ఢిల్లీ : 'నా దృష్టిలో ఓటు అనే పదానికి చాలా విలువ ఉంది. ఈ ఆయుధంతోనే రాజకీయ పార్టీల భవితవ్యం ముడిపడి ఉంటుంది.అందుకే నా చివరి శ్వాస వరకు నేను ఓటు వేస్తూనే ఉంటానని' 110 ఏళ్ల వృద్దురాలు కలితారా మండల్ పేర్కొన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కలితారా మండల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్రానికి పూర్వం కలితారా మండల్ కుటుంబసభ్యులు బంగ్లాదేశ్‌లోని బరిసాల్ ప్రాంతంలో నివసించేవారు. అయితే బంగ్లాదేశ్ విభజన అనంతరం వీరి కుటుంబం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది.
ఈ నేపథ్యంలో మండల్‌ను ఒక మీడియా చానెల్ పలకరించింది. విభజన తర్వాత తొలిసారి ఓటు ఎప్పుడు వేసారని కలితారా మండల్‌ను అడగ్గా..' నాకు ఆ విషయం గుర్తు లేదు గాని కాంగ్రెస్ పార్టీకి ఎక్కవసార్లు ఓటు వేశాను. విభజన అనంతరం మా కుటుంబం చాలా కాలం శరణార్థుల శిబిరంలో జీవించాము.ఆ తర్వాత మేము అక్కడి నుంచి చత్తీస్‌ఘర్‌కు వెళ్లిపోయాము. నా పెద్దకొడుకు సుఖ్‌రాజన్ మండల్ ఉద్యోగ విషయమై ఢిల్లీకి బదిలీ అవ్వడంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్లేదాన్ని. తర్వాత నా చిన్నకొడుకు వ్యాపారాన్ని ఢిల్లీకి మార్చడంతో అప్పటి నుంచి మేము ఢిల్లీలోనే నివసిస్తున్నాం. అప్పటి నుంచి 2014 వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ప్రధాని మోదీ బొమ్మను చూశాను. ఆయన గురించి నా కుటుంబసభ్యులు వివరించడంతో అప్పటి ఎన్నికలలో హస్తం గుర్తుకు కాకుండా పువ్వు గుర్తుకు ఓటు వేశాను. ఇందిరాగాంధీ మరణించినప్పుడు ఢిల్లీలో తలెత్తిన భీతావహ పరిస్థితులు నాకు ఇంకా గుర్తున్నాయి' అంటూ కలితారా మండల్ చెప్పుకొచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో కలితరా మండల్ ఓటు వేయనున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పమని అడిగితే.. తనకు హస్తం, పువ్వు తప్ప ఇంక ఏం గుర్తులు తెలవదని మండల్ సమాధానమిచ్చారు. 2014లో ఢిల్లీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కలితారా మండల్ తన మనవడిని తీసుకొని వీల్‌చైర్‌లో వెళ్లి ఓటు వేసి వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పోస్టల్ బాలెట్ ద్వారా మండల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఆర్మీ కుటుంబసభ్యలకు మాత్రమే పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే ఢిల్లీ ఎన్నికల సంఘం రాష్ట్రంలో 80ఏళ్లు పైబడిన వృద్దులకు పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించింది. మండల్‌తో పాటు మొత్తం 4వేలమంది పోస్టల్ బాలెట్ ద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment