సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కొందరు రాజకీయ నాయకులు ఉపయోగించిన పదాలు చరిత్రలో ఎల్లకాలం మిగిలిపోతాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో (దారిద్య్రాన్ని నిర్మూలించండి)’ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ‘అచ్చేదిన్ (మంచి రోజులు)’ అలాంటి పదాలే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ‘అచ్చే దిన్ ఆనా వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’ అంటూ పదే పదే చెబుతూ వచ్చారు. ఆయన చెప్పిన అచ్చేదిన్ వచ్చాయా ? అంటే బాలీవుడ్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘కోయి లౌటా దే మెరే బీతే హుహే దిన్’ పాట గుర్తుకు వస్తుంది. గతించిన రోజులను ఎవరైన తీసుకరాగలరా ?
నరేంద్ర మోదీ రాజకీయ పరిభాషలో ఉపయోగించిన ఎన్నో హిందీ, ఇంగ్లీషు పదాలు ఎన్నో ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2016లో భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టు స్థావరాలపై దాడులు నిర్వహించడాన్ని ఆయన తొలి ‘సర్జికల్ స్ట్రైక్స్’ అని వర్ణించారు. అదే సంవత్సరం నవంబర్‌లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ‘ఇది దేశంలోని నల్లడబ్బు, ఉగ్రవాదులకు అందే నిధులు, మాదకద్రవ్యాల డబ్బుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అని అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలం అవడంతో ప్రతిపక్ష పార్టీలు ‘పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అంటూ విమర్శించాయి.
నరేంద్ర మోదీ ప్రజా సభల్లో ప్రసంగించినప్పుడల్లా ‘భాయియో ఔర్ బహెనో’ అని సంబోధించడం ఆయనకు అలవాటు. అయితే పాకిస్థాన్‌పై జరిపిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఆయన ‘మిత్రో, మేరే ప్యారీ దేశీవాసీయోం’ అంటూ ప్రజలను సంబోధించడం ప్రారంభించారు. అవి కూడా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వచ్ఛ్ (భారత్), గోరక్షక్, న్యూస్ ట్రేడర్, ప్రెస్టిట్యూట్ పదాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం ‘నా మున్కిన్ అబ్ మున్కిన్ హై’ నినాదం పేరిట వాణిజ్య ప్రకటనలతో అదరగొట్టగా ‘మోడీ హైతో మున్కిన్ హై’ అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ పదాల పటాటోపం ఏ మేరకు ఓట్లను కురిపిస్తుందో చూడాలి!.
Comments
Please login to add a commentAdd a comment