చూడడానికి అది ఆరు సెకన్ల వీడియోనే కావచ్చు. కానీ, సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టిన ఆ వివాదాస్పద వీడియో ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే పరిస్థితి తెచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్వయంగా ఆమె అంగరక్షకులే పొట్టనపెట్టుకున్న ఘట్టాన్ని సమర్థిస్తూ రూపొందించిన ప్రదర్శన శకటం ఒకటి కెనడాలోని బ్రాంప్టన్ నగరవీధుల్లో తిరిగిన వైనం భారత్, కెనడాల్లో విస్తృత చర్చ రేపింది.
వేర్పాటువాద ఖలిస్తాన్ మద్దతుదారుల ఈ శకట ప్రదర్శన ఏ రకంగా చూసినా ఆక్షేపణీయమే. భారత వ్యతిరేక వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు బలం పుంజుకుంటున్న వైనానికి ఈ ప్రదర్శన మరో ఉదాహరణ. మన దేశ రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో కెనడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. క్షమాపణ కోరాయి. కెనడా సైతం వెంటనే విచారం వ్యక్తం చేసింది కానీ, ఆ మాట సరిపోతుందా? భారత్‌తో సత్సంబంధాలు కొనసాగాలని ఆ దేశం నిజంగా కోరుకుంటే, చేయాల్సింది చాలానే ఉంది.
అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో దాగిన సిక్కు తీవ్రవాదుల ఏరివేత కోసం 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ వివాదాస్పద సైనిక చర్య ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు దిగడం, అనంతరం కొన్నాళ్ళకు సొంత బాడీ గార్డ్‌లే విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆమెను పొట్టనపెట్టుకోవడం చరిత్రలో మహా విషాదం. ఆపరేషన్ బ్లూస్టార్ 39వ వార్షికోత్సవ సందర్భాన రెండు రోజుల ముందే జూన్ 4న కెనడాలో ఈ 5 కిలోమీటర్ల ప్రదర్శన శకటాల కవాతు జరిగింది.
ప్రదర్శనలు జరిపే స్వేచ్ఛ కెనడా ప్రభుత్వం తన పౌరులకు ఇవ్వవచ్చు. కానీ, ఆ శకటంపై సిక్కు గార్డులు తుపాకీలు ఎక్కుపెట్టగా, చేతులు పైకెత్తి, తెల్లచీరలో ఎర్రటి రక్తపు మోడుగా మారిన మహిళ (ఇందిర) బొమ్మ పెట్టి, ‘దర్బార్ సాహిబ్‌పై దాడికిది ప్రతీకారం’ అంటూ వెనకాలే పోస్టర్ ప్రదర్శించడం సహించ రానిది. దారుణహత్యను సైతం ప్రతీకారంగా పేర్కొంటున్న ఈ ప్రదర్శనను అనుమతించే సరికి పొరుగుదేశ ప్రధాని హత్యను సమర్థిస్తున్నవారిని కెనడా వెనకేసుకొస్తోందని అనిపిస్తుంది.
పంజాబ్‌లో తీవ్రవాదం తారస్థాయిలో ఉన్నరోజుల్లో కెనడా, అమెరికా తదితర దేశాలు ఈ వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పించాయి. విదేశాల్లో స్థిరపడ్డ వేర్పాటువాదులు అక్కడ నుంచి భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తున్నారు. అక్కడ నుంచి రెచ్చగొట్టే ప్రకట నలు చేస్తూ, వేర్పాటువాదానికి నిధులు సమకూరుస్తూ, ఖలిస్తాన్ ఉద్యమానికి ఊపిరులూదు తున్నారు.
అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. భారత వ్యతిరేక రిఫరెండమ్‌లు, కార్యక్రమాలు జరపడమే కాదు... హిందూ ఆలయాలపై దాడులు, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో భారతీయులపై హింసాకాండ ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి. ఈ ఏడాది బ్రిట న్‌లో భారత హైకమిషన్ కార్యాలయంలో ఖలిస్తానీలు పాల్పడ్డ భద్రతా ఉల్లంఘన ఘట్టం లాంటివి ఆందోళన పెంచుతున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో తాజా శకట ప్రదర్శన పరాకాష్ఠ.
