కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్‌లో భారత ప్రజావస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ నేతలు ఆయన్ను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు కూడా. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన లండన్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.
ఐనా ఏ వ్యక్తికి అయినా దేశం వెలుపల మాట్లాడే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ తోపాటు బాధ్యతయుతంగా ప్రవర్తించడం అనేది అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిగా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. ఆమె హయాంలోనే పౌర హక్కులు హరించడం జరిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు రాహుల్ నానమ్మ(ఇందిరా గాంధీ) చట్టబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 356ని 150 సార్లు ప్రయోగించారన్నారు.
అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను గురించ చెబుతూ ..దాన్ని దూరదృష్టితో కూడిన చర్యగా అభివర్ణించారు. చైనాకు సంబంధించిన బీఆర్‌ఐ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తోందని ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, అదానీ సమస్యపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కారణంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదాపడ్డాయి. అదానీ స్టాక్స్ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాల చేయడంతో ఐదో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి వాయిదా పడింది.
(చదవండి: సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. పిల్‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ మండిపాటు)
Comments
Please login to add a commentAdd a comment