పండిట్‌ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు! | Who Will Rewrite The Records Of Nehru And Indira Gandhi | Sakshi
Sakshi News home page

పండిట్‌ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!

Published Thu, Mar 30 2023 3:31 PM | Last Updated on Thu, Mar 30 2023 5:11 PM

Who Will Rewrite The Records Of Nehru And Indira Gandhi - Sakshi

దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్‌ సింగ్‌ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ.. డా.మన్మోహన్‌ మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.

ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్‌ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పని చేసిన రికార్డును మోదీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. 

లాంగ్‌ రికార్డ్‌ నెహ్రూదే
స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్‌ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్‌ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్‌ తరఫున ప్రధాని అయిన లాల్‌ బహదూర్‌ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్‌ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు.

తండ్రి తర్వాత కుమార్తెదే రికార్డు:
ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారు. 1980 జనవరి 14న చివరిసారి ప్రధాని అయిన ఇందిరమ్మ 1984 అక్టోబర్‌ 31న హత్యకు గురికావడంతో ఆమె చివరి పదవికాలం 4 ఏళ్ల 291 రోజులకే ముగిసింది. ఇందిరమ్మ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ 1984 డిసెంబర్‌ లోక్‌ సభ ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు.

కాని క్లిష్ట రాజకీయ పరిణామాల కారణంగా ప్రధానిగా ఆయన కొనసాగిన మొత్తం కాలం 5 ఏళ్ల 32 రోజులే. రాజీవ్‌ తర్వాత ప్రధానులైన వి.పి.సింగ్, చంద్రశేఖర్‌ లలో ఏ ఒక్కరూ ఏడాది పాటు ప్రధానిగా కొనసాగలేకపోయారు. వారి తర్వాత ప్రధాని అయిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పీవీ నరసింహారావు మరుసటి ఎన్నికల వరకూ దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు.

కమల సారథ్యం
1990లో దేశంలో బీజేపీ బలపడిన క్రమంలో ఈ పార్టీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజపేయి మొదటిసారి 1996లో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ లేక రెండు వారాలకే దిగిపోవాల్సివచ్చింది. ఆయన తర్వాత ప్రధానులైన జనతాదళ్‌ నేతలు హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ లలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1998, 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల తర్వాత వరుసగా రెండుసార్లు బీజేపీ నేతగా ప్రధాని అయిన వాజపేయి ఈ రెండు సార్లు కలిపి మొత్తం 6 ఏళ్ల 64 రోజులు అధికారంలో ఉన్నారు.
చదవండి: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు!

వాజపేయి పదవీకాలాన్ని డా.మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇద్దరూ దాటేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఏడాది మే నెలలో పదేళ్లు పూర్తిచేసుకుని మన్మోహన్‌ రికార్డును సమం చేసే అవకాశాలు సుస్పష్టమే. అయితే, వరుసగా 11 సంవత్సరాల 59 రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన (నెహ్రూ తర్వాత రెండో రికార్డు) ఇందిరాగాంధీ రికార్డును దాటిపోయే అవకాశం బీజేపీ రెండో ప్రధానికి 2024 లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు కల్పిస్తాయా? అనే విషయం ఏడాదిలో తేలిపోతుంది.


-విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement