వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు కృషి
⇒ భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్
⇒ ఐఐసీటీలో జాతీయ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: స్వైన్ ఫ్లూ, చికున్‌గున్యా, డెంగీ తదితర వ్యాధులు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వ్యాధికారక వైరస్‌లపై పరిశోధనలను నిర్వహించేందుకు హైదరాబాద్‌లో పరిశోధనశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనా ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చైనా హైదరాబాద్ కేంద్రంగా ఒక వైరల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మంగళవారం ‘ఎమర్జింగ్ అండ్ రీ ఎమర్జింగ్ వైరల్ ఔట్‌బ్రేక్స్ ఇన్ ఇండియా - క్లినికల్ చాలెంజస్ అండ్ మేనేజ్‌మెంట్’ అన్న అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ఉస్మానియా యూనివర్సిటీ, సైఫాబాద్‌లోని యూనివర్సిటీ సైన్స్ కాలేజీలు, నిజాం కళాశాల, కోఠీ మహిళా కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ పూణేలోని వైరస్ పరిశోధన కేంద్రంపై ఉన్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో మరో ల్యాబ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశ జనాభా ఇప్పటికే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతోందని, ఆర్థికంగానూ వీటి ప్రభావం ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజా చైతన్యం, వ్యక్తిగత, సామాజిక పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే వైరల్ వ్యాధులను నియంత్రించ వచ్చునని స్పష్టం చేశారు.
సాంక్రమిక వ్యాధులపై మార్చిలో సదస్సు
వైరస్‌లతో సోకే వ్యాధులు ఇటీవలి కాలంలో కొత్తకొత్త రీతుల్లో దాడి చేస్తున్నాయని, ఫలితంగా వాటి నియంత్రణ కష్టసాధ్యంగా మారిందని అపోలో హాస్పిటల్స్ ఇన్ఫెక్షిస్ డిసీజ్ కన్సల్టెంట్ డాక్టర్ సునీతా నర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి కారక సూక్ష్మజీవులు కొత్తకొత్త రూపాల్లో రావడం... అప్పటివరకూ వ్యాధి సోకని ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తూ ఉండటం, మందులకు నిరోధకత పెంచుకోవడం వల్ల దేశంలో పాత వ్యాధులు మళ్లీమళ్లీ తిరగబెడుతున్నాయని, అదే సమయంలో కొత్త వ్యాధులు కూడా సోకుతున్నాయని ఆమె తెలి పారు.
ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రజారోగ్య వ్యవస్థ మౌలిక సదుపాయాలను పటిష్ట పరచాల్సి ఉందని, భిన్న వర్గాల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు సంప్రదింపుల ద్వారా తమ అనుభవాలను పంచుకోవాల్సిన అవసరముందని అన్నారు. అన్ని రకాల సాంక్రమిక వ్యాధులపై జిల్లాస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్రాల ప్రజారోగ్య సంస్థలు వ్యాధులపై పరిశోధనలు, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సదస్సు జరగనుందని తెలిపారు.
సదస్సులో ఇండియన్ వైరలాజికల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.కె.ప్రసాద్ ముఖ్యోపన్యాసం చేయగా, సదస్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.రాధాకృష్ణ, ఫీవర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ శంకర్, గాంధీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ నాగేందర్, సీసీఎంబీ శాస్త్రవేత్త శైలేంద్ర సక్సేనా, రాజీవ్‌గాంధీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సత్యనారాయణ, సి.పార్థసారథిలు పాల్గొన్నారు.