
రాజీనామా యోచనలో ఒమర్ అబ్దుల్లా!
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధికార కూటమి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు తెగతెంపులకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 700 పరిపాలనా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న సీఎం ఒమర్ అబ్దుల్లా ఆలోచన కార్యరూపం దాలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీకి లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.
భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు సోమవారం ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. భేటీలో కాంగ్రెస్ తరఫున జమ్మూకాశ్మీర్ వ్యవహారాల ఇన్‌చార్జి అంబికా సోని, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ సైఫుద్దీన్ సోజ్, కేంద్ర మంత్రి ఆజాద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఖరితో కలత చెందిన ఒమర్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.