సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు(పాత చిత్రం)
ఢిల్లీ: పీడీ ఖాతాల కుంభకోణంపై విచారణ జరిపించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల పాటు బీజేపీపై ఈగ వాలకుండా టీడీపీ చూసిందని..ఇప్పుడేమో అన్నింటికీ బీజేపీయే కారణమని అంటున్నదని విమర్శించారు. అధికారంలో ఉండి రెండు పార్టీలూ కీచులాడుతున్నాయని మండిపడ్డారు. ఇదేదో జీవీఎల్ నరసింహారావు, కుటుంబరావు మధ్య వ్యవహారం కాకూడదని, పీడీ ఖాతాలపై సీబీఐ విచారణ జరిగి తీరాల్సిందేనని పట్టుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో కాగ్ అనేక లోటుపాట్లను ఎత్తి చూపిందని వ్యాఖ్యానించారు.
టీడీపీ రాష్ట్రంలోని గనులను దోచుకుని వచ్చే ఎన్నికలకు ఆదాయవనరుగా మార్చుకుందని విమర్శించారు. గనుల శాఖ దీనికి ఒక సాధనంగా మారిందని చెప్పారు. గనుల శాఖలో పూర్తి ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ గనుల తవ్వకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గనుల్లో అనేక మంది కూలీలు బలవుతున్నా సర్కారు చోద్యం చూస్తోందని విమర్శించారు. విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పద్ధతుల ప్రకారం ఇసుక, గనులు దోచుకుంటున్నారని ఆరోపించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ మృతిపట్ల సీపీఎం ప్రగాఢ సంతాపం తెలియజేస్తోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment