సాక్షి, బెంగళూరు: దేశంలోని పేదరికానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరోపించారు. 1971లో గరిభీ హఠావో అని దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపునిచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీ కూడా అదే రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. దేశంలోని పేదరికానికి ఎప్పటికీ కారణం కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. కర్ణాటకలోని ఉడుపిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ టీ–షర్ట్‌లు అమ్ముతూ, యాప్ ద్వారా ప్రచారం చేస్తే తప్పేమిటి’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి విరుద్ధంగా కాంగ్రెస్ మహా కూటమిని స్థాపించారని, అసలు ఎన్‌డీఏకు, ఆ కూటమికి పోలికే లేదని ఆమె వ్యాఖ్యానించారు. దొంగ దొంగ అని పిలవడానికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు ఏంటని కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. ఉడుపి–చిక్కమగళూరు లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజేను గెలిపించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment