
స్వీయ మదింపు వ్యవస్థ కావాలి
- న్యాయవ్యవస్థకు ప్రధాని మోదీ సూచన
- మేం తప్పు చేస్తే మీరు సరిదిద్దుతారు..మీరే పొరపాటు చేస్తే అంతా నాశనం
- న్యాయమూర్తుల జాతీయ సదస్సులో మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థను ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా, భగవంతుడి తరువాత అంతటి దివ్యమైనదిగా భావిస్తారని.. అందువల్ల కష్టమైనా సరే, అంతర్గత స్వీయ మదింపు వ్యవస్థను న్యాయవ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఉన్నత స్థాయి జడ్జీలు, రాష్ట్రాల సీఎంలు పాల్గొన్న జాతీయ సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మేం(రాజకీయవాదులం) అదృష్టవంతులం.
ప్రజలే మమ్మల్ని అంచనా వేస్తుంటారు. అవసరమనుకుంటే పక్కన పెట్టేస్తుంటారు. మీరు మా అంత అదృష్టవంతులు కారు. ఒక వ్యక్తికి మీరు మరణశిక్ష విధించినా సరే.. ఆ వ్యక్తి తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందనే అంటాడు. అలా.. న్యాయవ్యవస్థపై విమర్శలకు అతి తక్కువ అవకాశం ఉన్నందువల్ల అంతర్గత స్వీయ మదింపు వ్యవస్థను న్యాయవ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం తక్షణావసరం. అది ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేని వ్యవస్థ అయి ఉండాలి’ అన్నారు.
కార్యనిర్వాహక వ్యవస్థపై తనిఖీలకు ఎన్నికల సంఘం, ఆర్టీఐ, లోక్‌పాల్ మొదలైనవి ఉన్నాయని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లినా.. అది దేశానికే ప్రమాదకరమవుతుందని హెచ్చరించారు. న్యాయవ్యవస్థ దృఢతరమవుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం న్యాయమూర్తులపై ఉందన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసన తీర్మానం పార్లమెంటుకు వచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, చట్టాల రూపకల్పనలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థకు ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం 14వ ఫైనాన్స్ కమిషన్ కింద జ్యూడీషియరీ బలోపేతానికి రూ. 9,749 కోట్లు కేటాయించామని తెలిపారు. మరింతమంది న్యాయనిపుణుల అవసరముందని, దీని కోసం మరిన్ని న్యాయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, మోదీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్ దత్తు స్పందిస్తూ.. న్యాయవ్యవస్థలో ఇప్పటికే అంతర్గతంగా స్వీయ మదింపు వ్యవస్థ ఉందని, అది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు.
ట్రిబ్యునళ్లపై సమీక్ష: ట్రిబ్యునళ్ల పనితీరుపై ప్రధాని నిశిత వ్యాఖ్యలు చేశారు. అవి అతి తక్కువ కేసులను పరిష్కరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అవి న్యాయాన్ని అందిస్తున్నాయా? న్యాయానికి అడ్డుగా నిలుస్తున్నాయా? అన్న విషయంపై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీలు సమీక్షించాల్సి ఉందన్నారు. ట్రిబ్యునళ్ల పనితీరు బాగాలేకుంటే.. వాటికి కేటాయిస్తున్న నిధులను కోర్టులకు మళ్లించే అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు.
మాపై మీడియా దృష్టి ఎక్కువ
ఒకప్పుడు వార్తాపత్రికల్లోని గాసిప్ కాలమ్స్‌లో కూడా చోటు సంపాదించుకోనటువంటి వార్తాంశాలు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌గా వస్తున్నాయంటూ ప్రధాని చురకలేశారు. ‘రాజకీయ నేతలపై మీడియా దృష్టి పెరిగింది. 24 గంటలూ మీడియా పరిశీలన ఉండే రాజకీయ తరగతికి చెందినవాడిని నేను. మా తరగతి చాలా చెడ్డ పేరు సంపాదించింది. మేం ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రజలకు సమాధానమివ్వాల్సి ఉంటుంది. మాపై ఆర్టీఐ, ఎన్నికల సంఘం, లోక్‌పాల్ లాంటి తనిఖీ వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకున్నాం’ అన్నారు. జ్యుడీషియరీ కూడా ఒక అంతర్గత మదింపు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఇళ్లలో పెద్దలు డబ్బులు, ఇతర విలువైన వస్తువులను బాక్స్‌ల్లో పెట్టి తాళాలేస్తుంటారు. అది దొంగలెత్తుకుపోతారని కాదు. దొంగలు మొత్తం బాక్స్‌నే ఎత్తుకుపోగలరు. పిల్లలు చెడు అలవాట్లు అలవడకుండా ఉండటం కోసం పెద్దలు అలా చేస్తుంటారు’ అని వివరించారు.