పార్టీ పునాదుల్ని పటిష్ట పరుచుకోవడానికి బదులు విలీనం, పునరేకీకరణపై వెంపర్లాడాల్సిన ...
పుదుచ్చేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్టీ పునాదుల్ని పటిష్ట పరుచుకోవడానికి బదులు విలీనం, పునరేకీకరణపై వెంపర్లాడాల్సిన అవసరమేముందని సీపీఐ ప్రతినిధులు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల్లో గురువారం రాజకీయ తీర్మానం, సంస్థాగతకార్యకలాపాల నివేదిక, పార్టీ ముసాయిదా కార్యక్రమంపై చర్చ జరిగింది. ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు డి.రాజా ప్రతిపాదించిన ఈ నివేదికలపై 16 మంది సభ్యులు మాట్లాడారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ, విలీనం ప్రతిపాదనపై సీపీఐ అగ్ర నాయకత్వం చూపుతున్న అతి చొరవను ఆక్షేపిస్తూనే సీపీఎం నాయకత్వ ధోరణిపై కేరళ, గుజరాత్, పంజాబ్ ప్రతినిధులు విరుచుకుపడ్డారు.
కేరళ మహిళా ప్రతినిధులు పార్టీ జాతీయ నాయకత్వాన్ని దునుమాడారు. ప్రస్తుత నాయకత్వానికి పదవుల్లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ప్రధాన కార్యదర్శి సురవరం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దానిపై పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని వ్యక్తి దేశానికి ఏమి బోధిస్తారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో పార్టీ అతలాకుతమైతే ఒక్కసారన్నా పర్యటించారా? అని నిలదీశారు. భూసేకరణ బిల్లుకు నిరసనగా మే 14న ఉద్యమానికి పార్టీ మహాసభ పిలుపిచ్చింది.