
న్యూఢిల్లీ: సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.10 లక్షల కోట్ల మేర చేయూత నివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామీణ సహకార బ్యాంకింగ్ విధానంపై కేంద్ర సహకార శాఖ, రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య(ఎన్‌ఏఎఫ్‌ఎస్‌సీవోబీ) నిర్వహించిన జాతీయ సదస్సులో శుక్రవారం అమిత్ షా మాట్లాడారు.
‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 95 వేల ప్యాక్స్‌లో కేవలం 63 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందజేస్తున్నాయి. వ్యవసాయ రుణ విధానానికి గుండెకాయలాంటి ప్యాక్స్‌ను విస్తరించి, పటిష్టం చేయాలి. ఇందుకోసం పంచాయతీ కొకటి చొప్పున దేశంలోని 3 లక్షల పంచాయతీలకు మరో 2 లక్షల ప్యాక్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉంది’అని ఆయన చెప్పారు. ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే రూ.10 లక్షల కోట్ల రుణ సాయం అందించేందుకు వీలవుతుందని అన్నారు. మోడల్ బై–లాస్‌తోపాటు నూతన సహకార విధానం, సహకార వర్సిటీ, ఎక్స్‌పోర్ట్ హౌస్, సహకార బ్యాంకులకు డేటాబేస్ అభివృద్ధి వంటివి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి అమిత్ షా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment