కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కటీఫ్!
బీహార్‌లోనూ కాంగ్రెస్ ఒంటరి పోరు
మహారాష్ట్రలో ఎన్‌సీపీతో జోడీ కొనసాగింపు
సొంతంగా బరిలోకి ఐఎన్‌ఎల్‌డీ
అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలను ప్రకటించిన పార్టీలు
శ్రీనగర్/పాట్నా/న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)-కాంగ్రెస్ కూటమి ఆదివారం పరస్పరం కటీఫ్ చెప్పుకొన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్‌సీతో ముందస్తు పొత్తు ఉండబోదని తొలుత కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, సైఫుద్దీన్ సోజ్‌లు జమ్మూలో వెల్లడించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని మొత్తం 87 సీట్లలో సొంతంగానే తమ అభ్యర్థులను బరిలోకి దించుతామన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీల ఓట్లు పరస్పరం బదిలీ కాలేదని, ఫలితంగా అన్ని (6) సీట్లనూ ప్రతిపక్ష పీడీపీ, బీజేపీలే సొంతం చేసుకున్నాయని, అందువల్ల ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నామన్నారు. అయితే దీనిపై ఎన్‌సీ అధ్యక్షుడు, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘ పది రోజుల క్రితమే కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశాను. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు వద్దని, అందుకు కారణాలనూ వివరించాను. అవకాశవాదిని అనిపించుకోలేకే దీనిపై బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం వాస్తవాలను వక్రీకరించారు.
అది సరికాదు’ అని పేర్కొన్నారు. అలాగే బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీతో జట్టుకట్టి ఘోరంగా చతికిలపడిపోయిన కాంగ్రెస్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. బీహార్‌లో మతతత్వ శక్తులను దూరం పెట్టేందుకు 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్నట్లు ఆర్జేడీ, జేడీయూలు ప్రకటించాయి. బీహార్‌లో ఆగస్టు 21న ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసే బరిలోకి దిగనున్నట్లు ఆదివారం నాసిక్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన సీట్ల సర్దుబాటుతో సహా పొత్తుకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించేందుకు ఓ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ను కోరినట్లు తెలిపారు. మరోవైపు త్వరలో జరగనున్న హార్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్‌ఎల్‌డీ) కూడా ప్రకటించింది.