
ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే
శ్రీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీపై నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని ఉగ్రవాదిగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) ఎమ్మెల్యే జావేద్ రాణా అభివర్ణించారు. ‘వారు మమ్మల్ని ఉగ్రవాదులుగా పిలుస్తారు..అయితే దేశ ప్రధానే అతిపెద్ద టెర్రరిస్ట్..మానవత్వాన్ని హతమార్చే హంతకుడ’ని జావేద్ రాణా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూంచ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన 2002 గుజరాత్ అల్లర్లను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్‌సీ ఎమ్మెల్యే రాణా గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35-ఏ, 370లకు మార్పులు చేపడితే కాశ్మీర్‌లో భారత జెండా ఎగరదని ఇటీవల రాణా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్టికల్ 370ను రద్దు చేయవద్దని తాను ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించడమే బీజేపీ, ఆరెస్సెస్‌ల అజెండా అని రాణా ఆరోపించారు. ఆర్టికల్ 370పై సుప్రీం కోర్టు విచారణలో వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.