత అందిన మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్లు ఉండటంతో ఆధిక్యాన్ని కొనసాగిస్తామన్న ధీమా డెమొక్రాట్లలో ఉంది.  

నార్త్‌ కరోలినా 15
లెక్కించిన ఓట్లలో ట్రంప్‌ 50.1% , బైడెన్‌ 48.7% సాధించారు. 95% కౌంటింగ్‌ పూర్తయింది. మిగిలిన 5% ఓట్లలో మూడింట రెండొంతులు సాధిస్తేనే బైడెన్‌కు విజయావకాశాలు ఉంటాయి. లేకపోతే నార్త్‌ కరోలినా రిపబ్లికన్ల ఖాతాలో చేరిపోతుంది.

బైడెన్‌ ఖాతాలో విస్కాన్సిన్‌
బైడెన్‌ 0.6% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విస్కాన్సిన్‌ (10 ఎలక్టోరల్‌ ఓట్లు) ను దక్కించుకున్నారు. బైడెన్‌కు 49.4%, ట్రంప్‌కు 48.8% ఓట్లు వచ్చాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక విస్కాన్సిన్‌ ఫలితం వెలువడింది.

ఈ ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచిన కోట్లాది మందికి ధన్యవాదాలు. విజయోత్సవాలను జరుపుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ఏ మాత్రం ఊహించని రాష్ట్రాల్లోనూ విజయ ఢంకా మోగిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోండి. ఫ్లోరిడా, ఓహియో, టెక్సాస్, జార్జియా, పెన్సిల్వేనియాలో గెలవడం ఎనలేని ఆనందాన్నిచ్చింది.  
– ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌

ఎన్నికల ఫలితాలు ఎప్పటికి వస్తాయో తెలీదు. రేపే రావొచ్చు. ఇంకా ఆలస్యం కావొచ్చు. మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ కారణంగా ఈ సారి కౌంటింగ్‌ ఆలస్యమవుతుంది. అయినప్పటికీ ప్రతీ ఓటుని లెక్కపెట్టి తీరాలి. కానీ అంతిమ ఫలితం మనకే అనుకూలంగా ఉంటుంది. నమ్మకం ఉంచండి మనమే గెలవబోతున్నాం. ఎన్నికల్లో ఎవరు గెలిచారో చెప్పాల్సింది ట్రంపో, బైడెనో కాదు.. ప్రజలు చెప్పాలి.   
–డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌  
   

ఫ్లోరిడాలో ట్రంప్‌ అభిమానుల ఆనందహేల


ఫ్లోరిడాలో ఫలితాల్ని ఆసక్తిగా గమనిస్తున్న డెమొక్రటిక్‌ పార్టీ అభిమాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement