Virology Lab
-
కామారెడ్డి వాసులకు ఊరట.. అతనికి మంకీపాక్స్ నెగెటివ్
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: మంకీపాక్స్ లక్షణాలతో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చేరిన కామారెడ్డి వాసికి వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అతని శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ లాబ్‌కు పంపగా.. రిపోర్టు మంగళవారం వచ్చిందని వైద్యులు తెలిపారు. అతనికి మంకీపాక్స్ లేదని నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. 35 ఏళ్ల ఈ వ్యక్తి ఈ నెల మొదటి వారంలో కువైట్ నుంచి కామారెడ్డి ఇందిరానగర్ కాలనీకి చేరుకున్నాడు. తీవ్ర జ్వరం అటుపై అతనిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య శాఖ అప్రమత్తం అయ్యింది. అదనపు టెస్టుల కోసం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించింది. వైద్యులు ఐదు రకాల శాంపిల్స్ తీసి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: ‘మంకీపాక్స్’ కలకలంపై వైద్యాధికారుల స్పందన -
Covid-19: ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’
యోగుల పుట్టుక.. వాగుల పుట్టుక ఎవరికీ తెలీదనేది పాత నానుడి! ఈ వరుసలో వైరస్ల పుట్టుక కూడా చేర్చాలని తాజా అనుభవాలు చెబుతున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నిజంగా ప్రకృతి ద్వారా సంక్రమించిందా? లేక జీవాయుధంగా ల్యాబ్ నుంచి విడుదలైందా? అనేది అందరినీ కుదిపేస్తున్న ప్రశ్న. దీనికి వైరాలజిస్టులు ఏమి చెబుతున్నారో చూద్దాం... ప్రపంచంలో ఎప్పుడు అతిపెద్ద వ్యాధి సంక్రమణం గుర్తించినా, అందరూ అడిగే తొలి ప్రశ్న ఒక్కటే! ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’ అనేది అందరి మెదళ్లను తొలిచే తొలి ప్రశ్న. దీనికి పరిశోధకులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సమాధానం కనుగొనే యత్నం చేస్తారు. తాజాగా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా విలయం పుట్టుపూర్వోత్తరాలపై కూడా ఇదే ప్రశ్న ఉద్భవించింది. దీనికి సమాధానం కోసం పలువురు పరిశోధకులు పలు పరిశోధనలు చేశారు. కానీ, ప్రపంచ గతిని మార్చే ఇలాంటి మహమ్మారుల పుట్టుక గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు! ఉదాహరణకు ప్రపంచాన్ని గడగడలాడించిన హెచ్ఐవీ జన్మ గురించి తెలుసుకోవడానికి అది వ్యాపించిన తర్వాత 20 ఏళ్లు పట్టింది. ఇక ఎబోలా లాంటి కొన్ని వ్యాధుల పుట్టుక గురించి ఇంకా సమాధానం లేదు. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందన్న ఆధారాలున్నా, ఇది ఎప్పుడు, ఎలా మొదలైందనేదానిపై ఇంకా పూర్తిస్థాయి సంతృప్తికర సమాధానాలు లేవు. అసలు వైరాలజిస్టులు ఇలాంటి సూక్ష్మజీవుల జన్మాన్ని ఎలా గుర్తిస్తారనేది ఆసక్తికరమైన విషయం. నిజానికి చాలా వైరస్లు, ఇతర సూక్ష్మ జీవులు అడవుల్లో చెట్లను ఆశ్రయించుకొని బతికేస్తుంటాయి. కానీ ఆ చెట్లపై వాటి ప్రభావం పెద్దగా ఉండదు. కానీ ఒక్కసారి అవి తమ హోస్ట్‌ను మార్చిన అనంతరం పరిణామాలు సీరియస్‌గా మారతాయి. వైరస్ల పుట్టుపూర్వోత్తరాలు గుర్తించేందుకు అటు ల్యాబ్‌ల్లో ఎంత కష్టపడాలో, ఇటు ఫీల్డులో సైతం అంతే కష్టపడాల్సిఉంటుందని ప్రఖ్యాత వైరాలజిస్టులు వివరిస్తుంటారు. వీటితో పాటు కొంత అదృష్టం కూడా కలిసిరావాలంటారనుకోండి! మనిషిని రుచి మరుగుతాయి! సాధారణంగా తీవ్రవ్యాధులు కలిగించే వైరస్లు జంతువుల నుంచి తమ అతిధేయి(హోస్ట్)ని మని షికి మార్చుకున్న తర్వాత విజృంభిస్తాయి. ఒక్క సారి మనిషిలోకి వచ్చాక ఇవి విపరీతంగా వ్యాప్తి చెంది పాండమిక్స్(ప్రబల వ్యాధులు)గా రూపాం తరం చెందుతాయి. వీటి జన్మాన్ని గుర్తించే ందుకు వైరాలజిస్టులు తొలుత సదరు వ్యాధి మనుషుల్లో ఉనికిలోకి వచ్చిన ప్రాంతాల్లోని అనారోగ్యకరంగా కనిపించే జంతువులపై పరీక్షలు మొదలుపెడతారు. నిజానికి పైన చెప్పుకున్నట్లు చాలా జంతువు ల్లో ఈ వైరస్లు పెద్దగా ప్రభావకరమైన లక్షణాలు చూపించవు. అయినా సరే ముందుగా ఆ ప్రాంతా ల్లో వ్యాధిగ్రస్తమైన జంతువులను పరీక్షించడం జరుగుతుంది. అయితే మనిషి కానీ, జంతువులు కానీ చెట్లలాగా స్థిర జీవులు కావు. కనుక ఒక్కోసారి తొలుత వ్యాధి సోకిన మనిషి లేదా జంతువు తప్పనిసరిగా వ్యాధి బయటపడిన ప్రాంతానికి దగ్గరలోనే ఉండిఉండకపోవచ్చు. –సాక్షి, నేషనల్ డెస్క్ బ్యాడ్ బ్యాట్స్ కరోనా విషయంలో గబ్బిలాలపై అందరి దృష్టి పడటానికి ఒక కారణం ఉంది. పలు కరోనా వైరస్‌లతో పాటు, సార్స్, మెర్స్ తదితర వైరస్‌లకు కూడా ఇవి అతిధేయులు కావడం గమనార్హం. నిజానికి ప్రస్తుత కరోనా వైరస్‌కు దగ్గరా ఉండే వైరస్‌ను 2011–12లో వూహాన్ వైరాలజీ సంస్థ బ్యాట్ కరోనా వైరస్‌ల్లో గుర్తించింది. 2003లో సార్స్ విజృంభణ అనంతరం ఈ సంస్థ గబ్బిలాల్లో కరోనా కారక, సంబంధిత వైరస్‌లను గుర్తించే పనిలో ఉంది. యున్నాన్ ప్రావిన్సులో గబ్బిలాల నుంచి సంస్థ శాంపిళ్లను సేకరించి అధ్యయనాలు నిర్వహించింది. గబ్బిలాల్లోని కరోనా వైరస్లు మనిషికి సంక్రమించే అవకాశాలను గుర్తించేందుకు వీటిని కోతి కిడ్నీ కణాలపై, మానవ ట్యూమర్ కణాలపై సంక్రమింపజేశారు. ఈ పరిశోధనలో సదరు వైరస్లు మనిషి కణాల్లో వేగంగా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దీంతో ఇవి మనిషికి నేరుగా గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు తెలిసింది. అనంతరం సదరు వైరస్ల జెనిటిక్ సీక్వెన్స్‌ను అధ్యయనం చేయడం ద్వారా వీటికి దగ్గరగా ఉండే మరో వైరస్ కరోనాకు కారణమని తెలుసుకోగలిగారు. వూహాన్ మాంస మార్కెట్లో తొలిసారి ఈ వ్యాధిని గుర్తించినందున, గబ్బిలాలకు, మనిషికి మధ్య ఇంకో అతిధేయి ఉండే అవకాశాలను కూడా వైరాలజిస్టులు పరిశీలించారు. చివరకు నేరుగానే ఇవి గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు నిర్ధారణకు వచ్చారు. వీటి తర్వాత చాలా కష్టపడి వైరస్ ఫ్యామిలీ ట్రీని కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ఉపయోగించి సృష్టించగలిగారు. ల్యాబ్ రిలీజ్? కరోనా గబ్బిలాల నుంచి మనిషికి సోకినట్లు కనుగొన్నా, ఇది ప్రకృతి సహజంగా జరిగిందా? లేక ల్యాబ్ నుంచి రిలీజయిందా? అన్న అంశంపై పలు సందేహాలున్నాయి. తాజాగా 18 మంది ప్రముఖ వైరాలజిస్టులు ఈ ప్రశ్నపై లోతైన విచారణ జరగాలని కోరడం సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న అధ్యయనాల ప్రకారమైతే ల్యాబ్ నుంచి ఈ వైరస్ విడుదలైందనేందుకు అవకాశాలు స్వల్పంగా ఉన్నట్లు కొందరు వైరాలజిస్టులు భావిస్తున్నారు. జెనిటిక్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన వైరస్ ఐతే, దాని జెనిటిక్ కోడ్‌లో మానవ నిర్మిత మార్పులు కనిపించేవని చెబుతున్నారు. కరోనా జీనోమ్‌లోని స్పైక్ ప్రోటీన్ కోడ్ మెర్స్వైరస్లోని స్పైక్ ప్రోటీన్ కోడ్‌కు దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే వైరల్ ఉత్పరివర్తనాల వల్ల సంభవించి ఉందనేది వీరి వాదన. అయితే ఈ విషయమై మరింత పరిశోధన జరగాల్సిఉంది.కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనేందుకు జరిగే పరిశోధనలు భవిష్యత్‌లో రాబోయే విపత్తులను ముందుగా గుర్తించేందుకు, అర్ధం చేసుకునేందుకు తగిన ఆధారాలనిచ్చాయని వైరాలజిస్టులు భావిస్తున్నారు. కానీ ఒక వైరస్ పుట్టుకను కచ్ఛితంగా గుర్తించడమనేది ఇంకా సంపూర్ణంగా సాధ్యంకాదనేది ప్రస్తుతం అర్థమవుతున్న అంశం. కానీ దాని వ్యాప్తిని నివారించడం, వ్యాధిని అదుపు చేయడం మాత్రం పూర్తిగా మనిషి చేతుల్లోనే ఉంది. చదవండి: కోవిడ్ తీవ్రతకు ఆ డీఎన్ఏకు లంకె -
కరోనా: డబ్ల్యూహెచ్‌వో కవర్ చేసింది
బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే తయారయ్యిందంటూ సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా ప్రభుత్వానికి తెలుసన్న యాన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కవర్ చేయడానికి తెగ ప్రయత్నించిందని ఆరోపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాన్ మాట్లాడుతూ.. ‘ఈ వైరస్‌ను వూహాన్ ల్యాబ్‌లో సృష్టించారు. దీని వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాపై నింద పడకుండా కవర్ చేయడానికి తెగ ప్రయత్నించింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఈ విషయాలను వెల్లడించడంతో చైనా ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా నన్ను బెదిరించాలని చూస్తోంది. నా కుటుంబాన్ని భయపెట్టడమేకాక.. నా మీద సైబర్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంది’ అన్నారు. (చదవండి: కరోనా పుట్టిల్లు వూహాన్ ప్రయోగశాలే) అంతేకాక ‘ఈ వైరస్ ఫుడ్ మార్కెట్ నుంచి కాక ల్యాబ్ నుంచి వచ్చింది. అందుకు నా దగ్గర ఆధారాలున్నాయి. చైనా ప్రభుత్వం దీన్ని ఎందుకు సృష్టించిందో.. ఎందుకు బయటకు వదిలిందో ప్రజలకు తెలపాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఆధారాలు ఎవరైనా అర్థం చేసుకోగలరు. వైరస్ జన్యుశ్రేణి మానవవేలిముద్రలాగా ఉంటుంది’ అని యాన్ తెలిపారు. వూహాన్లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్‌ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈమె హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్ లీ మెంగ్ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు.(చదవండి: ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!) తరువాత యాన్ హాంకాంగ్ నుంచి అమెరికా పారిపోయారు. తన సూపర్వైజర్ అయిన డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌తో ఈ విషయం చెప్పాలని భావించాననీ, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపారు. తన పరిధి దాటి వ్యవహరించడం సరికాదని, లేదంటే తాను అదృశ్యమవడం ఖాయమని, అంతా తనను హెచ్చరించినట్టు ఆమె వెల్లడించారు. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
కరోనా పుట్టిల్లు వూహాన్ ప్రయోగశాలే
లండన్: ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్ పుట్టింది వూహాన్‌లోని ప్రభుత్వ ప్రయోగశాలలోనేనని చైనాకి చెందిన వైరాలజిస్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. దీనికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని ఆమె వెల్లడించారు. బ్రిటిష్ టాక్ షో ‘లూస్ వుమన్’ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమంలో డాక్టర్ లి–మెంగ్ యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వూహాన్లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్‌ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈమె హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్ లీ –మెంగ్ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు. తరువాత ఆమె హాంకాంగ్ నుంచి అమెరికా పారిపోయారు. తన సూపర్వైజర్ అయిన డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌తో ఈ విషయం చెప్పాలని భావించాననీ, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపారు. తన పరిధి దాటి వ్యవహరించడం సరికాదని, లేదంటే తాను అదృశ్యమవడం ఖాయమని, అంతా తనను హెచ్చరించినట్టు ఆమె వెల్లడించారు. కరోనా వైరస్ ప్రకృతి నుంచి రాలేదని, చైనాలో మనిషి నుంచి మనిషికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని, ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకుంటుందని, మహమ్మారిగా విస్తరిస్తుందని, అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాన్ని బాహ్యప్రపంచానికి తెలియకుండా దాచిందని డాక్టర్ లీ–మెంగ్ తెలిపారు. కొందరు సైంటిస్టులతో కలిసి, దీనిపై రిపోర్టు తయారుచేస్తున్నామని, మొదటి రిపోర్టు విడుదలకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచానికి నిజం చెప్పకపోతే తానెంతో విచారించాల్సి ఉంటుందన్నారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఒక ఫౌండేషన్, తాను హాంకాంగ్ వదిలి వెళ్ళడానికి సహకరించినట్టు, ఈ ఫౌండేషన్ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారికి సహాయం చేస్తుందని ఆమె తెలిపారు. 48 లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో 92,071 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,46,427 కు చేరుకుంది. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 1,136 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 79,722కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37,80,107 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,86,598 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 78 శాతానికి పెరిగినట్లు తెలిపింది. మరణాల రేటు 1.64 శాతానికి పడింది. సెప్టెంబర్ 13 వరకు 5,72,39,428 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. -
భారత్ లో అందుబాటులోకి మొబైల్ వైరాలజీ ల్యాబ్
-
ఏపీలో మరో రెండు వైరాలజీ ల్యాబ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం 7 వైరాలజీ ల్యాబొరేటరీలు ఉండగా అదనంగా తిరుపతి రుయా ఆస్పత్రి, కర్నూలు జనరల్ ఆస్పత్రిలో ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. రోజుకు ఒక్కో ల్యాబ్‌లో 180 పరీక్షలు చేసే సామర్థ్యంతో కొత్తవి ఏర్పాటు చేస్తామని, ల్యాబొరేటరీల నిర్వహణాధికారి, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ‘సాక్షి’కి తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► కరోనా వచ్చే నాటికి మన రాష్ట్రంలో తిరుపతిలో స్విమ్స్‌లో మాత్రమే వైరాలజీ ల్యాబ్ ఉండేది. ► ఇప్పుడు ఆ సంఖ్య 7కు చేరింది. ఈ ల్యాబ్‌లలో రోజుకు 1,170 టెస్టులు చేస్తున్నాం. ► లివెందులలోని జినోమ్‌కార్ల్ అనే సంస్థ పశువులకు సంబంధించి పరిశోధనలకు ల్యాబొరేటరీ నిర్వహించేది. ఇప్పుడా పరికరాలు ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ పరికరాలు కర్నూలు మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం. ► ఐసీఎంఆర్ అనుమతులు ఇస్తే కొత్తగా ఏర్పాటు చేసే రెండు ల్యాబ్‌లు పది రోజుల్లోగా అందుబాటులోకి వస్తాయి. ► అప్పుడు ల్యాబ్‌ల సంఖ్య 9కి చేరుతుంది. దీంతో రోజుకు 1,530 టెస్టులు చేసే వీలుంటుంది ఇది చదవండి: వారికి ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు -
ప్రభుత్వ ఆస్పత్రులకు మంచి రోజులు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రా జేందర్ అన్నారు. పేదలకు ఖరీదైన వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించే ఆలోచనతో ప్రభుత్వం ఆయా ఆస్పత్రుల ను ఆధునీకరిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఖరీదైన, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చి కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దిందని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఇతర ప్రతిష్టాత్మక ప్రభుత్వాస్పత్రుల్లో పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు, అత్యాధునిక వైద్యపరికరాలు, కొత్త భవనాల ప్రారంభాలతో సోమవారం ఆయన బిజీగా గడిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వపరంగా చేసిన ముందస్తు ఏర్పాట్లు, అందించే వైద్యసేవలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఇప్పటి వరకు 20 అనుమానిత కేసులు నమోదయ్యాయని, వీటిలో 19 నెగెటివ్ రిపోర్ట్లు వచ్చాయని, మరొకటి రావాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, మన వాతావరణం లో ఆ వైరస్ బతికే అవకాశం లేదన్నారు. ఇప్పటి వరకు రిపోర్టుల కోసం పుణే వైరాలజీ ల్యాబ్‌పై ఆధారపడాల్సి వచ్చేదని, ఇకపై గాంధీలోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. గాంధీలో ‘కరోనా’ టెస్ట్ ల్యాబ్.. ఎంఎన్జేలో పెట్‌స్కాన్ ►గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ టెస్ట్ లేబొరేటరీ, డెర్మటాలజీ విభాగంలో అత్యాధునిక లేజర్ యూనిట్, గాంధీ మెడికల్ కాలేజీలో రూ.10 కోట్లతో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్ సహా ఎగ్జామినేషన్ హాల్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. అనంతరం కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును సందర్శించారు. పుట్టుకతోనే వినికిడి లోపాన్ని గుర్తించే పరికరాలను ఆయన ఆస్పత్రికి అందజేశారు. ►ఎంఎన్‌జే ఆస్పత్రిలో రూ.15 కోట్ల ఖరీదైన పెట్స్కాన్ను రోగులకు అంకితం చేశారు. కేన్సర్‌తో బాధపడుతూ పీడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారుల వార్డును సందర్శించి, వారిని పలకరించారు. వైద్య సేవలపై రోగి బంధువులను ఆరా తీశారు. ►సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రూ.17.6 కోట్లతో 150 పడకల సామర్థ్యంతో ఏర్పాటుచేసిన అదనపు బ్లాక్‌ను ప్రారంభించారు. ►ఉస్మానియా ఆస్పత్రి ఆర్ధోపెడిక్ విభాగంలో కొత్తగా రూ.1.96 కోట్లతో నిర్మించనున్న అకడమిక్ బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. జనరల్ సర్జరీ విభాగంలో రూ.15 లక్షలతో సమకూర్చిన లేజర్ మిషన్‌ను ప్రారంభించారు. పలువురు వైద్యులు మంత్రి దృష్టికి సమస్యలను తెచ్చారు. ►ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో రూ.56.25 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన వీఐపీ బ్లాక్‌ను ప్రారంభించారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇక్కడ మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయని చెప్పారు. -
వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు కృషి
⇒ భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ⇒ ఐఐసీటీలో జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: స్వైన్ ఫ్లూ, చికున్‌గున్యా, డెంగీ తదితర వ్యాధులు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వ్యాధికారక వైరస్‌లపై పరిశోధనలను నిర్వహించేందుకు హైదరాబాద్‌లో పరిశోధనశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరమెంతైనా ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చైనా హైదరాబాద్ కేంద్రంగా ఒక వైరల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మంగళవారం ‘ఎమర్జింగ్ అండ్ రీ ఎమర్జింగ్ వైరల్ ఔట్‌బ్రేక్స్ ఇన్ ఇండియా - క్లినికల్ చాలెంజస్ అండ్ మేనేజ్మెంట్’ అన్న అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్సిటీ, సైఫాబాద్‌లోని యూనివర్సిటీ సైన్స్ కాలేజీలు, నిజాం కళాశాల, కోఠీ మహిళా కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ పూణేలోని వైరస్ పరిశోధన కేంద్రంపై ఉన్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో మరో ల్యాబ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశ జనాభా ఇప్పటికే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతోందని, ఆర్థికంగానూ వీటి ప్రభావం ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజా చైతన్యం, వ్యక్తిగత, సామాజిక పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే వైరల్ వ్యాధులను నియంత్రించ వచ్చునని స్పష్టం చేశారు. సాంక్రమిక వ్యాధులపై మార్చిలో సదస్సు వైరస్‌లతో సోకే వ్యాధులు ఇటీవలి కాలంలో కొత్తకొత్త రీతుల్లో దాడి చేస్తున్నాయని, ఫలితంగా వాటి నియంత్రణ కష్టసాధ్యంగా మారిందని అపోలో హాస్పిటల్స్ ఇన్ఫెక్షిస్ డిసీజ్ కన్సల్టెంట్ డాక్టర్ సునీతా నర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి కారక సూక్ష్మజీవులు కొత్తకొత్త రూపాల్లో రావడం... అప్పటివరకూ వ్యాధి సోకని ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తూ ఉండటం, మందులకు నిరోధకత పెంచుకోవడం వల్ల దేశంలో పాత వ్యాధులు మళ్లీమళ్లీ తిరగబెడుతున్నాయని, అదే సమయంలో కొత్త వ్యాధులు కూడా సోకుతున్నాయని ఆమె తెలి పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రజారోగ్య వ్యవస్థ మౌలిక సదుపాయాలను పటిష్ట పరచాల్సి ఉందని, భిన్న వర్గాల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు సంప్రదింపుల ద్వారా తమ అనుభవాలను పంచుకోవాల్సిన అవసరముందని అన్నారు. అన్ని రకాల సాంక్రమిక వ్యాధులపై జిల్లాస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్రాల ప్రజారోగ్య సంస్థలు వ్యాధులపై పరిశోధనలు, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సదస్సు జరగనుందని తెలిపారు. సదస్సులో ఇండియన్ వైరలాజికల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.కె.ప్రసాద్ ముఖ్యోపన్యాసం చేయగా, సదస్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.రాధాకృష్ణ, ఫీవర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ శంకర్, గాంధీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ నాగేందర్, సీసీఎంబీ శాస్త్రవేత్త శైలేంద్ర సక్సేనా, రాజీవ్‌గాంధీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సత్యనారాయణ, సి.పార్థసారథిలు పాల్గొన్నారు.