Rajiv Gandhi death anniversary
-
Rajiv Gandhi వర్ధంతి.. ఆ దుర్ఘటనే రాజకీయాల్లోకి లాక్కొచ్చింది
వెబ్‌డెస్క్ స్పెషల్: భారత దేశ ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు(మే 21). భారత దేశానికి అత్యంత పిన్నవయస్కుడైన ప్రధాని కూడా(40). 1991, మే 21వ తేదీన జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దుర్మరణం పాలయ్యారు ఆయన. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. అయితే తాత, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. రాజీవ్ రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ కోరుకోలేదట!. మరి రాజీవ్‌ను రాజకీయాల్లోకి లాగిన పరిస్థితులు ఏంటో చూద్దాం. ► రాజీవ్ గాంధీ.. 1944 అగష్టు 20న బాంబేలో జన్మించారు. ఇందిర-ఫిరోజ్ గాంధీలు తల్లిదండ్రులు. ఆయన బాల్యమంతా తాత నెహ్రూతో పాటే ఢిల్లీలోని తీన్‌మూర్తి హౌజ్‌లో గడిచింది. ఆపై డెహ్రూడూన్‌లోని వెల్హమ్ స్కూల్, డూన్ స్కూల్స్‌లో చదువుకున్నాడు. ► రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అన్యమనస్కంగానే జరిగిపోయింది. వాస్తవానికి తన మనవడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నెహ్రూ ఏనాడూ కోరుకోలేదట. ► బాగా చదువుకుని రాజీవ్ పైలెట్ అవ్వాలని కోరుకున్నాడు నెహ్రూ. ఆయన కోరికకు తగ్గట్లే.. రాజీవ్ చదువులు కొనసాగాయి. కానీ, పరిస్థితులు బలవంతంగా రాజీవ్‌ను రాజకీయాల్లోకి దింపాయని ఇందిరా గాంధీ సైతం పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ► రాజీవ్ పైచదువులు.. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదివారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేశారాయన. ► కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే సోనియా మైనో(సోనియా గాంధీ)తో పరిచయం ఏర్పడింది. 1968లో వీళ్ల వివాహం జరిగింది. ► ఇంగ్లండ్ నుంచి భారత్‌కు చేరుకున్నాక.. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావడంతో పాటు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కూడా దక్కించుకున్నారు రాజీవ్ గాంధీ. తద్వారా డొమెస్టిక్ నేషనల్ కెరీర్లో ఆయన పైలెట్ కాగలిగారు. ► 1983లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సోదరుడు సంజయ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. అప్పటిదాకా జనాల్లోకి రావడం ఇష్టడని రాజీవ్ గాంధీ.. బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇది ఇందిరా గాంధీకి కూడా ఇష్టం లేదని చెప్తుంటారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు. ► ఇందిరా గాంధీ హత్య తర్వాత.. పార్టీ శ్రేణుల మద్ధతు, సీనియర్ల అండతో 1984లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ► 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. 508 స్థానాలకు గానూ ఏకంగా 401 సీట్లు దక్కించుకుంది రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ► కేవలం 40 ఏళ్ల వయసులో దేశానికి ప్రధాని బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాందీ. ఆ ఘనతను ఇప్పటివరకు ఎవరూ చెరిపేయలేకపోయారు. ► టెలిఫోన్లు, కంప్యూటర్లు ఈయన హయాంలోనే భారత్‌లో ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. ఫాదర్ ఆఫ్ ఐటీ అండ్ టెలికాం రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అని రాజీవ్ గాంధీని ప్రశంసిస్తుంటారు. ► రాహుల్, ప్రియాంక.. రాజీవ్‌గాంధీ-సోనియాగాంధీల సంతానం. ► తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. రాజీవ్ గాంధీ తర్వాత.. యూపీకి చెందిన జనతాదళ్ నేత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) ప్రధాని అయ్యారు. -
రాజీవ్ గాంధీ హత్య.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
అది 1991 మే 21. సమయం రాత్రి 10.30. కొత్త ఢిల్లీలోని 10– జనపథ్ రోడ్లో ఉన్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ పర్సనల్ సెక్రెటరీ వి. జార్జ్ రూమ్‌లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. జార్జ్ రిసీవర్ ఎత్తి హలో అనగానే, అటు నుండి ‘దిస్ ఈస్ సీఐడీ ఆఫీసర్ ఫ్రమ్ చెన్నై సర్. మేడం (సోనియా గాంధీ)తో మాట్లాడాలండీ‘ అని ఆదుర్దాగా అన్నాడు. జరగరానిదేదో జరిగిందని జార్జ్ సిక్స్త్ సెన్స్ శంకించింది. ‘బాస్ (రాజీవ్) ఎలా ఉన్నారు?’ వణకుతున్న గొంతుతో జార్జ్ ప్రశ్న. ‘సర్ మేడంకి ఇవ్వండి ఫోన్’ అటునుండి అర్థింపు. ‘నేను అడుగుతుంది బాస్ ఎలా ఉన్నాడు అని’... ఈ సారి కటువుగానే అడిగాడు పీఏ జార్జ్. ‘సర్... హి ఈస్ నో మోర్...’ అంతే... లైన్ డిస్ కనెక్ట్ అయింది. చదవండి: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు ఆ రోజు ఉదయం (21.5.1991) నుండి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు? ఒరిస్సాలో ఎన్నికల సభల్లో మాట్లాడి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సర్క్యూట్ హౌజ్ చేరుకున్నారు. పదవ లోక్‌సభ (1991) ఎన్నికలకు 40 శాతం సీట్లను ఆయన యువతకే కేటా యించారు. అందులో వైజాగ్ లోక్‌సభ కాండిడేట్, 38 సంవత్సరాల ఉమా గజపతి రాజు కూడా ఒకరు. ఆమె కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడే ఢిల్లీ నుండి సోనియా ఫోన్! వెంటనే బయల్దేరి ఢిల్లీకి వచ్చేయమని ఆమె కోరింది. ‘మరగతం (చంద్రశేఖర్) ఆంటీ... మమ్మీ (ఇందిరాజీ) క్లోజ్ ఫ్రెండ్. ఈ రాత్రి ఆమె సభను (శ్రీపెరుం బుదూర్) అడ్రస్ చేసి రేపు ఉదయం ఫస్ట్ ఫ్లైట్‌కి ఇంటికి చేరుకుంటాను’ అన్నారు రాజీవ్. ఫోన్ పెట్టేశారు సోనియా. తమ ఇంట్లో డిన్నర్ చేసి వెళ్లమన్నారు ఉమ. ‘నో ఉమా, లెట్ మీ మూవ్’ (మృత్యువు పిలుపు కాబోలు) అంటూ, మందహాసంగా ఆమె రిక్వెస్ట్‌ను తోసిపుచ్చారు బాస్. తమిళనాడు శ్రీపెరుంబుదూర్ సభా ప్రాంగణం ఆ రాత్రి ఫ్లడ్ లైట్ల కాంతిలో, కాంగ్రెస్ కార్యకర్తలు, క్రిక్కిరిసిన శ్రోతలతో పండగ వాతావరణం సంతరించుకుంది. లౌడ్ స్పీకర్లలో తమిళ తల్లిని కీర్తిస్తూ పాటలు! మరో వైపు రంగు రంగుల పూలతో అలంకరించిన అతి పెద్ద వేదిక మీద తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుపయ్య మూపనార్, ఇతర నాయకులూ; పార్టీ అభ్యర్థీ, సీనియర్ నాయకురాలూ అయిన మరగతం చంద్రశేఖర్ వంటివారు ఉత్సాహంగా రాజీవ్‌గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు. చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్ ప్రాంతం చుట్టుముట్టు తమిళ ఉగ్రవాదుల ‘స్లీపర్ సెల్స్’ మాటేసి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ‘లిబరే షన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’ (ఎల్టీటీఈ) హిట్ లిస్ట్‌లో ఉన్న మొదటి ఇండియన్ లీడర్ రాజీవ్ గాంధీ! రాత్రి వేళల్లో తమిళనాడులో ఓపెన్ మీటింగులకు ఆయన రావటం రిస్కుతో కూడుకున్న పని అని పోలీసు నిఘావర్గం అప్పటికే తెలిపింది. అయినా రాత్రి 9 గంటలకు ఈ సభలో ప్రసంగించాలని బయలు దేరారు రాజీవ్. విధిలీల! సభా ద్వారం నుండి ఎర్ర తివాచీపై నడుస్తూ... నవ్వుకుంటూ అభిమానుల చేతులు కలుపుతూ ఒక్కొక్క అడుగే వేస్తున్నారు. జనసమూహం నుండి ఆతన్ని వేరు చేయటానికి స్థానిక పోలీసులు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రదీప్ గుప్తా శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పంజాబీ డ్రస్ ధరించి కళ్లజోడు పెట్టుకున్న 16 ఏళ్ల చామన చాయ యువతి, చందనపు దండ పట్టుకుని రాజీవ్‌కు ఎదురుగా ప్రత్యక్షమైంది. నవ్వుతూ ఆయన మెడలో ఆ దండ వేసింది. ఆమెను వారిస్తూ ఒక వైపు తోసే ప్రయత్నం చేసింది లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. ఆమెను చూసి చిరునవ్వుతో ‘రిలాక్స్ బేబీ’ అని అపారాయన. అదే అదునుగా ఆయనకు పాదాభివందనం చేస్తున్నట్టు ముందుకు వంగింది ఆ అమ్మాయి (థాను). అంతే...! చెవులు చిల్లులు పడే శబ్దంతో బాంబు పేలటం, రెప్పపాటులోనే రాజీవ్ గాంధీ శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరి పోవటం జరిగిపోయింది. ఈ భీకర సంఘటన అప్పటి దేశ రాజకీయ చదరంగంలో అతి పెద్ద మలుపునకు దారితీసింది. 48 సంవత్సరాల కాంగ్రెస్ యువనేత రాజీవ్ గాంధీకి బదులు 68 సంవత్సరాల దక్షిణాది తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధాని పీఠం అధిరోహించారు. (రషీద్ కిద్వాయి గ్రంథం ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా...) - జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ (మే 21న రాజీవ్ గాంధీ వర్థంతి) -
ప్రపంచ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. రాజీవ్‌ను హత్య చేసిన మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ ముఖ్య నేతలు చిన్నారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాంకేతిక సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ అని, దేశ ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశంలోకి కంప్యూటర్లు, సెల్ఫోన్ల ప్రవేశానికి రాజీవే కారకుడని, పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసింది కూడా ఆయనేనని కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్తమ్ నివాళులర్పించారు. అనంతరం ప్రకాశం హాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, దేశంకోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ చిరస్మరణీయుడని అన్నారు. రాజీవ్ చనిపోయిన 28 ఏళ్ల తర్వాత ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని, రాజకీయ అనైతికతకు నిదర్శనమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వెల్లడయిన ఎగ్జిట్‌పోల్స్‌ను తాము నమ్మడం లేదని, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో తమకు ఆశించిన ఫలితాలు వస్తాయని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో భారత్ అన్ని రంగాల్లో ముందుండేందుకు రాజీవ్‌గాంధీ ఆలోచనా విధానమే కారణమన్నారు. ఆయన తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే దేశంలో ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో భారతీయులు మూడో వంతు ఉండడానికి రాజీవ్ తీసుకువచ్చిన సంస్కరణలే కారణమన్నారు. రాజీవ్ మరణంపై మోదీ వ్యాఖ్యలు దారుణమని, దేశంలో రాజకీయ తీవ్రవాదాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉండాలనే ఆలోచనతో 18 ఏళ్లకే ఓటు హక్కు తీసుకువచ్చింది రాజీవ్ అని, కేంద్రం నుంచి నేరుగా గ్రామాలకు నిధులివ్వాలనే ఆలోచన కూడా ఆయనదేనని అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ మాట్లా డు తూ, ప్రధానిగా ఉన్న ఐదేళ్లలో దేశాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని, ఐటీని అగ్రగామిగా నిలపడంలో రాజీవ్ పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. -
రాజీవ్‌కు ‘మహా’ నివాళి
ముంబై: నగరంలో కాంగ్రెస్ నేత, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజీవ్ గాంధీ భవన్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు ఆర్పించారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మంత్రాలయకు చేరకున్న సీఎం పృథ్వీరాజ్ చవాన్ అక్కడ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంతో పాటు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రాజకీయాల్లో మంచి మార్పు తీసుకొచ్చిన నేత అని స్మరించుకున్నారు. కాగా, నగరంలోని రాజ్ భవన్లో గవర్నర్ కె.శంకర్ నారాయణన్ సిబ్బం దితో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చెయ్యించారు.