
రేపటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
- విశాఖలో ఏపీ, తెలంగాణ కమిటీల సంయుక్త నిర్వహణ
- పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (సీసీఐ(ఎం)) 21వ జాతీయ మహాసభలు మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్నాయని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో విజయవాడలోను, 2002లో హైదరాబాద్‌లోను ఈ మహాసభలు జరిగాయని తెలిపారు.
ఈ సభల్ని పార్టీ ఏపీ, తెలంగాణ కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. స్థానిక పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఐదురోజులు జరగనున్న ప్రతినిధుల సభలకు 900 మంది ప్రతినిధులు హాజర వుతారని తెలి పారు. ప్రతినిధుల సభలో రాజకీయ సమీక్షా నివేదిక, రాజ కీయ తీర్మానం, రాజ కీయ నిర్మాణ నివేదికలతో పాటు దేశంలో ప్రజలెదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణల గురించి చర్చించి తీర్మానాలు చేస్తామని వివరించారు.
19వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఆర్కే బీచ్‌లో నిర్వహించే బహిరంగ సభతో ఈ మహాసభలు ముగుస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పి.మధు, రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నరసింగరావు, మహాసభల మీడియా కమిటీ ఇన్‌చార్జి ప్రొఫెసర్ బాబీవర్ధన్, కన్వీనర్ బి.ఎస్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘పట్టిసీమ’కు నిధుల వెనుక కుట్ర
విజయనగరం: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు కాకుండా పట్టిసీమ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడం వెనుక భారీ కుట్రే ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఆయన ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగునీటిని అందించడం కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులు నిధులు లేక నిర్మాణ దశలోనే ఆగిపోయాయని, వాటికి కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తే సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయిం చకుండా, నీటిపారుదల శాఖలోని సీనియర్ ఇంజనీర్లు సైతం వృథా అని చెబుతున్న పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడం దారుణమని విమర్శించారు.