చిత్రం ఏమిటంటే – భారత్‌లో, మరీ ముఖ్యంగా అమృత్‌సర్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ స్మరణోత్స వాలు ఏళ్ళు గడిచేకొద్దీ హేతుబద్ధంగా మారాయి. పంజాబీలు పాత చేదు జ్ఞాపకాలను వెనక్కినెట్టి, చాలా ముందుకు వచ్చారు. శాంతిని కోరుకుంటున్నారు. అకాల్‌తఖ్త్ సైతం ఈ ఏడాది మాదక ద్రవ్యాలు, ఇతర సామాజిక రుగ్మతలతో సతమతమవుతున్న గ్రామాల్లో సంస్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. పంజాబ్‌లో పరిస్థితులు ఇలా ఉంటే, పరాయిగడ్డ మీది సిక్కులు వేర్పాటువాద ఉగ్రవాదానికి నారుపోసి, నీరు పెట్టాలనుకోవడం శుద్ధ తప్పు.
కెనడాలో దాదాపు 2 శాతం జనాభా (దాదాపు 8 లక్షలు) ఉన్న సిక్కుల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్న ఆ దేశ నేతలేమో ఖలిస్తానీల్ని లాలించి, బుజ్జగిస్తున్నారు. సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం సిక్కు ఓటర్లను ఆకట్టుకొనేందుకు గతంలో అధికారిక నివేదికల నుంచి ఖలిస్తానీ తీవ్రవాద ప్రస్తావనలను సైతం తొలగించిన రకం. 2018లో భారత పర్యటనకు వచ్చినప్పుడు గతంలో భారత మంత్రిపై హత్యా యత్నం చేసిన ఖలిస్తానీ నిందితుడితోనే కలసి ఫోటోలు దిగడం వివాదాస్పదమైంది.
1985 ప్రాంతంలో టొరంటో నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని ఖలిస్తానీ తీవ్రవాదులు పేల్చివేయగా, అందులోని 329 మందీ మరణించిన ఘటనను కెనడా నేతలు మర్చి పోయారా? ఆ మృతుల్లో అత్యధికులు కెనడియన్లే అయినా, ఓటుబ్యాంక్ లెక్కలతో దాన్ని ఇప్పటికీ భారతదేశానికి సంబంధించిన విషాదంగానే పరిగణిస్తున్న వైనాన్ని ఏమనాలి? పాలు పోస్తున్న పాము రేపు తమ చేతినే కాటు వేయదన్న నమ్మకం ఏముంది? ఇప్పటికైనా కెనడా కళ్ళు తెరవాలి.
ప్రజాస్వామ్యం, బహుళ జాతీయతలకు తమ దేశం ప్రతీక అని జబ్బలు చరుచుకొంటూ ప్రజా స్వామ్యం, శాంతి, సౌభ్రాత్రం, చట్టబద్ధ పాలనపై భారత్‌కు తరచూ ఉపదేశాలిచ్చే ట్రూడో ముందు తమ పెరట్లో జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలి. బోలెడంత భవిష్యత్తున్న భారత, కెనడా వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాల్లో కాలిముల్లుగా తయారైన ఖలిస్తాన్ లాంటి అంశాలపై నిర్ద్వంద్వమైన అవగాహనకు రావాలి.
భారత విచ్ఛిన్నాన్ని కోరుతున్న శక్తులపై కఠినంగా వ్యవహరించాలి. మన ప్రభుత్వం కూడా ఈ విషయంలో కెనడాపై దౌత్య, రాజకీయ ఒత్తిడి పెంచాలి. విద్వేషం వెదజల్లే వారిని నయానో, భయానో వంచాలి. ఒక్క కెనడాలోనే కాక వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఖలిస్తానీ నిరసనలపై దృష్టి సారించి, విస్తృత దౌత్య వ్యూహంతో వాటిని మొగ్గలోనే తుంచాలి. ఇంటా, బయటా మరో ఆపరేషన్ బ్లూస్టార్ అవసరం రాకుండా చూడాలి.
ఉపేక్షించలేని ప్రదర్శన!
Published Tue, Jun 13 2023 12:49 AM | Last Updated on Tue, Jun 13 2023 9:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment