పీడీపీకి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు!!
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీకి మద్దతు ఇస్తోందనుకున్న నేషనల్ కాన్ఫరెన్స్.. ఉన్నట్టుండి ఇప్పుడు పీడీపీకి మద్దతిస్తామని ముందుకొచ్చింది. 87 స్థానాలున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీతో అధికారాన్ని పంచుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం 15 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
పీడీపీకి ఇప్పటికే 28 స్థానాలు ఉండటంతో నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతిస్తే వారి బలం 43 అవుతుంది. కానీ, కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన సాధారణ మెజారిటీ 44. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచినా, వాళ్లలో అత్యధికులు బీజేపీ రెబల్సే. వాళ్లు బీజేపీ నేతృత్వంలోని సర్కారుకు మద్దతివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో పీడీపీ - నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.