శ్రీనగర్: కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) మద్దతు తీసుకోవాలనుకోవడం లేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) పేర్కొంది. జమ్మూ, కశ్మీర్ ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని పీడీపీ ప్రతినిధి నయీమ్ అక్తర్ బుధవారం మీడియాతో అన్నారు. కేవలం 15 సీట్లుమాత్రమే ఉన్న ఆ పార్టీకి, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించే అధికారం లేదని ఆయన పేర్కొన్నారు.
పీడీపీకి మద్దతు ఇస్తామని, అంతేకాక తమ పార్టీని సంప్రదించకుండా ప్రభుత్వం ఏర్పాటుకోసం ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోరుతూ నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర గవర్నర్‌కు లేఖరాయడాన్ని అక్తర్ తప్పుబట్టారు. కేవలం అధికారంకోసమే ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమ పార్టీ లక్ష్యం కాదని, రాష్ట్రంలో శాంతి, సుస్థిరతల స్థాపనే తమ ఎజెండా అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీతో జరుగుతున్న చర్చల గురించి ప్రస్తావించగా, అనధికార చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు వారాలు అయినా ఈ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుపై ఒక అవగాహనకు రాలేకపోయాయి. దాంతో పాలన బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించారు.
బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తామన్నాం: ఎన్‌సీ
ప్రభుత్వం ఏర్పాటులో పీడీపీకి తాము కేవలం బయటినుంచి మాత్రమే మద్దతు ఇస్తామన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ పేర్కొంది. పీడీపీలా తమకు అధికార దాహం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి అలీ మహమ్మద్ ఓ ప్రకటన చేశారు. తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్‌సీ మద్దతు తీసుకోం: పీడీపీ
Published Wed, Jan 14 2015 10:05 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM
Advertisement
Advertisement