యోగుల పుట్టుక.. వాగుల పుట్టుక ఎవరికీ తెలీదనేది పాత నానుడి! ఈ వరుసలో వైరస్‌ల పుట్టుక కూడా చేర్చాలని తాజా అనుభవాలు చెబుతున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నిజంగా ప్రకృతి ద్వారా సంక్రమించిందా? లేక జీవాయుధంగా ల్యాబ్ నుంచి విడుదలైందా? అనేది అందరినీ కుదిపేస్తున్న ప్రశ్న. దీనికి వైరాలజిస్టులు ఏమి చెబుతున్నారో చూద్దాం...
ప్రపంచంలో ఎప్పుడు అతిపెద్ద వ్యాధి సంక్రమణం గుర్తించినా, అందరూ అడిగే తొలి ప్రశ్న ఒక్కటే! ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’ అనేది అందరి మెదళ్లను తొలిచే తొలి ప్రశ్న. దీనికి పరిశోధకులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సమాధానం కనుగొనే యత్నం చేస్తారు. తాజాగా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా విలయం పుట్టుపూర్వోత్తరాలపై కూడా ఇదే ప్రశ్న ఉద్భవించింది. దీనికి సమాధానం కోసం పలువురు పరిశోధకులు పలు పరిశోధనలు చేశారు. కానీ, ప్రపంచ గతిని మార్చే ఇలాంటి మహమ్మారుల పుట్టుక గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు! ఉదాహరణకు ప్రపంచాన్ని గడగడలాడించిన హెచ్‌ఐవీ జన్మ గురించి తెలుసుకోవడానికి అది వ్యాపించిన తర్వాత 20 ఏళ్లు పట్టింది.
ఇక ఎబోలా లాంటి కొన్ని వ్యాధుల పుట్టుక గురించి ఇంకా సమాధానం లేదు. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందన్న ఆధారాలున్నా, ఇది ఎప్పుడు, ఎలా మొదలైందనేదానిపై ఇంకా పూర్తిస్థాయి సంతృప్తికర సమాధానాలు లేవు. అసలు వైరాలజిస్టులు ఇలాంటి సూక్ష్మజీవుల జన్మాన్ని ఎలా గుర్తిస్తారనేది ఆసక్తికరమైన విషయం. నిజానికి చాలా వైరస్‌లు, ఇతర సూక్ష్మ జీవులు అడవుల్లో చెట్లను ఆశ్రయించుకొని బతికేస్తుంటాయి. కానీ ఆ చెట్లపై వాటి ప్రభావం పెద్దగా ఉండదు. కానీ ఒక్కసారి అవి తమ హోస్ట్‌ను మార్చిన అనంతరం పరిణామాలు సీరియస్‌గా మారతాయి. వైరస్‌ల పుట్టుపూర్వోత్తరాలు గుర్తించేందుకు అటు ల్యాబ్‌ల్లో ఎంత కష్టపడాలో, ఇటు ఫీల్డులో సైతం అంతే కష్టపడాల్సిఉంటుందని ప్రఖ్యాత వైరాలజిస్టులు వివరిస్తుంటారు. వీటితో పాటు కొంత అదృష్టం కూడా కలిసిరావాలంటారనుకోండి!
మనిషిని రుచి మరుగుతాయి!
సాధారణంగా తీవ్రవ్యాధులు కలిగించే వైరస్‌లు జంతువుల నుంచి తమ అతిధేయి(హోస్ట్)ని మని షికి మార్చుకున్న తర్వాత విజృంభిస్తాయి. ఒక్క సారి మనిషిలోకి వచ్చాక ఇవి విపరీతంగా వ్యాప్తి చెంది పాండమిక్స్(ప్రబల వ్యాధులు)గా రూపాం తరం చెందుతాయి. వీటి జన్మాన్ని గుర్తించే ందుకు వైరాలజిస్టులు తొలుత సదరు వ్యాధి మనుషుల్లో ఉనికిలోకి వచ్చిన ప్రాంతాల్లోని అనారోగ్యకరంగా కనిపించే జంతువులపై పరీక్షలు మొదలుపెడతారు. నిజానికి పైన చెప్పుకున్నట్లు చాలా జంతువు ల్లో ఈ వైరస్‌లు పెద్దగా ప్రభావకరమైన లక్షణాలు చూపించవు. అయినా సరే ముందుగా ఆ ప్రాంతా ల్లో వ్యాధిగ్రస్తమైన జంతువులను పరీక్షించడం జరుగుతుంది. అయితే మనిషి కానీ, జంతువులు కానీ చెట్లలాగా స్థిర జీవులు కావు. కనుక ఒక్కోసారి తొలుత వ్యాధి సోకిన మనిషి లేదా జంతువు తప్పనిసరిగా వ్యాధి బయటపడిన ప్రాంతానికి దగ్గరలోనే ఉండిఉండకపోవచ్చు. –సాక్షి, నేషనల్ డెస్క్
బ్యాడ్ బ్యాట్స్
కరోనా విషయంలో గబ్బిలాలపై అందరి దృష్టి పడటానికి ఒక కారణం ఉంది. పలు కరోనా వైరస్‌లతో పాటు, సార్స్, మెర్స్ తదితర వైరస్‌లకు కూడా ఇవి అతిధేయులు కావడం గమనార్హం. నిజానికి ప్రస్తుత కరోనా వైరస్‌కు దగ్గరా ఉండే వైరస్‌ను 2011–12లో వూహాన్ వైరాలజీ సంస్థ బ్యాట్ కరోనా వైరస్‌ల్లో గుర్తించింది. 2003లో సార్స్ విజృంభణ అనంతరం ఈ సంస్థ గబ్బిలాల్లో కరోనా కారక, సంబంధిత వైరస్‌లను గుర్తించే పనిలో ఉంది. యున్నాన్ ప్రావిన్సులో గబ్బిలాల నుంచి సంస్థ శాంపిళ్లను సేకరించి అధ్యయనాలు నిర్వహించింది. గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లు మనిషికి సంక్రమించే అవకాశాలను గుర్తించేందుకు వీటిని కోతి కిడ్నీ కణాలపై, మానవ ట్యూమర్ కణాలపై సంక్రమింపజేశారు.
ఈ పరిశోధనలో సదరు వైరస్‌లు మనిషి కణాల్లో వేగంగా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దీంతో ఇవి మనిషికి నేరుగా గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు తెలిసింది. అనంతరం సదరు వైరస్‌ల జెనిటిక్ సీక్వెన్స్‌ను అధ్యయనం చేయడం ద్వారా వీటికి దగ్గరగా ఉండే మరో వైరస్ కరోనాకు కారణమని తెలుసుకోగలిగారు. వూహాన్ మాంస మార్కెట్లో తొలిసారి ఈ వ్యాధిని గుర్తించినందున, గబ్బిలాలకు, మనిషికి మధ్య ఇంకో అతిధేయి ఉండే అవకాశాలను కూడా వైరాలజిస్టులు పరిశీలించారు. చివరకు నేరుగానే ఇవి గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు నిర్ధారణకు వచ్చారు. వీటి తర్వాత చాలా కష్టపడి వైరస్ ఫ్యామిలీ ట్రీని కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ఉపయోగించి సృష్టించగలిగారు.
ల్యాబ్ రిలీజ్?
కరోనా గబ్బిలాల నుంచి మనిషికి సోకినట్లు కనుగొన్నా, ఇది ప్రకృతి సహజంగా జరిగిందా? లేక ల్యాబ్ నుంచి రిలీజయిందా? అన్న అంశంపై పలు సందేహాలున్నాయి. తాజాగా 18 మంది ప్రముఖ వైరాలజిస్టులు ఈ ప్రశ్నపై లోతైన విచారణ జరగాలని కోరడం సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న అధ్యయనాల ప్రకారమైతే ల్యాబ్ నుంచి ఈ వైరస్ విడుదలైందనేందుకు అవకాశాలు స్వల్పంగా ఉన్నట్లు కొందరు వైరాలజిస్టులు భావిస్తున్నారు. జెనిటిక్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన వైరస్ ఐతే, దాని జెనిటిక్ కోడ్‌లో మానవ నిర్మిత మార్పులు కనిపించేవని చెబుతున్నారు.
కరోనా జీనోమ్‌లోని స్పైక్ ప్రోటీన్ కోడ్ మెర్స్‌వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్ కోడ్‌కు దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే వైరల్ ఉత్పరివర్తనాల వల్ల సంభవించి ఉందనేది వీరి వాదన. అయితే ఈ విషయమై మరింత పరిశోధన జరగాల్సిఉంది.కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనేందుకు జరిగే పరిశోధనలు భవిష్యత్‌లో రాబోయే విపత్తులను ముందుగా గుర్తించేందుకు, అర్ధం చేసుకునేందుకు తగిన ఆధారాలనిచ్చాయని వైరాలజిస్టులు భావిస్తున్నారు. కానీ ఒక వైరస్ పుట్టుకను కచ్ఛితంగా గుర్తించడమనేది ఇంకా సంపూర్ణంగా సాధ్యంకాదనేది ప్రస్తుతం అర్థమవుతున్న అంశం. కానీ దాని వ్యాప్తిని నివారించడం, వ్యాధిని అదుపు చేయడం మాత్రం పూర్తిగా మనిషి చేతుల్లోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment