
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత విశ్వసనీయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాజీందర్ కుమార్ (ఆర్కే) ధావన్ (81) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని బీఎల్ కపూర్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 7 గంటలప్పుడు ధావన్ మరణించినట్లు ఆయన కుటుంబ సన్నిహితుడొకరు వెల్లడించారు. కేంద్రమంత్రిగానూ పనిచేసిన ధావన్‌ను వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాలతో గత మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు.
ఆయనకు కేన్సర్ ఉంది. రక్తంలో ఇన్‌ఫెక్షన్ పెరగడం, మూత్రపిండాలు దెబ్బతినడంతో ధావన్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘కాంగ్రెస్ సీనియర్ నేత ధావన్ మరణించారు. ఆయన మృతికి మా సంతాపం తెలుపుతున్నాం. కాంగ్రెస్ కోసం ఆయన చూపిన అవిశ్రాంత స్ఫూర్తి, అపరిమిత నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కూడా ధావన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఇందిర కాలంలో విశేషాధికారాలు
1962–84 మధ్య ఇందిరా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా ధావన్ పనిచేశారు. 1975లో అత్యవసర స్థితి విధించినప్పుడు ఇందిరకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ధావన్ ఒకరు. వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో ధావన్‌కు విశేషాధికారాలు ఉండేవనీ, ఇందిరను ఎవరు కలవాలి? ఆమెకు ఏయే సమాచారం అందించాలి, ఏ విషయాలు చెప్పకూడదు? లాంటివన్నీ ధావన్ నియంత్రించేవారని అంటుంటారు. ఇందిర హత్యలో ధావన్‌కు హస్తముందని గతంలో ఆరోపణలొచ్చాయి. దీంతో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక ధావన్‌ను పక్కన బెట్టారనే వాదన ఉంది. అయితే రాజీవ్ హయాంలోనే 1990లో ఆయన కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీ అయ్యారు. సీడబ్ల్యూసీలో సభ్యుడిగా ఉన్నారు. 1995–96 కాలంలో గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా చేశారు. 74 ఏళ్ల వయసులో, 2012లో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment