12 సొసైటీలకు నేడు పోలింగ్
- 130 డెరైక్టర్ స్థానాలకు ఓటింగ్
- ఉదయం 7 గంటలకు ప్రారంభం
- రేపు అధ్యక్షుల ఎన్నిక
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 సంఘాల్లో 130 డెరైక్టర్ స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 98 పీఏసీఎస్‌లకు 2012లో ఎన్నికలు జరిగాయి. 15 సంఘాలకు వివిధ కారణాల వల్ల అప్పట్లో నామినేషన్లు స్వీకరించలేదు. నక్కపల్లి సొసైటీ ఎన్నికను ప్రభుత్వం ముందే నిలిపివేసింది. కోర్టు కేసులు కారణంగా కొత్తపాలెం, మధురవాడ సొసైటీల ఎన్నికలు ఆగిపోయాయి. ఇప్పటికీ ఈ రెండింటి కేసు కొలిక్కి రాలేదు. దీంతో 13 సంఘాల ఎన్నికలకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
గతంలో 13 సంఘాలకు ఏ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడి నుంచే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం నక్కపల్లి పీఏసీఎస్‌కు గత నెల 28 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఏకగ్రీవమైంది. దీంతో అరకు, పెందుర్తి, లంకెలపాలెం, గౌరీ(అనకాపల్లి), తుమ్మపాలెం(అనకాపల్లి), సబ్బవరం, శొంఠ్యాం, బుచ్చయ్యపేట, కె.కోటపాడు, రాయపురాజుపేట(చోడవరం), లక్కవరం(చోడవరం) చోద్యం(గొలుగొండ) సొసైటీలకు సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
వాస్తవానికి 11 సంఘాల్లో ఒక్కోదానికి 13 డెరైక్టర్ స్థానాలు ఉండగా అరకుకు 9 ఉన్నాయి. దీని ప్రకారం మొత్తం 152 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 22 ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 29,755 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4.30లోగా లెక్కింపు పూర్తవుతుంది. 11వ తేదీన అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.