primary agricultural cooperative societies
-
పంచాయతీకొక సొసైటీ
న్యూఢిల్లీ: సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.10 లక్షల కోట్ల మేర చేయూత నివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామీణ సహకార బ్యాంకింగ్ విధానంపై కేంద్ర సహకార శాఖ, రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య(ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) నిర్వహించిన జాతీయ సదస్సులో శుక్రవారం అమిత్ షా మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 95 వేల ప్యాక్స్‌లో కేవలం 63 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందజేస్తున్నాయి. వ్యవసాయ రుణ విధానానికి గుండెకాయలాంటి ప్యాక్స్‌ను విస్తరించి, పటిష్టం చేయాలి. ఇందుకోసం పంచాయతీ కొకటి చొప్పున దేశంలోని 3 లక్షల పంచాయతీలకు మరో 2 లక్షల ప్యాక్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉంది’అని ఆయన చెప్పారు. ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే రూ.10 లక్షల కోట్ల రుణ సాయం అందించేందుకు వీలవుతుందని అన్నారు. మోడల్ బై–లాస్‌తోపాటు నూతన సహకార విధానం, సహకార వర్సిటీ, ఎక్స్పోర్ట్ హౌస్, సహకార బ్యాంకులకు డేటాబేస్ అభివృద్ధి వంటివి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి అమిత్ షా వెల్లడించారు. -
అవినీతికి అడ్డాలుగా పీఏసీఎస్‌లు!
ఇబ్రహీంపట్నం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా నిలవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అవినీతి కూపంలో కూరుకుపోతున్నాయి. పాలకవర్గాలు, అధికారులు కుమ్మక్కై డబ్బు కొల్లగొడుతున్నారు. చేయని తప్పులకు రైతులను బాధ్యులను చేస్తున్నాయి. రుణాలు చెల్లించినా చెల్లించలేదని రికార్డుల్లో ఉండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మండల పరిధిలోని రాచకొండ దండుమైలారం కో- ఆపరేటివ్ బ్యాంకులో రూ. 26 లక్షల అక్రమాలు జరిగినట్లు శనివారం వెలుగుచూసింది. ఈ బ్యాంకులో మొత్తం 1247 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అక్రమార్కులు తొలి విడత రుణ మాఫీ నిధుల్లో 50 శాతం సొమ్ము, బ్యాంకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 4 లక్షల నిధులు కాజేశారు. రైతులకు తెలియకుండానే వారి పేర్లపై బంగారం, దీర్ఘ, స్వల్ప కాలిక పంట రుణాలు తీసుకున్నట్లుగా రికార్డుల్లో ఉంది. ఫోర్జరీ సంతకాలు, బినామీ పేర్లు, నకిలీ పాసుపుస్తకాలతో ఈ తతంగం సాగింది. బ్యాంకులో ఇప్పటి వరకు సుమారు రూ. 26 లక్షల అక్రమాలు వెలుగు చూశాయని విచారణ అధికారి నర్సింహారెడ్డి చెప్పారు. బ్యాంకు సీఈఓ సయ్యద్ మక్బుల్ మరికొందరితో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
12 సొసైటీలకు నేడు పోలింగ్
130 డెరైక్టర్ స్థానాలకు ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం రేపు అధ్యక్షుల ఎన్నిక విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 సంఘాల్లో 130 డెరైక్టర్ స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 98 పీఏసీఎస్‌లకు 2012లో ఎన్నికలు జరిగాయి. 15 సంఘాలకు వివిధ కారణాల వల్ల అప్పట్లో నామినేషన్లు స్వీకరించలేదు. నక్కపల్లి సొసైటీ ఎన్నికను ప్రభుత్వం ముందే నిలిపివేసింది. కోర్టు కేసులు కారణంగా కొత్తపాలెం, మధురవాడ సొసైటీల ఎన్నికలు ఆగిపోయాయి. ఇప్పటికీ ఈ రెండింటి కేసు కొలిక్కి రాలేదు. దీంతో 13 సంఘాల ఎన్నికలకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో 13 సంఘాలకు ఏ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడి నుంచే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం నక్కపల్లి పీఏసీఎస్‌కు గత నెల 28 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఏకగ్రీవమైంది. దీంతో అరకు, పెందుర్తి, లంకెలపాలెం, గౌరీ(అనకాపల్లి), తుమ్మపాలెం(అనకాపల్లి), సబ్బవరం, శొంఠ్యాం, బుచ్చయ్యపేట, కె.కోటపాడు, రాయపురాజుపేట(చోడవరం), లక్కవరం(చోడవరం) చోద్యం(గొలుగొండ) సొసైటీలకు సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. వాస్తవానికి 11 సంఘాల్లో ఒక్కోదానికి 13 డెరైక్టర్ స్థానాలు ఉండగా అరకుకు 9 ఉన్నాయి. దీని ప్రకారం మొత్తం 152 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 22 ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 29,755 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4.30లోగా లెక్కింపు పూర్తవుతుంది. 11వ తేదీన అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.