కుటుంబ పాలనతో కశ్మీర్ లూటీ
నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలపై మోదీ నిప్పులు
- ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు
- బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తాం
- వాజ్‌పేయి కలను నెరవేరుస్తాం
కిష్ట్‌వార్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌ను గత 50 ఏళ్లుగా పాలిస్తున్న రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని లూటీ చేశాయని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఐదేళ్లకు ఒకసారి చెరో కుటుంబం అధికారంలోకి వచ్చేలా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆ పార్టీలను నడిపిస్తున్న అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. తొలిసారి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ శనివారం కిష్ట్‌వార్ పట్టణంలోని చౌగన్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్‌సీ, పీడీపీలపై విరుచుకుపడ్డారు. ‘‘రాష్ర్టంలో ఆ రెండు కుటుంబాల నుంచే నాయకులు పుడతారా? ఇతర కుటుంబాలు నాయకులను తయారు చేయలేవా? వంశ పాలనకు ఇకనైనా తెర దించాలి.
ఐదు దశాబ్దాలుగా ఎన్‌సీ, పీడీపీలకు ఓట్లేసినా రాష్ట్రం అభివృద్ధి చెందనందుకు బాధపడుతున్న మీరు (ప్రజలు) ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని తాకట్టులో ఉంచడం ఏ కుటుంబానికీ కుదరదని...యువత ఆకాంక్షలను అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదనే సందేశాన్ని కిష్ట్‌వార్ సభ ద్వారా యావత్ జమ్మూకశ్మీర్‌కు చాటిచెప్పాలని మోదీ ప్రజలను కోరారు. కశ్మీర్ లోయను ఇటీవల ముంచెత్తిన వరదలను ప్రస్తావిస్తూ వరద నష్టం తీవ్రతను ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను తాను సందర్శించి నష్టం తీవ్రతను తెలుసుకున్నానని...అందుకే తక్షణమే రూ. వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించానని మోదీ చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అవినీతిరహిత పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని...అభివృద్ధే తమ తారక మంత్రమని చెప్పారు. గుజరాత్‌లో ముస్లింలు అధికంగా నివసించే కచ్ ప్రాంతాన్ని ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని...అలాగే కశ్మీర్ లోయను సైతం అభివృద్ధి చేస్తానని మోదీ చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, మానవత్వం, కశ్మీరీయత్ (కశ్మీరీల జాతీయవాద భావనతో కూడిన సామాజిక స్పృహ) పరిఢవిల్లాలని కలలుగన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్వప్నాన్ని తాను సాకారం చేస్తానని మోదీ హామీ ఇచ్చారు.
కశ్మీరీ యువత గతాన్ని మరచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని కోరారు. యువతను తప్పుదోవ పట్టనివ్వబోమని చెప్పిన మోదీ...రాజకీయాలకు మతంతో ముడిపెట్టరాదని సూచించారు. కశ్మీరీలు ఏ మతం వారైనా కశ్మీరీలేనని, బీజేపీ ఎవరిపైనా వివక్ష చూపదన్నారు. రాష్ట్రాభివృద్ధికి అందరి మద్దతు తమకు అవసరమన్నారు. అయితే మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ‘ఆర్టికల్ 370’ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
బాలీవుడ్‌ను తిరిగి తీసుకొస్తా... భూతల స్వర్గంగా పేరుగాంచిన కశ్మీర్‌కు దూరమైన బాలీవుడ్ చిత్ర పరిశ్రమను తిరిగి తీసుకొస్తానని కశ్మీరీలకు మోదీ హామీ ఇచ్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది పర్యాటక రంగమేనన్నారు. ఈ రంగాన్ని కశ్మీర్‌కు తిరిగి తీసుకొచ్చి దీన్ని ప్రపంచంలోనే అంతిమ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దుతానన్నారు.
ఏం దోచుకున్నామో చెప్పండి: ఒమర్
రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని దోచుకున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఎన్‌సీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తోసిపుచ్చారు. కేంద్రంలో ఆరు నెలలుగా అధికారంలో ఉన్న మోదీ సర్కారు రాష్ట్రంలో తాము ఏం దోచుకున్నామో చెప్పాలన్నారు. ఒకవేళ తాము నిజంగానే రాష్ట్రాన్ని లూటీ చేసి ఉంటే ప్రజలు తమకు మద్దతు పలికేవారా? అని సుంబల్, కంగన్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఒమర్ ప్రశ్నించారు. మోదీ తమ పార్టీని చూసి భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భారత్, పాకిస్థాన్‌లు కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాల్సి ఉంటుం దన్నారు.