
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఇప్పటివరకూ భారత దేశ ప్రధాని పీఠం అధిరోహించినవారిలో నరేంద్ర మోదీనే ఉత్తమ ప్రధాని అంటూ సర్వేలు తేల్చేశాయి. తరువాత స్థానంలో దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఉన్నారు. అయితే ఈ సర్వేలో స్వతంత్ర భారతావని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాలుగో స్థానానికి పరిమితమయ్యారని ‘ఎమ్‌ఓటీఎన్’(మూడ్ ఆఫ్ ది నేషన్) పోల్ ప్రకటించింది. ఇప్పటి వరకూ దేశ ప్రధాని పదవిని అలంకరించిన వారిలో, ఎవరికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉందో తెలుసుకునే ఉద్దేశంతో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో పోల్ నిర్వహించినట్లు సమాచారం.
ఈ పోల్‌లో దాదాపు 12,100 మంది పాల్గొన్నారు. వీరిలో 26 శాతం ఓట్లు సాధించి, మోదీ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇందిరా గాంధీ 20 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, 12 శాతం ఓట్లు సాధించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మూడో స్థానంలో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ 10 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, హెచ్‌డీ దేవేగౌడ చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ సర్వేలో మోదీ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికి గతంతో పోలిస్తే ఈ సారి ఆయనకు వచ్చిన ఓట్లు తగ్గినట్టు తెలుస్తోంది.
గతేడాది(2017) జులైలో నిర్వహించిన ‘ఎమ్‌ఓటీఎన్’ పోల్‌లో మోదీ 33 శాతం ఓట్లు సాధించగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పోల్‌లో 28 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుతం (జులైలో) నిర్వహించిన పోల్‌లో 26 శాతం ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. మోదీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నప్పటికి ఆయనకు వస్తున్న ఓట్లు మాత్రం తగ్గుతున్నట్లు సమాచారం. అయితే మోదీకి ఓటు వేసిన వారిలో ఎక్కువగా హిందూవులే ఉండటం గమనార్హం. దాదాపు 28 శాతం హిందూ ఓటర్లు మోదీకి మద్దతుగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఇందిరా గాంధీకి ముస్లిం ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దాదాపు 26 శాతం మంది ముస్లింలు ఇందిరకు మద్దతు ఇవ్వగా, మోదీకి కేవలం 11 శాతం ముస్లింలు మాత్రమే ఓటు వేసినట్లు సమాచరం. ఉత్తర, తూర్పు భారతదేశంలో మోదీకి ఎక్కువ మంది మద్దతుదారులు ఉండగా.. ఇందిరకు పశ్చిమం, దక్షిణ భారతంలో ఎక్కువ మంది మద్దతు దారులు ఉన్నారు. ఇక అటల్ బీహార్ వాజ్‌పేయి అన్ని దిశల వారి మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment