
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకు ఎదురుదెబ్బ తగిలినా ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాలతో బీజేపీ విధానాలను తిప్పికొడతామన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెపె్టంబర్‌లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని తమ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు.
రెండ్రోజులపాటు జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. రాఘవులు మాట్లాడుతూ, పార్టీ మహాసభల టైంటేబుల్‌ను కేంద్ర కమిటీ ప్రకటించిందని తెలిపారు. ఫిబ్రవరిలోపు శాఖ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహాసభలను పూర్తిచేసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో అఖిల భారత మహాసభలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
కేరళలోని కన్నూరు జిల్లాలో అఖిలభారత మహాసభలను నిర్వహించబోతున్నామని తెలిపారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియలను ధ్వంసం చేస్తోందని ఆయన ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతున్నారన్నారు. వర్షపాతం మెరుగ్గా ఉండి పంటల దిగుబడి పెరిగినా, గిట్టుబాటు ధరల్లేక రైతాంగం సంక్షోభంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment