వెబ్‌డెస్క్ స్పెషల్: భారత దేశ ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు(మే 21). భారత దేశానికి అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని కూడా(40). 1991, మే 21వ తేదీన జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు ఆయన. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. అయితే తాత, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.. రాజీవ్ రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ కోరుకోలేదట!. మరి రాజీవ్‌ను రాజకీయాల్లోకి లాగిన పరిస్థితులు ఏంటో చూద్దాం.
► రాజీవ్ గాంధీ.. 1944 అగష్టు 20న బాంబేలో జన్మించారు. ఇందిర-ఫిరోజ్ గాంధీలు తల్లిదండ్రులు. ఆయన బాల్యమంతా తాత నెహ్రూతో పాటే ఢిల్లీలోని తీన్‌మూర్తి హౌజ్‌లో గడిచింది. ఆపై డెహ్రూడూన్‌లోని వెల్హమ్ స్కూల్, డూన్ స్కూల్స్‌లో చదువుకున్నాడు.
► రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అన్యమనస్కంగానే జరిగిపోయింది. వాస్తవానికి తన మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ ఏనాడూ కోరుకోలేదట. ► బాగా చదువుకుని రాజీవ్ పైలెట్ అవ్వాలని కోరుకున్నాడు నెహ్రూ. ఆయన కోరికకు తగ్గట్లే.. రాజీవ్ చదువులు కొనసాగాయి. కానీ, పరిస్థితులు బలవంతంగా రాజీవ్‌ను రాజకీయాల్లోకి దింపాయని ఇందిరా గాంధీ సైతం పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా.
► రాజీవ్ పైచదువులు.. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదివారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారాయన.
► కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే సోనియా మైనో(సోనియా గాంధీ)తో పరిచయం ఏర్పడింది. 1968లో వీళ్ల వివాహం జరిగింది.
► ఇంగ్లండ్ నుంచి భారత్‌కు చేరుకున్నాక.. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావడంతో పాటు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కూడా దక్కించుకున్నారు రాజీవ్ గాంధీ. తద్వారా డొమెస్టిక్ నేషనల్ కెరీర్‌లో ఆయన పైలెట్ కాగలిగారు.
► 1983లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సోదరుడు సంజయ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. అప్పటిదాకా జనాల్లోకి రావడం ఇష్టడని రాజీవ్ గాంధీ.. బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇది ఇందిరా గాంధీకి కూడా ఇష్టం లేదని చెప్తుంటారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు.
► ఇందిరా గాంధీ హత్య తర్వాత.. పార్టీ శ్రేణుల మద్ధతు, సీనియర్ల అండతో 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.
► 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. 508 స్థానాలకు గానూ ఏకంగా 401 సీట్లు దక్కించుకుంది రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.
► కేవలం 40 ఏళ్ల వయసులో దేశానికి ప్రధాని బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాందీ. ఆ ఘనతను ఇప్పటివరకు ఎవరూ చెరిపేయలేకపోయారు.
► టెలిఫోన్లు, కంప్యూటర్లు ఈయన హయాంలోనే భారత్‌లో ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. ఫాదర్ ఆఫ్ ఐటీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని రాజీవ్ గాంధీని ప్రశంసిస్తుంటారు.
► రాహుల్, ప్రియాంక.. రాజీవ్‌గాంధీ-సోనియాగాంధీల సంతానం.
► తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. రాజీవ్ గాంధీ తర్వాత.. యూపీకి చెందిన జనతాదళ్ నేత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రధాని అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment