ఐయామ్‌ సారీ జెంషెడ్‌ టాటా!.. ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు? | Indira Gandhi Wrote A Letter To JamShedji TATA | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు?

Published Sat, Oct 9 2021 8:19 PM | Last Updated on Sat, Oct 9 2021 8:57 PM

Indira Gandhi Wrote A Letter To JamShedji TATA - Sakshi

ఎయిరిండియాను టాటా సన్స్‌ తిరిగి సొంతం చేసుకోవడంతో ఒక‍్కసారిగా ఎయిర్‌ ఇండియా, టాటా గ్రూప్‌ల మధ్య ఉన్న బంధం మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే ఎయిరిండియా విషయంలో అప్పటి టాటా చైర్మన్‌ జెంషెడ్‌ రతన్‌ టాటా, భారత ప్రభుత్వంల మధ్య జరిగిన పలు విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమర్జెన్సీ అనంతరం వచ్చిన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించిన వివరాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఓ లేఖలో జెంషెడ్‌జీ టాటాకు వెల్లడించారు. ఇప్పుడా లేఖను మాజీ కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇందిరాగాంధీ రాసిన లేఖకు జెంషెడ్‌ రతన్‌ టాటా రాసిన ప్రత్యుత్తరాన్ని సైతం జైరామ్‌ పోస్టు చేశారు. 


ఏవియేషన్‌ రంగంపై మక్కువ పెంచుకున్న జెంషెడ్‌జీ టాటా స్వయంగా విమానం నడపడం నేర్చుకుని పైలెట్ లైసెన్సు పొందారు. ఆ తర్వాత టాటా ఎయిర్‌లైన్స్‌ పేరుతో 1932లో దేశంలో తొలి విమాన సర్వీసులు ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా సర్వీసులను విస్తరిస్తూ పోయారు. ఈ క్రమంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత టాటాల ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్‌ ఇండియాను 1952లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. రూ. 2.8 కోట్లు చెల్లించి టాటాల నుంచి పూర్తిగా ఎయిర్‌ ఇండియాను కొనేసింది. అయితే ఆ ఎయిర్‌ ఇండియాకి చైర్మన్‌గా జెంషెడ్‌ టాటానే నియమించింది. అలా 1952 నుంచి 1978 వరకు ఆ పదవిలో జెంషెడ్‌  రతన్‌ టాటా కొనసాగారు. అయితే 1978లో భారత ప్రభుత్వం ఏకపక్షంగా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో దేశ ప్రధానిగా మొరార్జీ దేశాయ్‌ ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో అంటే 1978 ఫిబ్రవరి గువహాటి నుంచి కొల్‌కతాకు విమానంలో ప్రయాణిస్తూ జెఆర్‌డీ టాటాకి ఇందిరాగాంధీ ఈ లేఖ రాశారు.

నన్ను క్షమించండి
డియర్‌ జే,  నన్ను క్షమించండి ,  ఎయిరిండియాతో మీ అనుబంధం ముగిసింది. మీరు ఇకపై ఎంత మాత్రం దానిలో భాగస్వామి కాదు. ఎయిరిండియా నుంచి మిమ్మల్నీ దూరం చేయడం అంటే మీ నుంచి మిమ్మల్ని దూరం చేయడమే. మీరు కేవలం ఎయిర్‌ఇండియాకు చైర్మన్‌ మాత్రమే కాదు. అందులో విమానాల డెకరేషన​ దగ్గర నుంచి ఎయిర్‌ హోస్టెస్‌లు ధరించే చీరల వరకు ప్రతీ చిన్న విషయాన్ని , మీరే దగ్గరుండి చూసుకునేవారు.  మీవల్లే ప్రపంచంలోనే ఎయిర్‌ ఇండియా గొప్ప సంస్థలలో ఒకటిగా ఎదిగింది. మిమ్మల్నీ, మీరు నిర్వహించిన ఎయిర్‌ఇండియాను చూసి మేము గర్విస్తున్నాం. ఈ పని చేసినందుకు మీకు కలిగిన ఆత్మసంతృప్తిని మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఈ విషయంలో ప్రభుత్వం మీకు రుణపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఎంతో ఒత్తిడి తెచ్చారు
కొన్ని విషయాల్లో మన మధ్య అపార్థాలు చోటు చేసుకున్నాయి. అలా ఎందుకు జరిగిందనే విషయాలను నేను మీకు వివరించలేను. ప్రభుత్వ నిర్వాహణలో ఉన్నప్పుడు.. సివిల్‌ ఏవియేషన్‌ మినిస్ట్రీలో మీకు ప్రత్యర్థులుగా ఉన్న వారు నాపై ఎంతో ఒత్తిడి తెచ్చేవారు.  ఇంతకు మించి నేను మీకు ఏమీ చెప్పలేను అంటూ ఆ లేఖను ఇందిరాగాంధీ ముగించారు. ఈ లేఖలో జెంషెడ్‌ టాటాను ఎయిర్‌ఇండియా చైర్మన్‌ పదవి నుంచి తొలగించేందుకు అనేక ఒత్తిళ్లు వచ్చాయని, అయినా సరే తాను ఆ పని చేయలేదనే అర్థం వచ్చేలా ఇందిరాగాంధీ తెలిపారు.  అలా ఒత్తిడి తెచ్చిన వ్యక్తులే.. ఆ తర్వాత ప్రధానిగా ఉన్న మురార్జీదేశాయ్‌పై ఒత్తిడి తెచ్చి జెంషెడ్‌ టాటాను చైర్మన్‌ పదవి నుంచి పక్కకు తప్పించారా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ అలా ఒత్తిడి తెచ్చిన ఆ వ్యక్తులు ఎవరు అనే ఆసక్తి నెలకొంది. ఇక ఇందిరాగాంధీ నుంచి  లేఖను అందుకున్న పద్నాలుగు రోజుల తర్వాత 1978 ఫిబ్రవరి 28న ముంబై నుంచి ఇందిరాగాంధీకి  జెంషెడ్‌ టాటా తిరుగు ఉత్తరం రాశారు. 

వారి వాల్లే ఇదంతా
ఎయిర్‌ ఇండియాతో నా అనుబంధాన్ని తెంచేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఈ సమయంలో మీరు నాకు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. ఎయిర్‌ ఇండియా ఉన్నతికి నేను చేసిన కృషిని మీ లేఖలో వివరించిన తీరు నా మనసుని ఆకట్టుకుంది. ప్రభుత్వ సహకారం, స్నేహితుల ప్రోత్సాహం,  ఉద్యోగుల విధేయత, కష్టించే తత్వం వల్లనే ఎయిరిండియా ఆ స్థాయికి చేరుకుంది. వారు చేసిన పని ముందు నేను చేసింది చాలా తక్కువ. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను అంటూ జెంషెడ్‌ టాటా చెప్పారు. 

చదవండి : వెల్‌కమ్‌ బ్యాక్‌ ఎయిర్‌ ఇండియా - రతన్‌ టాటా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement