Jammu Kashmir: శుభ పరిణామం | Sakshi Editorial On Jammu And Kashmir Politics | Sakshi
Sakshi News home page

Jammu Kashmir: శుభ పరిణామం

Published Fri, Jun 25 2021 12:42 AM | Last Updated on Fri, Jun 25 2021 12:42 AM

Sakshi Editorial On Jammu And Kashmir Politics

రెండేళ్లనాడు ఉన్నట్టుండి జమ్మూ–కశ్మీర్‌ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చేసే నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం... గురువారం కశ్మీర్‌కు చెందిన ప్రధాన రాజకీయ పక్షాలతో మూడు గంటలపాటు చర్చలు జరిపింది. ఈ సమావేశానికి నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలనుంచి 14 మంది నేతలు హాజరయ్యారు. గత రెండేళ్లుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నవారికి ఇలాంటి చర్చలు సాధ్యమవుతాయన్న ఊహ కూడా వచ్చి వుండదు. అక్కడ విపక్ష నాయకులందరినీ గృహ నిర్బంధంలో వుంచారు. సమస్యలు సృష్టించగలరని భావించిన వేలాదిమందిని ఖైదు చేశారు. సుదీర్ఘకాలంపాటు మొబైల్, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. ప్రధాన పార్టీల నేతలు ఇన్నాళ్లుగా కశ్మీర్‌ను దోచుకున్నారని, వారు పాకిస్తాన్‌ తొత్తులని, ‘నయా కశ్మీర్‌’లో అలాంటి శక్తులకు స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చర్చలకు పిలుస్తుందని, విపక్షాలు హాజరవుతాయని... ఇరు పక్షాలూ ఒకే ఫొటోలో ఇమిడిపోతారని ఎవరూ అనుకుని వుండరు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. చర్చలకు వెళ్లాలా వద్దా అని విపక్షాల కూటమి తర్జనభర్జన పడినా, చివరకు చర్చలకే మొగ్గుచూపింది. జమ్మూ–కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే 370తోపాటు ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలు అధి కారం స్థానికులకు మాత్రమే పరిమితం చేసే 35 ఏ అధికరణను కూడా 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. జమ్మూ–కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను చట్టసభ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటం అందరినీ దిగ్భ్రాంతిలో ముంచింది. తీసుకునే నిర్ణయాలు ఎలాంటివైనా ముందుగా అందరితో చర్చించటం ప్రజాస్వామిక సంప్రదాయం. ఆ పని ఇప్పటికైనా జరగటం హర్షించదగ్గ పరిణామం.

తాము ఇన్నాళ్లుగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలనే ఈ తాజా చర్చల్లో జమ్మూ–కశ్మీర్‌ రాజకీయ పక్షాలు మరోసారి వినిపించాయి. రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్‌ చేశాయి. ఇతర నిర్ణయాలు సైతం వెనక్కు తీసుకోవాలని కోరాయి. ఇవన్నీ జరిగితేనే కేంద్రం–కశ్మీర్‌ల మధ్య నెల కొన్న విశ్వాసరాహిత్యం సడలుతుందన్నాయి. పీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అదనంగా పాకిస్తాన్‌ ప్రస్తావన కూడా తీసుకొచ్చి, కశ్మీర్‌ విషయంలో దానితో కూడా చర్చించటం అవసరమని సూచించారు. అయితే అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారో లేదో స్పష్టత లేదు. ప్రభుత్వ వర్గాలైతే ఎవరూ పాకిస్తాన్‌ ప్రస్తావన చేయలేదని చెబు తున్నాయి. అయితే అలా ప్రస్తావించటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కశ్మీర్‌ మన అంతర్గత సమస్యగానే పరిగణిస్తున్నా, అక్కడ ప్రశాంతత ఏర్పడటానికి పాకిస్తాన్‌తో మన దేశం చర్చించిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇప్పుడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సైతం కేవలం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల ప్రాతిపదికగా మాత్రమే కాదు... అంతర్జాతీయంగా ఈ విషయంలో వస్తున్న అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే నిర్వహించారని గుర్తుంచుకోవాలి. జమ్మూ– కశ్మీర్‌ సున్నితమైన ప్రాంతం. ఒకపక్క అమెరికా తొందరపాటు పర్యవసానంగా అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌లు ఏలికలు కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారు పాకిస్తాన్‌ చెప్పినట్టల్లా ఆడి మూడు దశాబ్దాలక్రితం కశ్మీర్‌లో నెత్తుటేర్లు పారించిన సంగతి ఎవరూ మరిచిపోరు. అయితే అఫ్గాన్‌ పరిణామాల ప్రభావం భారత్‌పై వుండబోదని అమెరికా హామీ ఇవ్వడంతోపాటు భారత్, పాక్‌ల మధ్య లోపాయికారీ చర్చలు జరగడానికి అది చొరవ తీసుకుందని చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన అఖిలపక్ష సమావేశం ఆ చర్చల పర్యవసానమేనంటున్నారు. గత కొన్ని నెలలుగా సరి హద్దుల్లో పాక్‌ తుపాకులు పేలకపోవటం, కశ్మీర్‌లో చొరబాటుదార్లను ప్రవేశపెట్టే ప్రయత్నం చేయకపోవటం, గత రెండేళ్లుగా కశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలు పెద్దగా లేకపోవటం గమనిస్తే పాక్‌ వైఖరి మారిందని స్పష్టమవుతోంది. అంతేకాదు... కశ్మీర్‌ భవిష్యత్తుపై ప్లెబిసైట్‌ నిర్వహించాలన్న తన పాత డిమాండ్‌ను వదులుకున్న జాడలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తే చాలని ఇటీవల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పడం గమనించదగ్గది. 

జమ్మూ–కశ్మీర్‌లో 2018లో పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిననాటినుంచీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్‌లో వున్నాయి. అలాగే నియోజకవర్గాల పునర్విభజన సమస్య కూడా కీలకమైనది. 1995లో జరిగిన పునర్విభజనలో జమ్మూకు అన్యాయం జరిగిందని మొదటినుంచీ బీజేపీ వాదన. 87 స్థానాలున్న అసెంబ్లీలో ముస్లింల ప్రాబల్యం వున్న కశ్మీర్‌ ప్రాంతానికి 46 స్థానాలు కేటాయించగా, జమ్మూకు 37 ఇచ్చారు. లద్దాఖ్‌కు 4 కేటాయించగా, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు 24 రిజర్వ్‌ చేశారు. ఈ అమరికను మారిస్తే కశ్మీర్‌ ఆధిక్యత పడిపోతుందన్న ఆందోళన అక్కడి నాయకులకు వుంది. దీన్ని ఉద్రిక్తతలకు తావులేకుండా పరిష్కరించి అసెంబ్లీ ఎన్నికలు జరపాలని, ఆ తర్వాత రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తది తర పక్షాలు కోరుతున్నట్టు రద్దు చేసినవన్నీ పునరుద్ధరించటం సాధ్యమేనా అన్నది తక్షణం తేలేది కాదు. ఇలాంటి చర్చలు మరిన్ని చోటు చేసుకుంటే అలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా ఉద్రిక్తతలు సడలి, కశ్మీర్‌ మళ్లీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగితే, అక్కడ ప్రశాంతత నెలకొంటే అంత కన్నా ఆహ్వానించదగ్గ పరిణామం మరేదీ వుండదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement